Sun Dec 15 2024 13:42:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రజలను మోసం చేయడంలో విజయవంతమయ్యామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒప్పుకోలేదు
Claim :
ప్రజలను మోసం చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ నాయక్ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారుFact :
వైరల్ వీడియోను ఎడిట్ చేశారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9న ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు, సభ్యులు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా అంశంపై వివరణ ఇచ్చారు. విగ్రహం నమూనా మార్పుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుకోవాలని సభలో రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అనంతరం సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
20 అడుగులతో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో ఏర్పాటుచేశారు. ఆకుపచ్చ చీర, ముక్కుపుడక, గుండుపూసలు, హారం ఉన్నాయి. కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఎడమ చేతిలో వరి, జొన్నలు, సజ్జ పంటలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. కుడి చేతితో జాతికి అభయాన్ని ఇస్తున్నట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ నాయక్ కు సంబంధించిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అందుకు శుభాకాంక్షలు అంటూ అసెంబ్లీలో చెప్పిన వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్లు పోస్టు చేశారు.
"*అర్థమైందా రాజా....*
*నిజం నిర్భయంగా ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే*" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని మేము ధృవీకరించాం.
వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.
అసలైన వీడియో గురించి తెలుసుకుందామని మేము తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ కు సంబంధించిన లైవ్ వీడియో కోసం వెతికాం. పలు మీడియా సంస్థలు లైవ్ ప్రసారం చేశాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చిన లైవ్ లో 1:19:38 సమయం వద్ద ఎమ్మెల్యే రామ్ నాయక్ మాట్లాడడం వినవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన త్యాగాల గురించి మాట్లాడారు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందంటూ ఎక్కడా చెప్పలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలను మోసం చేశారని మాత్రమే ఆరోపించారు.
ప్రజలను మోసం చేయాలని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్ నాయక్ ఆరోపించారు. ప్రతి ఒక్క అంశాన్నీ బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతూ ఉన్నారని అలాంటి వారిని పట్టించుకోకూడదని రామ్ నాయక్ తెలిపారు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చి ఉంటే బాగుండేదని రామ్ నాయక్ అన్నారు. ఏది ఏమైనా కానీ విగ్రహావిష్కరణకు రావాల్సి ఉందని రామ్ నాయక్ తెలిపారు. ఎక్కడా కూడా రామ్ నాయక్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ విమర్శించలేదని మేము గుర్తించాం.
సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా రామ్ నాయక్ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించినట్లుగా ఎలాంటి నివేదికలు మాకు కనిపించలేదు. అధికార పార్టీ నాయకుడే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండి ఉంటె తప్పకుండా పలు మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించి ఉండేవి. కాబట్టి ఎమ్మెల్యే రామ్ నాయక్ తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించలేదని అనలేదు.
కాబట్టి, వైరల్ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రజలను తప్పుదారి పట్టించేలా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
Claim : ప్రజలను మోసం చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ నాయక్ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story