Mon Dec 23 2024 08:26:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరుకుంటుందని అంబటి రాయుడు చెప్పలేదు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్ కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేరుకుంటుందని అంబటి రాయుడు తెలిపాడు
Claim :
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్ కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేరుకుంటుందని అంబటి రాయుడు తెలిపాడుFact :
అంబటి రాయుడు వాయిస్ ను ఎడిట్ చేశారు. ఐపీఎల్ జట్టు పేరును రాయుడు చెప్పలేదు
భారత జట్టు టీ20 వరల్డ్ కప్-2024లో విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో చాంపియన్స్ గా అవతరించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియాకు రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతమైన ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి కనబర్చిందని కొనియాడారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, ఇతర సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జై షా తెలిపారు.
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఏ ఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయనే విషయమై పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. చాలామంది క్రికెట్ లెజెండ్స్.. ఇండియా, ఇంగ్లండ్, వెస్ట్ ఇండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా.. ఇలా బలమైన జట్ల పేర్లు చెప్పారు.
దక్షిణాఫ్రికా దిగ్గజం బ్రియాన్ లారా ఒక్కరే ఆఫ్ఘనిస్థాన్ సెమీ ఫైనల్ కు చేరుతుందని అంచనా వేశారు. ఆయన చెప్పినట్లుగానే ఆఫ్ఘన్ జట్టు సెమీస్ కు చేరింది. అయితే సెమీస్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది.
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు కూడా సెమీఫైనల్ ఏయే జట్లు చేరుకుంటాయనే విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకుంటుందని చెప్పినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
చెన్నై సూపర్ కింగ్స్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కు చేరుకుంటుందని అంబటి రాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వైరల్ వీడియోను ఎడిట్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోను నిశితంగా పరిశీలించగా.. మాకు స్టార్ స్పోర్ట్స్ లోగో కనిపించింది. మేము స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా ఖాతాలో అంబటి రాయుడు ప్రెడిక్షన్ గురించి వెతికాం.
@StarSportsIndia అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో మే 28, 2024న అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాం. ఈ వీడియోలో సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, పాల్ కాలింగ్ వుడ్, అంబటి రాయుడు, బ్రియాన్ లారా వంటి లెజెండరీ క్రికెటర్లు సెమీ ఫైనల్ కు వెళ్లబోయే జట్లకు సంబంధించి తమ తమ అభిప్రాయాలను చెప్పారు.
ఈ వీడియోలో అంబటి రాయుడు కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అంటూ చెప్పుకొచ్చాడు. అంతే తప్ప ఎక్కడా కూడా చెన్నై సూపర్ కింగ్స్ పేరును చెప్పలేదు.
వైరల్ పోస్టులో అంబటి రాయుడు వేసుకున్న డ్రెస్.. ఒరిజినల్ వీడియోలో అంబటి రాయుడు వేసుకున్న డ్రెస్ రెండూ ఒకటే విధంగా ఉన్నాయని కూడా మేము ధృవీకరించాం.
రెండు ఫోటోల మధ్య పోలికలను గమనించవచ్చు.
'Ambati rayudu semifinal prediction' అంటూ కీవర్డ్ సెర్చ్ చేయగా క్రికెట్ అడిక్టర్ కథనం మాకు కనిపించింది. అందులో కూడా అంబటి రాయుడు సెమీ ఫైనల్ కు చేరే జట్లకు సంబంధించి చెన్నై పేరును చెప్పినట్లుగా ఎలాంటి కథనం కనిపించలేదు.
https://cricketaddictor.com/cricket-news/t20-world-cup-2024-india-picked-by-everyone-as-sunil-gavaskar-ambati-rayudu-and-other-experts-name-t20-wc-semi-finalists/
Sportskeeda Cricket ఫేస్ బుక్ పేజీలో కూడా అంబటి రాయుడు చెప్పిన దేశాల పేర్లకు సంబంధించిన పోస్టును కూడా మేము గుర్తించాం. అందులో కూడా ఐపీఎల్ జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ పేరు లేదు.
కాబట్టి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సెమీస్ కు చేరుతుందని భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎక్కడా చెప్పలేదు. అంబటి రాయుడు ఆడియోను ఎడిట్ చేశారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్ కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేరుకుంటుందని అంబటి రాయుడు చెప్పాడు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story