Thu Nov 21 2024 16:31:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సెలూన్ షాప్ లో హెడ్ మసాజ్ చేయించుకుంటూ చనిపోయాడనే వైరల్ వీడియో తప్పుదారి పట్టిస్తోంది
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది నటీ నటులు
Claim :
సెలూన్ షాప్ లో మసాజ్ చేయించుకున్న వ్యక్తి మూర్ఛతో చనిపోయాడుFact :
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది నటీ నటులు. నిజంగా జరిగిన ఘటన కాదు
సెలూన్ షాప్ కు వెళ్ళినప్పుడు హెడ్ మసాజ్ చేయించుకోవడం సర్వ సాధారణమే. అయితే కొన్ని కొన్ని సార్లు మసాజ్ చేయించుకునే సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మెడ గట్టిగా తిప్పడం వలన నరాలు దెబ్బతినడం, తలపైన నొప్పిలా అనిపించడం జరుగుతూ ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో కొందరు స్ట్రోక్ బారిన కూడా పడ్డారు. ఇటువంటి సంఘటనలను "సెలూన్ స్ట్రోక్" లేదా "బ్యూటీ పార్లర్ స్ట్రోక్"గా పరిగణిస్తారు. ఆకస్మిక, బలవంతంగా మెడ కదలికల వలన మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోయి మెదడు దెబ్బతింటుందని పలువురు నిపుణులు కూడా సూచించారు.
ఓ వ్యక్తికి హెడ్ మసాజ్ చేశాక మూర్ఛ వ్యాధి వచ్చిందని, అతడు చనిపోయాడంటూ కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. అంతేకాకుండా వీడియోను కూడా పోస్టు చేశారు. మొదట ఓ కస్టమర్ చైర్ లో కూర్చుని ఉండగా అతడికి హెడ్ మసాజ్ చేస్తాడు అందులో పని చేసే వ్యక్తి. చివర్లో మసాజ్ చేయించుకున్న వ్యక్తి మూర్ఛ వ్యాధితో ఆ చైర్ లోనే కుప్పకూలిపోవడాన్ని మనం చూడొచ్చు.
"బార్బర్ షాప్‌లో మసాజ్ చేసుకుంటుండగా వ్యక్తి మృతి... ఓ వ్యక్తి బార్బర్ షాప్‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన." అంటూ ChotaNewsTelugu ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను అప్లోడ్ చేశారు.
సలూన్ లో మసాజ్ చేయించుకుంటున్నారా? అంటూ వే2న్యూస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వైరల్ అవుతూ ఉంది.
ఇది నిజమేనని భావించి పలువురు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా మసాజ్ చేయించుకోవడం చాలా ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను ప్రజల్లో అవగాహన కలిగించడానికి చేసిన వీడియో అని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి, అలాంటి వాటిపై అవగాహన కలిగించడానికి చేసిన వీడియోను నిజమైనదిగా భావించారు.
సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా గతంలో సెలూన్ షాపుల్లో కొందరు వ్యక్తులు మసాజ్ చేయించుకుని హాస్పిటల్ పాలయ్యారని మేము గుర్తించాం.
సెప్టెంబర్ 29, 2024న కర్ణాటకలోని బళ్ళారి లో ఓ వ్యక్తికి సెలూన్ లో హెడ్ మసాజ్ చేయించుకున్నప్పుడు స్ట్రోక్ వచ్చిందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
కర్నాటకలోని బళ్లారిలో 30 ఏళ్ల వ్యక్తికి సెలూన్‌కి వెళ్ళినప్పుడు ఒక క్షురకుడు హెడ్ మసాజ్ చేయడం వల్ల స్ట్రోక్ వచ్చింది. ఒక ప్రముఖ వార్తా వెబ్సైట్ ప్రకారం, హౌస్ కీపింగ్ వర్కర్ అయిన వ్యక్తి, మసాజ్ సమయంలో మెడ తిప్పడం వలన తీవ్రమైన నొప్పిని అనుభవించాడు, కానీ మొదట్లో దానిని పట్టించుకోలేదు. మసాజ్ చేసిన కొన్ని గంటల తర్వాత అతను మాట్లాడటంలో ఇబ్బంది, ఎడమ వైపు శరీరంలో మార్పులు వచ్చినట్లు గమనించాడు.
వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ మెడను బలంగా మెలితిప్పడం వల్ల కరోటిడ్ ఆర్టరీ టియర్ వల్ల స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ రకమైన స్ట్రోక్ మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందని వైద్యులు తెలిపారు.
ఈ కథనాలకు, వైరల్ వీడియోకు ఎలాంటి లింక్ లేదని నిర్ధారించాం. ఎందుకంటే వైరల్ వీడియోలోని వ్యక్తి మూర్ఛతో పడిపోవడం మనం చూడొచ్చు. అది కూడా సినిమాల్లో చూపించినట్లుగా ఒక రెగ్యులర్ నటుడిలాగా కుర్చీలో ఉండిపోయాడు.
ఇక వైరల్ వీడియోకు సంబంధించి కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. నిడివి ఎక్కువ ఉన్న వీడియో మాకు లభించింది.
నటి Sanjjanaa Galrani ఫేస్ బుక్ అకౌంట్ లో ఇదే వీడియో ఉంది. వీడియో లోని డేట్ 05-11-2024 అని ఉంది. కాబట్టి, మీడియా సంస్థలు ధృవీకరించిన ఘటనలకు ఈ వీడియోకు సంబంధం లేదని తెలుస్తోంది.
వీడియోను అప్లోడ్ చేసినప్పుడు ఇది నటీనటులతో చిత్రీకరించిన వీడియో అంటూ డిస్క్లైమర్ ను మనం చూడొచ్చు. "ఈ పేజీలో స్క్రిప్ట్ డ్రామాలు, పేరడీలు, అవగాహన వీడియోలు ఉన్నాయని దయచేసి గమనించండి. ఈ షార్ట్ ఫిల్మ్‌లు వినోదం, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. వీడియోలలో చిత్రీకరించబడిన అన్ని పాత్రలు, సందర్భాలు కల్పితం. అవగాహన పెంచడానికి, వినోదాన్ని ఉద్దేశించబడ్డాయి." అంటూ స్పష్టంగా తెలిపారు.
ఇదే ఫేస్ బుక్ పేజీలో అదే లొకేషన్, ఈ యాక్టర్స్ ఉన్న వీడియోలు చాలానే ఉన్నాయని మేము ధృవీకరించాం.
ఇక ఈ వీడియో ప్రాంక్ వీడియో అని "ఇవేం పనులు.. మసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని ఫ్రాంక్ వీడియోతో జనాన్ని భయపెట్టారు." @ChotaNewsTelugu ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇస్తూ వీడియోను పోస్టు చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వీడియోను వైరల్ చేస్తున్నారు.
Claim : సెలూన్ షాప్ లో మసాజ్ చేయించుకున్న వ్యక్తి మూర్ఛతో చనిపోయాడు
Claimed By : Media
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story