ఫ్యాక్ట్ చెక్: JSW పెయింట్స్ యాడ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతును ప్రకటించలేదు
JSW పెయింట్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రకటన
Claim :
JSW పెయింట్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రకటన విడుదల చేసిందిFact :
ఈ వీడియోను ఎడిటింగ్ చేశారు. ఒరిజినల్ యాడ్ లో భారత జాతీయ జెండా రంగులు ఉంటాయి
2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల సన్నాహకానికి 25.35 కోట్ల రూపాయలను కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది. ప్రత్యేక MCD హౌస్ సెషన్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఢిల్లీ నగరం అంతటా ఎన్నికల కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం (EC), ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సూచనల మేరకు 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల కోసం సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. MCD అధికార పరిధిలోని 2,538 స్థానాల్లో దాదాపు 13,033 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో బూత్‌కు రూ.19,450 బడ్జెట్ కేటాయిస్తారు. విద్యుత్తు, లైటింగ్, తాగునీరు, షేడెడ్ సీటింగ్ ప్రాంతాలు, టాయిలెట్లు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల (పిడబ్ల్యుడి) కోసం ర్యాంప్‌లు వంటివి ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను జనవరి రెండో వారంలోగా ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించనుంది. ప్రకటన వెలువడిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరి 12-13 తేదీల్లో ఓటింగ్ జరగవచ్చని అంచనా. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయా పార్టీలు ఇప్పటికే తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆశిస్తూ ఉంది. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు నియోజకవర్గాల్లోనూ ప్రచారం ముమ్మరం చేసింది.
అయితే JSW పెయింట్స్ ప్రకటనలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేలా ఓ ప్రకటనను విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
ఒరిజినల్ వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఉండదు. ఎడిట్ చేశారు.
వైరల్ వీడియోలో ఓ వ్యక్తి పెయింట్స్ షాప్ పక్కనే ఉన్న గోడ మీద బైక్ లో వెళుతూ వెళుతూ పాన్ ఉమ్మేస్తూ వెళుతుంటాడు. ఆ గోడ మీద ఏమి చేసినా అతడు ఉమ్మివేయడం ఆపడు. భారతీయ జనతా పార్టీ చిహ్నం వేసినా ఉమ్మివేసి వెళ్ళిపోతాడు. అయితే చివరికి పెయింట్ షాప్ వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ జెండాను వేయడంతో ఉమ్మివేయడం ఆపేస్తాడు. ఇలా ఆ వీడియో సాగుతుంది.
అయితే ఈ వైరల్ వీడియో కింద స్పూఫ్ అని ఉండడం మేము గమనించాం. దీన్ని బట్టి ఒరిజినల్ వీడియోను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుసుకున్నాం.
ఈ వీడియోను పోస్టు చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీ ఐడీ phirlayengekejriwal అని ఉంది. ఈ అకౌంట్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇదే పేజీలో పలు ఆప్ ప్రమోషనల్ కంటెంట్ ను మేము గుర్తించాం.
ఇక వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. రెండు సంవత్సరాల కిందట JSW పెయింట్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన ఒరిజినల్, నిడివి ఎక్కువ ఉన్న వీడియో ను మేము గుర్తించాం.
JSW Paints - Independence day | Think Beautiful Film అనే టైటిల్ తో 12 ఆగస్టు 2022న వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియోలో భారతదేశ జెండా రంగులతో గోడ మీద పెయింట్ వేసి ఉండడం చూడొచ్చు. ఒరిజినల్ లో ఉన్న దాన్ని మార్చి ఆమ్ ఆద్మీ పార్టీ జెండాను ఉంచారు. కాబట్టి, ఒరిజినల్ వీడియోను ఎడిట్ చేశారని మేము గుర్తించాం.
ఒరిజినల్, ఎడిట్ చేసిన పోస్టులకు సంబంధించిన తేడాలను ఇక్కడ మీరు చూడొచ్చు.
కాబట్టి, JSW పెయింట్స్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఎడిట్ చేసిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now