Sun Dec 22 2024 15:57:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారం లోకి వస్తారని చంద్రబాబు నాయుడు చెప్పలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం ఉంది.
Claim :
వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా, ఆయన 100% అవుతారని చెప్పారు.Fact :
వైరల్ వీడియోలోని ఆడియోను ఎడిట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అని విలేఖరి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం ఉంది.
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితర అగ్రనేతలు సహా ప్రముఖులు, రాజకీయ నేతలు క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కారు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతూ ఉంది. అందులో 'జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారా?' అని రిపోర్టర్ అడగడం మనం వినవచ్చు. చంద్రబాబు నాయుడు 100 శాతం అంటూ చెప్పడం మనం వినవచ్చు.
వాట్సాప్‌లో కూడా ఇలాంటి వీడియో వైరల్ అవుతూ ఉంది. టీడీపీ అధినేత తన పార్టీ ఓడిపోతుందని అంగీకరించి, ఓటు వేసిన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లిపోయారనే వాదనతో విజువల్స్ ను షేర్ చేస్తున్నారు.
“గెలిచే పరిస్థితి లేదు: చంద్రబాబు వ్యాఖ్యలు:" అంటూ వే2 ఎస్సెమ్మెస్ న్యూస్ లో వచ్చినట్లుగా పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
AP: క్షేత్ర స్థాయిలో పోలింగ్ ను పరిశీలిస్తే కూటమి గెలిచే పరిస్థితి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సంక్షేమ పాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు పథకాలు, గ్రామాల్లోనే పౌరసేవలు వంటి అంశాలు కూటమిని దెబ్బతీశాయన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదని తెలిపారు. కాగా, ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలివెళ్లారు.” అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
కూటమి గెలవడం లేదని.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.చంద్రబాబు నాయుడు కారు ఎక్కుతూ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న చిత్రాన్ని ఉపయోగించి సెర్చ్ చేశాం. ఇటీవల ప్రచురించిన పలు వీడియోలు మాకు కనిపించాయి. మే 13, 2024న కొంతమంది వినియోగదారుల సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన వీడియోను మేము చూశాం. టీడీపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా అని రిపోర్టర్ అడగడం ఆ వీడియోలలో వినవచ్చు. అందుకు స్పందనగా చంద్రబాబు నాయుడు ‘100%’ అని బదులిచ్చారు.
దీన్ని క్యూ గా తీసుకున్నాం. అందులో ANI మైక్ మాకు కనిపించింది. ఓటు వేసిన తర్వాత ANI ప్రచురించిన చంద్రబాబు నాయుడు వీడియోల కోసం మేము వెతికాము. వీడియోపై క్యాప్షన్ “#WATCH | Guntur: After casting his vote, Former Andhra Pradesh CM and TDP chief N Chandrababu Naidu says, "It is our responsibility to cast our vote and demand a bright future. 100% (TDP will come to power in the state)" Voting for Andhra Pradesh Assembly elections and the fourth phase of #LokSabhaElections2024 is taking place simultaneously today.” అని ఉంది. గుంటూరులో ఓటు వేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు మాట్లాడారని ఈ పోస్టు ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఓటు వేసి ఉజ్వల భవిష్యత్తును కోరుకోవడం మన బాధ్యత.. 100% రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు. ఈ వీడియోలో, రిపోర్టర్ ప్రశ్న, ఆయన సమాధానాన్ని మనం స్పష్టంగా వినవచ్చు.
ANI ప్రచురించిన మరో వీడియో కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోలను ANI సంస్థ మే 13, 2024 ఉదయం 8.15 గంటల ప్రాంతంలో, అప్పుడే పోలింగ్ ప్రారంభమైనప్పుడు ప్రచురించింది.
తదుపరి పరిశోధనలో, way2news టెంప్లేట్ ఉపయోగించి షేర్ చేసిన చిత్రం కూడా నకిలీదని మేము కనుగొన్నాము. TDP_Janasena-BjP కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు ప్రకటన చేయలేదు. వే2 న్యూస్ కూడా వైరల్ పోస్టులను ఖండించింది. వే2న్యూస్ అటువంటి వార్తలను ప్రచురించలేదని ప్రకటించింది. కొంతమంది WhatsAppలో తమ లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. వైరల్ పోస్ట్ లను సృష్టిస్తున్నారని @way2_news సంస్థ వివరణ ఇచ్చింది.
కూటమి గెలవడం లేదని.. వైసీపీ అధికారంలోకి మళ్ళీ వస్తుందని చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Claim : వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా, ఆయన 100% అవుతారని చెప్పారు.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story