ఫ్యాక్ట్ చెక్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను క్రిస్టియన్ అంటూ డిక్లరేషన్ ను ఇవ్వలేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను క్రిస్టియన్
Claim :
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను క్రిస్టియన్ అంటూ డిక్లరేషన్ ఇచ్చారుFact :
పవన్ కళ్యాణ్ తన రెండో కూతురికి డిక్లరేషన్ ఇస్తూ సంతకం చేశారు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ను ప్రకటించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడిగా కాదు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా కాదు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సగటు భారతీయుడిగా మీ ముందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. హిందుత్వాన్ని పాటిస్తా, అన్ని మతాలను తాను గౌరవిస్తానని తెలిపారు. హైందవ సమాజాన్ని హేళన చేస్తున్న వారికి పదకొండు సీట్లు మాత్రమే కట్టబెట్టారని గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మమన్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రామచంద్రమూర్తి అని, కలియుగ వైకుంఠంలో దేవుడికి అన్యాయం జరిగితే ప్రాయశ్చిత్త దీక్ష చేయకూడదా? అని పవన్ ప్రశ్నించారు.
తాను ఎన్నడూ ధర్మం తప్పనని, అది జరిగితే తనకు డిప్యూటీ సీఎం పదవి కూడా అక్కరలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నీ రాజకీయాలేనా? అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? అని ఆయన ప్రశ్నించారు. పరాభవం పొందినా, పరాజయం చెందినా తాను మౌనంగానే ఉంటానని అన్నారు. గత కొంత కాలంగా కల్తీ నెయ్యితో, జంతువుల కొవ్వుతో ఏడుకొండల వాడికి ప్రసాదం పెడతారన్నారు. అవే లడ్డూలు అయోధ్యకు పంపిస్తారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ఇంతలో పవన్ కళ్యాణ్ కొన్ని పత్రాల మీద సంతకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అని, అందుకే డిక్లరేషన్ పై సంతకం పెడుతున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
"డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు అంటే క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్టు
క్రిస్టియన్స్ దీక్షలు చేస్తారా
క్రిస్టియన్స్ సనాతన ధర్మ రక్షకులు అవుతారా?" అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పై సంతకం చేసింది తన విషయంలో కాదు. తన రెండో కూతురికి సంబంధించి.
పవన్ కళ్యాణ్ రెండో కుమార్తె 'పలీనా అంజని కొణిదెల' గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మీడియా ముందుకు వచ్చింది కూడా చాలా తక్కువే. అయితే ఆమె తిరుమలకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ దర్శనానికి ముందు తన కుమార్తెకు సంబంధించి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ నే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా పవన్ కళ్యాణ్ తన కుమార్తె కోసమే సంతకాలు చేశారని పలు మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి.
పవన్ కళ్యాణ్ తిరుమలను దర్శించుకున్నారని, తన కుమార్తె కోసం డిక్లరేషన్ పై సంతకాలు పెట్టారని నేషనల్ మీడియా కూడా ధృవీకరించింది.
తన కుమార్తెకు డిక్లరేషన్ ఇచ్చానని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన వీడియోలు కూడా మేము చూశాం.
పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ తన కుమార్తె క్రిస్టియన్ అని, ఆమెకు సంబంధించిన డిక్లరేషన్ పై సంతకం చేశానని స్పష్టం చేశారు. తన చిన్న కూతురు తిరుమల దర్శనానికి రాగా స్వయంగా డిక్లరేషన్ ఇప్పించినట్లు పవన్ కళ్యాణ్ అన్నారు.జనసేన అధ్యక్షుడిగా ఇక్కడికి రాలేదని, సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకునేందుకే వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. సనాతన ధర్మం అంటే హిందుత్వాన్ని పాటిస్తూ ఇతర మతాలను గౌరవించడమేనన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చినట్లు వారాహి సభలో పవన్ కళ్యాణ్ తెలిపారు.
కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ తన కుమార్తె పలీనా అంజని కొణిదెల కోసం పవన్ కళ్యాణ్ చేసిన సంతకం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ తాను క్రిస్టియన్ అంటూ సంతకం చేయలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.