Tue Mar 18 2025 03:15:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ లోని మెట్రో పిల్లర్లపై 420 యాడ్స్ కలకలం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఫోటోలను డిజిటల్ గా ఎడిట్ చేశారు

Claim :
హైదరాబాద్ లోని పిల్లర్లపై 420 ఎవరంటూ డిజిటల్ హోర్డింగ్స్ ను ఉంచారుFact :
అసలు ఫోటోలలో ఉన్నది ర్యాపిడో యాడ్స్ కాగా.. ఫోటోలను డిజిటల్ గా ఎడిట్ చేశారు
దావోస్ పర్యటనకు ఇటీవల వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా పెట్టుబడులు తీసుకుని వచ్చినట్లు ప్రకటించారు. అయితే ఆ పెట్టుబడులకు సాక్ష్యాలు చూపించాలని తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కోరింది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సాధించిన విజయంపై బీఆర్ఎస్ చేసిన విమర్శలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నాయకులు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోయిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అధినేత కే చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సహా బీఆర్ఎస్ నేతలకు యాంటాసిడ్లు పంపి ‘ఈనో క్యాంపెయిన్’ ప్రారంభించింది. హైదరాబాద్‌లో అనేక చోట్ల ఈ తరహా ఫ్లెక్స్ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈనో ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నాయకులు మొత్తం అబద్దాలే మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి, ఉద్యోగాలు వస్తే సంతోషిస్తామని, అవన్నీ అవాస్తవాలు అనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయో చెప్పాలని, ఎప్పటిలోగా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజంగానే ఈ పెట్టుబడులన్నీ వాస్తవరూపం దాలిస్తే తామే సన్మానం చేస్తామని, కానీ అబద్ధాలు చెప్పవద్దని రేవంత్ రెడ్డిని కేటీఆర్ కోరారు.
ఇలా ఓ వైపు తెలంగాణలో ఫ్లెక్సీ వార్ కు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండగా.. "మెట్రో పిల్లర్లపై 420 యాడ్స్" అంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"హైదరాబాద్ లోని మెట్రో పిల్లర్లపై 420 యాడ్స్ కలకలం
రేవంత్ ఫోటో లేకుండా జస్ట్ 420? అంటూ వెలసిన పోస్టర్లు
కాంగ్రెస్ 420హామీలపై ప్రశ్నించడం కోసమే ఈ పోస్టర్లు అతికించి ఉంటారని టాక్" అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఫోటోలను మార్ఫింగ్ చేశారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో వెతకగా.. అలాంటి హోర్డింగ్స్ ఏవీ మెట్రో పిల్లర్ దగ్గర ఏర్పాటు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే కానీ జరిగి ఉంటే పలు మీడియా సంస్థలు కథనాలను నివేదించి ఉండేవి.
మేము వైరల్ ఇమేజ్‌లో కొన్ని తప్పులను గమనించాము, దీన్ని బట్టి అవి ఎడిట్ చేసిన ఫోటోలు అయ్యి ఉండొచ్చని భావించాం. రెండు హోర్డింగ్‌లలో, కంటెంట్ హోర్డింగ్ బోర్డర్స్ ను దాటుకుని మరీ వెళ్లిందని స్పష్టంగా తెలుస్తోంది. ఒక హోర్డింగ్ చివర అయితే ఇతర రంగులో మరో కంటెంట్ ఉన్నట్లు చూపుతుంది.
ఇక వైరల్ ఫోటోను తీసుకుని మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లీడ్‌స్పేస్ వెబ్‌సైట్‌లోని ఫోటోగ్రాఫ్ మాకు కనిపించింది.
ఒరిజినల్ వెబ్ సైట్ లోని ఫోటో ఇక్కడ చూడొచ్చు. అందుకు సంబంధించిన లింక్ ఈ వెబ్ సైట్ లో ఉంది.
ఈ ఫోటోలో, అదే మోటార్‌సైకిల్ రైడర్, బస్సు, మహిళ రోడ్డు దాటడాన్ని మేము గమనించాము. ఒరిజినల్ ఫోటోను ఎడిట్ చేశారని మేము ఈ ఫోటోను చూసి ధృవీకరించాం.
ఈ ఫోటోలో C1768, C1769 సంఖ్యలతో మెట్రో పిల్లర్లు ఉన్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన యాడ్ లో 'రాపిడో ' సంస్థ కోసం ప్రకటనలను చూపించాయి. అందులో ఎక్కడా కూడా ప్రశ్న గుర్తు, '420' సంఖ్యను చూపించలేదని మేము ధృవీకరించాం. కాబట్టి, ఎవరో ఎడిట్ చేసి ఇలాంటి పోస్టులు పెట్టి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆపాదించారు.
ఈ వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : హైదరాబాద్ లోని పిల్లర్లపై 420 ఎవరంటూ డిజిటల్ హోర్డింగ్స్ ను ఉంచారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story