రాజకీయాలే గెలిచాయ్
నాలుగేళ్ల మైత్రీ బంధానికి తెరపడింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ, టీడీపీ సంకీర్ణానికి చెల్లు చీటీ చెప్పేశారు. ఇక టీడీపీకి ఎన్డీఏ తో అనుబంధమనేది అలంకారప్రాయం. లాంఛనమే. విడాకులిచ్చి కూడా మంగళసూత్రం మెడలో ఉంచుకున్న తంతే. మొత్తం ఎపిసోడ్ లో కన్వీయన్స్ ఆఫ్ పాలిటిక్స్ కథే నడిచింది. ఎట్టకేలకు రాజకీయాలే గెలిచాయి. ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు. నాటకీయత జోడించారు. బంధం తెంపేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది మొదలు ఇంతవరకూ సాగుతూ వస్తున్న హైడ్రామాకు తెరపడింది. ఇక బీజేపీ, టీడీపీలు ఏపీలో విడివిడిగా పోటీ చేయాల్సిన ప్రత్యర్థులుగా మారాయి. ఇందులో ఎవరికెంత ప్రయోజనం సమకూరుతుందనే లెక్కల కంటే రాష్ట్రప్రయోజనాలకు నష్టం వాటిల్లిందనే విషయంలో కచ్చితంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మిత్రపక్షంతో కరాఖండిగానే వ్యవహరించింది కేంద్రప్రభుత్వం. తాటాకు చప్పుళ్లకు భయపడం. రాజకీయ ప్రయోజనాలతో మాకు సంబంధం లేదు. మీ సెంటిమెంట్లు మమ్మల్ని కదల్చలేవు. ఇంతకంటే క్లియర్ గా చెప్పాల్సింది లేదన్నట్లుగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ డిమాండ్లపై స్పందించారు. మీరు మాదారికి రావాలసిందే తప్ప మేము మీ మాట వినే ప్రసక్తే లేదని నర్మగర్భంగా చెప్పేశారు. మంత్రుల రాజీనామాలు, రాజకీయ ప్రకంపనలు తదనంతర పరిణామాలే.
ఎవరి లెక్కలు వారివే...
బీజేపీతో ఈసారి జోడీగా ఎన్నికలకు వెళితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని టీడీపీ అంచనాకు వచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి అంశాల కారణంగా మోడీపై పెట్టుకున్న భ్రమలు సామాన్య ప్రజానీకంలో తొలగిపోయాయి. ఫీల్డు లెవెల్ లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా సంతృప్తికరంగా ప్రజలకు కనిపించడం లేదు. టీడీపీ, బీజేపీలే ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రధాన కారణంగా బీజేపీని చూపించి తెలివిగా తప్పించుకోవాలనే ఎత్తుగడ టీడీపీ అధినేత చంద్రబాబుది. బీజేపీ లోకి వచ్చి చేరిన నాయకులు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు,కన్నా లక్ష్మీ నారాయణ వంటి సీనియర్ నేతలు పార్టీ అధిష్టానం తీరుపై తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడవటం వారికెవరికీ ఇష్టం లేదు. మరోవైపు సోము వీర్రాజు వంటి పాత నాయకులకూ ఆయనంటే పడదు. టీడీపీ పొత్తు కారణంగా బీజేపీ ఏపీలో మరుగుజ్జుగా , పరాన్నభక్షిగా మిగిలిపోతోందనే భావన శ్రేణుల్లో ఉంది. తెలంగాణలో టీడీపీతో పొత్తుకు ఇప్పటికే రాం రాం చెప్పేశారు. ఏపీలో కూడా సొంత బలాన్ని పరీక్షించుకోవాలంటే ఇంతకు మించిన మంచి తరుణం దొరకదు. టీడీపీ దూరమైనా, వైసీపీ ఏదో సమయంలో మద్దతిస్తుందనే భరోసా బీజేపీకి లభిస్తోంది. ఆయా కారణాలన్నిటినీ బేరీజు వేసుకున్న తర్వాతనే టీడీపీ పట్ల కఠినవైఖరిని తీసుకున్నారు.
సెంటిమెంటుకు చెల్లుచీటీ ...
బీజేపీ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా నమ్మకాలేమీ పెట్టుకోలేదు. తమ నాయకులు సొంతంగా గెలిచి చూపిస్తారనే భరోసా కూడా వారికి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల ఉదారంగా వ్యవహరిస్తే తమకు రాజకీయంగా బలమైన రాష్ట్రాల్లో పార్టీ అవకాశాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఉదాహరణకు విశాఖపట్నానికి రైల్వే జోన్ మంజూరు చేస్తే ఒడిసా రాష్ట్రం అసంతృప్తికి గురవుతుంది. ఒడిసాలో బిజూ జనతాదళ్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది బీజేపీ. సొంతంగా అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేసుకొంటోంది. తమ ప్రయోజనాలను పణంగా పెట్టి టీడీపీ కోసం త్యాగం చేయడం తెలివితక్కువ తనమనేది బీజేపీ నాయకుల యోచన. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఒడిసాకు అభ్యంతరాలున్నాయి. ఇప్పుడు జోన్ కూడా తోడైతే అక్కడి ప్రజలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. అందువల్లనే రైల్వేజోన్ ను రాజకీయనిర్ణయంగా తొక్కిపెట్టింది బీజేపీ. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దక్షిణాదిలోనే అటు కర్ణాటక, ఇటు తమిళనాడుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తమ ప్రాంత పరిశ్రమలు తరలిపోతాయనే ఆందోళన వ్యక్తం కావచ్చు. బీహార్, రాజస్థాన్ లు ఎప్పట్నుంచో ఈ హోదాను డిమాండు చేస్తున్నాయి. తమకూ ఈ హోదా కల్పించాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక, బీహార్ , రాజస్థాన్ లు బీజేపీకి రాజకీయంగా చాలా కీలకమైనవి. అందువల్ల టీడీపీ కోసం త్యాగం చేసేందుకు బీజేపీ సిద్దం కావడం లేదు. అందుకే హామీలు, సెంటిమెంట్లు ఇక్కడ పనిచేయడం లేదు.
చేతులు కాలాక....
కేంద్రమంత్రులు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నతర్వాత ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఫోన్ చేశారు. సర్దుబాటు చేసుకునే అవకాశాలపై ఇరువురూ చర్చించారు. ఇంతవరకూ వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళితే రాజకీయంగా బీజేపీ, టీడీపీలకు నష్టదాయకమని చంద్రబాబు స్సష్టం చేసినట్లు పార్టీ ఉన్నత వర్గాల సమాచారం. బడ్జెట్ తొలివిడత సమావేశాలు వాయిదా పడినప్పట్నుంచీ చర్చలు జరిపి నిర్దిష్ట కార్యాచరణకు పూనుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితులు తలెత్తేవి కావని ప్రధానికి తేల్చి చెప్పినట్లు సీఎంఓ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. తాము ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడి దృష్ట్యా నిర్ణయం తీసుకోకతప్పలేదని చంద్రబాబు చెప్పినట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్యాచ్ అప్ కష్టమేననేది ఇరుపార్టీల అభిప్రాయం. ఇప్పుడు ఎన్డీఏ లో టీడీపీ ఎంతకాలం భాగస్వామిగా కొనసాగుతుందనేదే ప్రధాన ప్రశ్న. మంత్రులు రాజీనామాలు చేశాక బీజేపీతో జట్టుకట్టి తిరగడం పరిహాసాస్పదంగా ఉంటుంది. ఇక రేపోమాపో ఎవరి దారి వారిదే.
-ఎడిటోరియల్ డెస్క్