Sun Dec 22 2024 05:38:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాత్రి 11 గంటలకల్లా దుకాణాలు మూసేయాలని హైదరాబాద్ పోలీసులు ఎలాంటి నిబంధనలను తీసుకుని రాలేదు
హైదరాబాద్‌లో దుకాణాలు రాత్రి 10:30 లేదా 11:00 గంటలకు మూసివేయాలి
Claim :
హైదరాబాద్‌లో దుకాణాలు రాత్రి 10:30 లేదా 11:00 గంటలకు మూసివేయాలిFact :
తెలంగాణలో సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, తెలంగాణ రాష్ట్ర పోలీసుల లోగోతో కూడిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “షాపులు 10:30 లేదా 11:00 గంటలకు మూసివేయాలి” అని అందులో ఉంది.
వినియోగదారులు వివిధ క్లెయిమ్‌లతో ఈ స్క్రీన్ షాట్ ను పంచుకున్నారు.
వైరల్ చిత్రం INC తెలంగాణ ద్వారా భాగస్వామ్యం చేసిన స్క్రీన్‌షాట్ లాగా కనిపిస్తోంది. నసీర్ గియాస్ అనే జర్నలిస్ట్ కూడా దీనిపై స్పందించారు. ఈ రకమైన ప్రకటన గురించి పోలీసులు, ప్రభుత్వం చెబితే బాగుంటుంది కదా అని ట్వీట్ లో కోరారు.
మరొక ట్విట్టర్ యూజర్.. ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొందని.. ఇది నిజమో.. కాదో తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు. "Dear @hydcitypolice can you please confirm is it true or fake? It’s creating confusion in public of #Hyderabad @HiHyderabad" అంటూ ట్వీట్ పెట్టారు.
హైదరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనంలో నుండి పోలీసులు ప్రజలను రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగవద్దని హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.
జూన్ 24, 2024న వీడియోపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కనీసం అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉండేలా చూడాలని పేర్కొంటూ తెలంగాణ డీజీపీ, పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు రాత్రిపూట దుకాణాలను తెరిచి ఉంచడానికి అనుమతిస్తున్నాయని ఆయన సూచించారు.
"జూబ్లీహిల్స్‌లో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవి ఇరానీ చాయ్ హోటళ్లు, పాన్ షాపులు లేదా వాణిజ్య సంస్థలు అయినా, వాటిని కనీసం 12 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలి. దేశంలోని పెద్ద మెట్రో నగరాలలో రాత్రిపూట దుకాణాలు తెరిచేందుకు అనుమతించగా.. హైదరాబాద్‌లో మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది?" అంటూ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ లో ప్రశ్నించారు.
“‘No Friendly Police, Lathicharge Police': Hyderabad Cops Ask Shops To Shut By 11 PM; 'Allow It Till 12 AM', Says Owaisi” అనే టైటిల్ తో The Press Free journal కూడా ఈ కథనాన్ని కవర్ చేసింది. హైదరాబాద్ పోలీసులు 11 గంటలకే షాపులను క్లోజ్ చేయమని హెచ్చరిస్తున్నారని.. దీన్ని అసదుద్దీన్ ఒవైసీ ఖండించారంటూ అందులో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. రాత్రి 10:30 లేదా 11 గంటలలోపు దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.
మేము CMO తెలంగాణ సోషల్ మీడియాలో సంబంధిత నోటీసు, పోస్ట్ కోసం వెతికాము. మాకు అందుకు సంబంధించిన నోటీసులు కనిపించలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాల్లో లేదా ఐఎన్సి తెలంగాణలో కూడా అలాంటి పోస్ట్ లేదు.
జూన్ 24, 2024న, హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక X ఖాతాలో ఇలా పోస్ట్ చేసారు:
"సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి.
దుకాణాలు మరియు సంస్థలు తెరియు మరియు మూసి వేయు సమయములు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగును.
ఇది అందరూ గమనించగలరు."
జూన్ 25, 2024న, siasat.com కు సంబంధించిన కథనాన్ని చూడగా.. “ హైదరాబాద్ సిటీ పోలీసులు 10.30 లేదా 11 గంటలలోపు దుకాణాలను మూసివేయాలని ఆంక్షలు జారీ చేస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వదంతులు వైరల్ అవుతున్నాయని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. ఇవన్నీ పూర్తిగా తప్పుదారి పట్టించేవని వివరణ ఇచ్చారు. అంతకుముందు, AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచడానికి అనుమతించాలని కోరారు." అని అందులో ఉంది.
హైదరాబాద్ మెయిల్ ప్రచురించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము: "అనుమతించిన సమయాలకు మించి దుకాణాలు నిర్వహించవద్దని పోలీసులు కోరారు" అని సౌత్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ స్నేహ మెహ్రా IPS తెలిపారు.
అయితే, రాత్రి 10:30 లేదా 11 గంటలలోపు దుకాణాలను మూసివేయాలన్న అధికారిక ఉత్తర్వుల ప్రస్తావన ఎక్కడా రాలేదు.
రివీల్ ఇన్ సైడ్ కథనం ప్రకారం “షాప్‌లను రాత్రి 10:30 లేదా 11 గంటలలోపు మూసివేయడం గురించి ఇటీవల సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ వాదనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. పోలీసులు ప్రకారం, దుకాణాలు, సంస్థలు తెరవడం, మూసివేయడం కోసం ప్రస్తుత నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది" అని ఉంది.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ చిత్రం కల్పితం. రాత్రి 10:30 లేదా 11 గంటలలోపు దుకాణాలను మూసివేయాలని తెలంగాణ పోలీసుల నుండి అధికారిక ఉత్తర్వులు రాలేదు.
Claim : హైదరాబాద్‌లో దుకాణాలు రాత్రి 10:30 లేదా 11:00 గంటలకు మూసివేయాలి
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story