137 సం|| నాటి దిగువమిట్టపల్లి-దొరవారి బావి రైల్వే బ్రిడ్జి స్తంభాల్ని కాపాడుకోవాలి
ప్రకాశం జిల్లా, గిద్దలూరు-నంద్యాల రైలు మార్గంలో దిగువమిట్టపల్లి- దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి
![Giddalur-Nandyala railway line, railway bridge between Giddalur-Nandyala railway line, 137 years old railway bridge between Bhatamittapalli-Dorawaribavi, 137 years old railway bridge in prakashamdistrict Giddalur-Nandyala railway line, railway bridge between Giddalur-Nandyala railway line, 137 years old railway bridge between Bhatamittapalli-Dorawaribavi, 137 years old railway bridge in prakashamdistrict](https://www.telugupost.com/h-upload/2024/09/27/1656376-137.webp)
విజయవాడ/ ఒంగోలు, సెప్టెంబర్ 27: ప్రకాశం జిల్లా, గిద్దలూరు-నంద్యాల రైలు మార్గంలో దిగువమిట్టపల్లి- దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, ఆయన, ప్రముఖ చరిత్రకారుడు పరిశోధకుడు విద్వాన్ డా.జ్యోతి చంద్రమౌళి, ఔత్సాహిక వారసత్వ కార్యకర్త పాములపాటి శ్రీనాథ్ రెడ్డితో కలిసి శుక్రవారం నాడు ఆ బ్రిడ్జిని సందర్శించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బ్రిటిష్ ప్రభుత్వం గోవా నుంచి మచిలీపట్నానికి సరుకుల రవాణా కోసం రెండు పట్నాల మధ్య మీటర్ గేజ్ నిర్మాణాన్ని తలపెట్టి 1842లో సర్వే చేసి, 1867 నాటికి గోవా-గుంతకల్ మార్గాన్ని పూర్తిచేసి, అదే సంవత్సరం నల్లమల అటవీ ప్రాంతం లో నంద్యాల-గిద్దలూరు మధ్య దిగువమిట్టపల్లి సమీపంలో చలమ-బొగడల మధ్య, 2600 అడుగుల సముద్రమట్టంపై, 800 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జిని నిర్మించటానికి బ్రిటన్ లోని బర్నింగ్ హామ్ స్టీల్ ప్లాంట్ నుంచి తెప్పించిన 420 టన్నుల ఇనుము వినియోగించి, స్థానిక కార్మికులతోనే బ్రిటిష్ ఇంజనీర్లు పూనుకోవడంతో అభినందించదగ్గ విషయమని శివనాగిరెడ్డి అన్నారు.
లండన్ తో తయారైన బ్రిడ్జి విడిభాగాలు 1883లో మచిలీపట్నం రేవుకు రాగా, 1884లో నిర్మించిన నిర్మాణం ప్రారంభమై, 1887లో పూర్తై దిగువమిట్టపల్లి-దొరవారిబావి మధ్య వంతెనను దాటి, రైలు మచిలీపట్నం నుంచి గోవాకు చేరుకుందని, ఆయన అన్నారు. అదే బ్రిడ్జి పైన 110 సం||ల పాటు రైలు నడిచాయని, 1992లో ఆ బ్రిడ్జిని ఊడ తీసి, రు.4.00 లక్షలకు పాత ఇనుమును అమ్మారని, 1992 నుంచి, ఈ రైలు మార్గం బ్రాడ్ గేజ్ గా మారిందని వివరించారు.
137 ఏళ్ల చరిత్ర గల 200 అడుగుల ఎత్తున దిగువమిట్టపల్లి వద్ద గల రాతితో కట్టిన రైలు బ్రిడ్జి స్తంభాలను, దొరవారిబావి వద్ద ఇప్పటికే చెక్కుచెదరని ఇటుక రాతి బ్రిడ్జి గోడల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించి, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరిచి, అలనాటి కష్టతరమైన నిర్మాణ నైపుణ్యాన్ని ఈతరానికి, నల్లమల లో ప్రకృతి అందాల నడుమ తిలకించేటట్లు చేయాలని తరానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, డా. ఈమని శివనాగిరెడ్డి, జ్యోతి చంద్రమౌళి, పాములపాటి శ్రీనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.