Tue Nov 26 2024 13:52:57 GMT+0000 (Coordinated Universal Time)
Fact Check: 1963 సంవత్సరంలో 'ఒమిక్రాన్ వేరియంట్' అనే సినిమా వచ్చిందా..?
భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన చర్చ తీవ్రంగా జరుగుతూ ఉంది. విదేశాల నుండి వచ్చిన వారిలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిందని...
భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన చర్చ తీవ్రంగా జరుగుతూ ఉంది. విదేశాల నుండి వచ్చిన వారిలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది మునుపటి వేరియంట్ల కన్నా వేగంగా వ్యాపిస్తుందన్న వార్త ప్రజలను చాలా టెన్షన్ పెడుతూ ఉంది. "#OmicronVarient" ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ వస్తోంది.
ఇలాంటి సమయంలో "ది ఒమిక్రాన్ వేరియంట్" అనే టైటిల్‌తో కూడిన చిత్రానికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'భూమిని శ్మశానవాటికగా మార్చిన రోజు' అని పోస్టర్‌పై ట్యాగ్‌లైన్ ఉంది. ఈ సినిమా 1963లో విడుదలైందని చెబుతూ ఉన్నారు.
ఈ పోస్టర్ మరోసారి పలు సిద్ధాంతాలకు మూలకారణం అయింది. ప్లాన్ చేసి కరోనా మహమ్మారిని ప్రజల ముందుకు వదిలారని స్పష్టమవుతోందని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా "బిలీవ్ ఇట్ ఆర్ ఫెయింట్ ..ఈ చిత్రం 1963లో వచ్చింది .. ట్యాగ్‌లైన్ చెక్ చేయండి" అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేశారు.
నిజమేమిటంటే:
వైరల్ అవుతున్న పోస్టర్ ను మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. 1974 నాటి "ఫేజ్ IV" అనే చిత్రం పోస్టర్‌ను ఎడిట్ చేసి.. వైరల్ పోస్టర్‌ను రూపొందించినట్లు కనుక్కున్నాము. ఒక ఐరిష్ దర్శక రచయిత బెక్కీ చీటిల్ కేవలం వినోదం కోసం వైరల్ పోస్టర్‌ను రూపొందించామని తెలిపారు. "ది ఒమిక్రాన్ వేరియంట్" పేరుతో సినిమా లేదని కూడా తెలుస్తోంది.కీవర్డ్ సెర్చ్‌ని ఉపయోగించి, బెక్కీ చీటిల్ డిసెంబర్ 1, 2021న పోస్ట్ చేసిన ట్వీట్‌ని మేము కనుగొన్నాము, అందులో తాను ఫోటోషాప్ ఉపయోగించి వైరల్ పోస్టర్‌ను రూపొందించానని ఆమె స్పష్టం చేశారు. తన "జోక్"ని సీరియస్‌గా తీసుకోవద్దని ఆమె ప్రజలను కోరారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి, మేము స్పానిష్ వెబ్సైట్లో వైరల్ పోస్టర్ యొక్క అసలైన ఫోటోను కనుగొన్నాము. అందులో ఆ పోస్టర్ 1,200 యూరోలకు విక్రయించబడింది. చిత్రం యొక్క శీర్షిక స్పానిష్ భాషలో "SUCESOS EN LA IV FASE" అని వ్రాయబడింది. టైటిల్ "Omicron వేరియంట్" కానే కాదు. ఇది "ఫేజ్ IV" అనే సినిమా పోస్టర్ని చూపుతుంది.
IMDbలో వివరించిన సమాచారం ప్రకారం "ఎడారి చీమలు అకస్మాత్తుగా మేధస్సును సొంతం చేసుకుని ఇతర జీవులపై యుద్ధం చేయడం ప్రారంభిస్తాయి. దారితప్పిన అమ్మాయిని రక్షించడం, చీమలను నాశనం చేయడానికి ఇద్దరు శాస్త్రవేత్తలు చేసే పనులే ఈ సినిమా ప్లాట్" అని మేము గుర్తించాము. "భూమిని స్మశానవాటికగా మార్చిన రోజు" అనే ట్యాగ్‌లైన్ మాత్రం నిజంగానే ఉంది. అది సినిమాలోని కథను ఉద్దేశించి రాసినది.
టైటిల్లో 'ఓమిక్రాన్' ఉన్న సినిమాలు:
IMDbలో వెతికితే టైటిల్లో "Omicron" ఉన్న రెండు సినిమాలు కనిపించాయి. ఒకటి 1963లో విడుదలైన "ఒమిక్రాన్" కాగా, మరొకటి 2013లో "ది విజిటర్ ఫ్రమ్ ప్లానెట్ ఒమిక్రాన్".
ఈ చిత్రాలలో కరోనా మహమ్మారికి సంబంధించిన ఎటువంటి కథలు, సంఘటనలు లేవు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టర్లను కేవలం సరదాగా సృష్టించినదని తెలుస్తోంది. 1963 సంవత్సరంలో ఒమిక్రాన్ వేరియంట్ అనే సినిమా రాలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాము.
Claim : 1963 సంవత్సరంలో 'ఒమిక్రాన్ వేరియంట్' అనే సినిమా వచ్చిందా..?
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story