బూటకపు వాదనలతో కూడిన ఫ్యాక్ట్ చెక్స్: 2023 లో వైరల్ అయిన పోస్టులు
2023లో, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా బొమ్మిరెడ్డి కిషోర్ ప్రజలకు ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నారని.. కాబట్టి మీరెవరూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటూ తెలుగు భాషలో సందేశం విస్తృతంగా ప్రచారం అయింది. అందులో ఎలాంటి నిజం లేదని మేము తేల్చాము.
2023లో ప్రపంచంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా విషయాలకు సంబంధించి తప్పుడు సమాచారం వైరల్ అయింది. అయితే తెలుగుపోస్ట్ ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందించింది. తప్పుడు కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఖండిస్తూ 2023 సంవత్సరంలో ఎంతో సరైన సమాచారాన్ని మీకు అందించింది. 2023 సంవత్సరంలో తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ చేసిన పలు విషయాలను మనం సమీక్షిద్దాం.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, టర్కీ భూకంపం, మణిపూర్ అల్లర్లు, బాలాసోర్‌లో రైలు ఢీకొనడం వంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేశంలో తప్పుడు సమాచారం విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రజల వద్దకు ఫేక్ న్యూస్ చేరడంతో వార్తలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వాటిలో చాలా విషయాలను మేము ఫేక్ న్యూస్ అంటూ ప్రేక్షకులకు తెలియజేశాం. ఏదైతే సరైన సమాచారమో అది ప్రజలకు అందించాము.
ఎక్కువగా చదివిన ఫ్యాక్ట్ చెక్ వార్తలు:
ఒక యువతి పోలీసు అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే వీడియో గురించి మేము నివేదించాం. ఈ వార్తను ఎక్కువగా చదివారు. ఆమె డ్రగ్స్ వ్యసనానికి బాధితురాలని తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఆమె బెంగళూరులోని కోరమంగళకు చెందిన యువతి.. మానసిక వికలాంగురాలు, డ్రగ్స్‌కు బానిస కాదని మేము తెలియజేశాం. ఆగస్టు 2023లో, చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయడంతో భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రయాన్-3కి సంబంధించిన రాకెట్‌ను ట్రక్కు తీసుకెళ్తున్నట్లు కొన్ని పోస్టులు వైరల్ చేశారు. ఓ భారీ ట్రక్కు రాకెట్‌ను అతి ఇరుకైన వంతెన మీదుగా తీసుకుని వెళుతున్న వీడియో వైరల్‌గా మారింది. మేము వీడియో క్లిప్ "Spintires: Midrunner" అనే వీడియో గేమ్ నుండి గేమింగ్ క్లిప్ అని కనుగొన్నాము
తెలుగుపోస్ట్ ప్రచురించిన మరో ఆసక్తికరమైన వాస్తవ తనిఖీ కథనం ఏమిటంటే.. బహుళ-లేయర్డ్, సంక్లిష్టమైన రహదారి వ్యవస్థ అయిన హువాంగ్జౌన్ ఇంటర్చేంజ్ వంతెనకు సంబంధించింది. హువాంగ్జౌన్ ఇంటర్‌ఛేంజ్ వంతెనకు సంబంధించిన వీడియో డిజిటల్‌గా మార్చిన విజువల్స్ అని మేము గుర్తించాం.
ఇక స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేసే కార్యక్రమంలో కర్నాటక రాష్ట్రంలో ఒక మహిళా కలెక్టర్ బురఖా ధరించారని చెబుతూ ఓ వీడియోను వైరల్ చేశారు. అయితే ఈ కథనాలపై మేము ఫ్యాక్ట్ చెక్ చేశాం.. వీడియోలో కనిపిస్తున్న మహిళా అధికారి జమ్మూలోని కిష్త్వార్లోని జిల్లా అభివృద్ధి మండలి వైస్ చైర్మన్. మేము ఫ్యాక్ట్ చెక్ చేసిన ఈ కథనం కూడా ప్రజలు బాగా చదివారు. ఇతరులకు చేరవేశారు.
హోక్స్ మేసేజీలు:
2023లో, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా బొమ్మిరెడ్డి కిషోర్ ప్రజలకు ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నారని.. కాబట్టి మీరెవరూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటూ తెలుగు భాషలో సందేశం విస్తృతంగా ప్రచారం అయింది. అందులో ఎలాంటి నిజం లేదని మేము తేల్చాము. యూజర్లు 4 గ్రూప్‌లు, 10 మంది వ్యక్తులకు మెసేజ్‌ని ఫార్వార్డ్ చేయాలని.. 5 నిమిషాల్లో మొబైల్ రీఛార్జ్ అవుతుందని ఆ సందేశం లో తెలిపారు. అయితే, ఆ సందేశం బూటకమన.., ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశించినదని తేలింది. సోషల్ మీడియాలో ప్రాంతీయ భాషల్లో కొన్ని బూటకపు సందేశాలు ప్రజలను తికమక పెట్టాయి.
ఇక ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే పాస్టర్ల జీతాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా 342 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మరో బూటకపు సందేశం కూడా వైరల్ అవ్వడం మొదలైంది. ఈ సందేశం బూటకమని తేలింది, రాష్ట్రంలోని మొత్తం 5196 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి రూ. 5000 గౌరవ వేతనం చెల్లించేందుకు 2.59 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
వన్యప్రాణుల నుండి సురక్షితంగా ఉండటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెక్కింగ్ మార్గంలో యాత్రికులకు వాకింగ్ స్టిక్స్ కోసం 10 రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్న బూటకపు సందేశాలను, ఆదాయపు పన్ను శాఖ పేరుతో ప్రజలు తమ బ్యాంకులో నింపమని కోరుతూ సందేశాన్ని కూడా మేము ఫ్యాక్ట్ చెక్ చేసాం.
స్కామ్:
దేశంలోని కొన్ని బ్రాండ్ల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించినా కొన్ని పోస్టులను కూడా తెలుగుపోస్ట్ తోసిపుచ్చింది. భారతదేశంలో విక్రయించిన ఆశీర్వాద్ ఆటాకు సంబంధించిన హలాల్ సర్టిఫికేట్ ప్యాక్ చిత్రం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది భారతదేశానికి సంబంధించినది కాదు, కొన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి ఉపయోగిస్తున్న ప్యాక్ అని మేము కనుగొన్నాం. అమూల్ బటర్‌ను చూపించే వీడియో గురించి కూడా కొన్ని వాదనలను మేము ఫ్యాక్ట్ చెక్ చేశాం. చైనాలో తయారైన అమూల్ బటర్ మార్కెట్లో ఉందని, అమూల్ బటర్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనే వాదనను అమూల్ సంస్థ కూడా తోసి పుచ్చింది.మహిళా దినోత్సవం సందర్భంగా తనిష్క్ సంస్థ బహుమతులు ఇస్తున్నట్లు ఒక బూటకపు సందేశం కూడా వైరల్ అయింది. కానీ సందేశంతో అందించిన లింక్ క్లిక్‌బైట్ వెబ్‌సైట్‌కి దారి తీస్తుంది. ఇది మాల్వేర్ను కలిగి ఉండవచ్చు. మీ మొబైల్స్, కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురవ్వచ్చు. క్రిప్టోకరెన్సీని ఇస్తానని ఎలోన్ మస్క్ తన ఫాలోవర్స్‌ను ఆహ్వానించాడని మరొక బూటకం కూడా పేర్కొంది. ఇది కూడా ఒక స్కామ్.
CMR షాపింగ్ మాల్, క్యాంపస్ షూస్, నటరాజ్ పెన్సిల్స్ వంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన తప్పుడు కథనాలు కూడా వైరల్ అయ్యాయి.
డీప్ ఫేక్ వీడియోలు:
2023 సంవత్సరం చివరి నాటికి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఆక్టోపస్ కారు పైకి ఎక్కి దానిని ధ్వంసం చేసిందని క్లెయిమ్ చేసే వీడియోను మేము ఫ్యాక్ట్ చెక్ చేశాం. న్యూయార్క్ నగరంలో వరదలు, అత్యవసర పరిస్థితి సమయంలో ఓ భారీ ఆక్టోపస్ దాడి చేసిందని జరిగిన ప్రచారాన్ని మేము తప్పు అని కనుగొన్నాము. ఇది ఖతార్ కు చెందిన ఒక డిజైనర్ కంప్యూటర్లో రూపొందించిన వీడియో.CGI రూపొందించిన ప్రకటన ప్రచారం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఉంచిన బార్బీ చిత్రం 3D ప్రకటనగా ప్రచారం చేశారు. హెలికాప్టర్ రోటర్ నుండి దూకి ఒక వ్యక్తి విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న మరో CGI వీడియో కూడా ఆ వ్యక్తి ‘రోటర్ ఛాలెంజ్’ అనే అసాధారణ విన్యాసాన్ని ప్రదర్శించిన నిజమైన సంఘటన అనే వాదనతో షేర్ చేశారు.
నిజమైన వ్యక్తులకు సంబంధించినట్లుగా ఉండే AI ద్వారా మానిప్యులేట్ చేసిన డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలు ఇటీవల చాలా వైరల్ అయ్యాయి. జారా పటేల్ అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారు ప్రచురించిన ఒరిజినల్ వీడియోను డిజిటల్‌గా మార్చి.. భారతీయ నటి రష్మిక మందన్నను లక్ష్యంగా చేసుకుని వీడియోను సృష్టించారు.
ఎన్నికల ప్రచారంలోకి కూడా డీప్‌ఫేక్ వీడియోలు ప్రవేశించాయి. నటుడు అర్జున్ కపూర్, క్రికెటర్ కుల్దీప్ యాదవ్ కొందరు అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కోసం శుభాకాంక్షలు తెలిపిన వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ ఆ వీడియోలు AI మానిప్యులేట్ అని తేలింది. అయోధ్య రైల్వే స్టేషన్, సిల్క్యారా సొరంగం నుండి రక్షించిన నిర్మాణ కార్మికుల డీప్‌ఫేక్ చిత్రాలు కూడా వైరల్ అయ్యాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదని తెలుగుపోస్ట్ క్లారిటీ ఇచ్చింది.