Mon Mar 31 2025 02:05:32 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత వీడియోను ఇటీవలిదిగా పోస్టు చేశారు
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ

Claim :
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శించారుFact :
2018లో అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఇటీవలివిగా ప్రచారం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కలిసి అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీతో టీడీపీకి సత్సంబంధాలు ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని మార్చి 18న చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాని చేత శంకుస్థాపనలు చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్వయంగా ప్రధానిని కలసి రాజధాని పనులకు తమ చేతులమీదుగా ప్రారంభించాలని కోరనున్నారు. హడ్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయల వ్యయంతో రాజధాని నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మార్చి 17న ఏపీ అసెంబ్లీలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించి, ప్రజెంటేషన్ ఇచ్చారు. త్రిభాషా విధానంలో తప్పేమీ లేదని అన్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కు మాత్రమేనని, భాష అనేది భావవ్యక్తీకరణ సాధనం అని వివరించారు. ఇంగ్లీష్ మీడియంతో నాలెడ్జ్ వస్తుందని చెబుతున్నారు. కానీ, మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచ వ్యాప్తంగా రాణించారు. భాష ఏదైనా సరే, దాన్ని ద్వేషించడంలో అర్థం లేదన్నారు. తెలుగువారికి మాతృభాష తెలుగు, మనకు హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. అవసరమైతే ఆ భాషలను మనం నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయన్నారు.
అయితే చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శిస్తున్నట్లుగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే మరో 15 సీట్లు ఎక్కువ వచ్చేవని చంద్రబాబు నాయుడు అన్నట్లుగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"మీతో పొత్తు పెట్టుకోకుంటే.. మాకు మరో 15 సీట్లు ఎక్కువొచ్చేవని ఎవరిని ఉద్దేసించి అన్నారో...!?
ప్చ్ ...అయినా మాకెందుకులెండి మధ్యలో....
ఏమన్నా అంటే అన్నామంటారు !
BJP Andhra Pradesh
Bharatiya Janata Party (BJP)
#BabuSurityBadhuduGuarantee
#IdhiMunchePrabhutvam" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
2018 సంవత్సరంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఇటీవలివిగా వైరల్ చేస్తున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని విమర్శించిన దాఖలాలు ఏవీ లేవు.
2018 మార్చి నెలలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఎన్.డి.ఏ. కూటమిని విడిచిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సహాయం అందించడంపై బీజేపీ నుండి సహకారం లేదని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలిగింది. ఇది 2019 ఎన్నికలకు ముందు చోటు చేసుకుంది.
అప్పట్లో వచ్చిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ వీడియోకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం మేము కీవర్డ్ సెర్చ్ చేశాం.
I&PR AP యూట్యూబ్ ఛానల్ లో Eleventh Session Of Andhra Pradesh Legislative Assembly on 28-03-2018 Live అనే టైటిల్ తో అప్లోడ్ చేసిన వీడియో మాకు లభించింది.
ఈ అసెంబ్లీ సమావేశాల లైవ్ టెలీకాస్ట్ నుండి వైరల్ వీడియోను తీసుకున్నారు.
ఈ వీడియోను నిశితంగా పరిశీలించగా 5 గంటల 03 నిమిషాల వద్ద సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైరల్ వీడియోలోని వ్యాఖ్యలు చేయడం వినవచ్చు. "రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించి ఉంటే, పొత్తు పెట్టుకోకుండా ఉంటే, ఆనాడు 15 సీట్లు నాకు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేవి” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, సరైన న్యాయం చేయలేదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తన హామీని నిలబెట్టుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు రికార్డు కూడా అయ్యాయి. 28 మార్చి, 2018న జరిగిన అసెంబ్లీ సెషన్ కు సంబంధించిన 133వ పేజీలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.
https://sessions.
కాబట్టి, 2018 అసెంబ్లీ సెషన్స్ లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఇటీవలిదిగా వైరల్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Next Story