Fri Nov 22 2024 19:30:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: గూడూరులో పోలీసుల మీద దాడికి సంబంధించిన ఘటనలో రాజకీయ కోణం లేదు
ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరులో పోలీసు కానిస్టేబుల్‌పై ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త
Claim :
ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరులో పోలీసు కానిస్టేబుల్‌పై ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త దాడి చేశారు.Fact :
నిందితుడికి ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదివారం నాడు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో హత్యలు, దాడులు తారాస్థాయికి చేరుకున్నాయని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటలను జగన్ గవర్నర్ కు వివరించారు. అంతేకాదు, ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్ కు అందించారు.
ఈ నేపథ్యంలో 31 సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. ఒక పోలీసు అధికారిపై వెనుక నుండి కర్రతో దాడి చేయడం కనిపిస్తుంది. ఇంతలో మరొక పోలీసు అధికారి అతనిని రక్షించడానికి వస్తాడు. ఈ వీడియో CCTV ఫుటేజ్‌గా భావించవచ్చు.
“పోలీసులకు రక్షనే లేదు!!! గూడూరులో పోలీసు కానిస్టేబుల్ పై విచక్షణా రహితంగా దాడి చేస్తున్న వైసీపీ రౌడీ!!!" అనే వాదనతో వీడియోను వైరల్ చేస్తున్నారు.
“పోలీసులను కొడుతున్న వైసీపీ గుండాలు” అంటూ మరో యూజర్ కూడా వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. పోలీసులపై దాడి చేసిన వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి, ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో.. జూలై 19, 2024న TV9 తెలుగు ఈ ఘటనపై వివరణాత్మక కథనాన్ని ప్రచురించింది. తిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట సెంటర్లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై వెనుక నుంచి కర్రతో ఆ వ్యక్తి దాడి చేశాడు. దాడి తాలూకా దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రాథమిక విచారణలో నిందితుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన లాల్తు కలిందిగా గుర్తించారు.
విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూనిఫాం ధరించిన పోలీసులను చూసి నిందితుడు అదుపుతప్పి దాడులు కూడా చేస్తారని పోలీసులు తెలుసుకున్నారు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్‌ను స్వామి దాస్‌గా గుర్తించారు. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. బెంగాల్ కు చెందిన లాల్తు కలింది గతంలో కూడా పోలీసులపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.
“గూడూరులో పోలీసు కానిస్టేబుల్‌పై దాడి” అనే కీ వర్డ్స్ తో వెతకగా దక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనాన్ని చూశాం. “దాస్, మరో కానిస్టేబుల్ స్థానిక దుకాణంలో టీ తాగడానికి తమ మోటార్‌సైకిల్‌ను ఆపినప్పుడు ఈ సంఘటన జరిగింది. దాస్ దుకాణంలోకి ప్రవేశిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల లాల్తు కాళింది అనే వ్యక్తి అకస్మాత్తుగా వెనుక నుండి కర్రతో కొట్టాడు. దాస్ తల వెనుక భాగంలో దెబ్బ తగలడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు” అని అందులో తెలిపారు.
“దాడిని చూసినప్పుడు, అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్, స్థానికులు వెంటనే దుండగుడిని పట్టుకున్నారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్‌ను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతికి తరలించారు." అంటూ మీడియా కథనాలు తెలిపాయి.
సూర్య రెడ్డి అనే పాత్రికేయుడు తన X ఖాతాలో.. తిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట సెంటర్లో విధులు నిర్వహిస్తుండగా ఒక హెడ్ కానిస్టేబుల్ వెనుక నుండి కర్రతో దాడి చేయడం CCTVలో రికార్డు అయిందని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో.. నిందితుడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన లాల్తు కాళింది యూనిఫాంలో పోలీసులను చూసినప్పుడు కోపంతో రగిలిపోతాడని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. స్వామి దాస్ అనే బాధితుడు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అతడిని మొదట గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారని తన ట్విట్టర్ పోస్టులో తెలిపారు.
న్యూస్ 9 ప్రకారం.. యూనిఫాంలో ఉన్న పోలీసులను చూస్తే మానసికంగా ఏదో జరుగుతుందని దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది
అందువల్ల, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. నిందితుడితో ఏ పార్టీకి సంబంధాలు కనిపించలేదు. వార్తా కథనం ప్రకారం, నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.
Claim : ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరులో పోలీసు కానిస్టేబుల్‌పై ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త దాడి చేశారు.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story