Wed Apr 09 2025 12:12:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇతర మతాలకు చెందిన వారిని చంపుతామంటూ హిందుత్వ గ్రూప్ సభ్యులు నినాదాలు చేయలేదు
ఇతర మతాలకు చెందిన వారిని హిందూ గ్రూపు సభ్యులు నినాదాలు

Claim :
ఇతర మతాలకు చెందిన వారిని చంపేయాలంటూ హిందూ గ్రూపు సభ్యులు నినాదాలు చేశారుFact :
వైరల్ పోస్టుల్లో హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని నినాదాలు చేశారు
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు చేసుకోడాన్ని హైదరాబాద్ లోని బజరంగ్ దళ్ తప్పుబట్టింది. పాశ్చాత్య పోకడలకు బదులుగా ఆ రోజును 'వీర్ జవాన్ దివస్'గా గుర్తుంచుకోవాలని కోరారు. ఫిబ్రవరి 14ని ప్రజలు ‘వీర్ జవాన్ దివస్’గా గుర్తుంచుకోవాలని తాము కోరుకుంటున్నామని హైదరాబాద్ బజరంగ్ దళ్ నేత అఖిల్ తెలిపారు. పుల్వామా దాడిలో మరణించిన మన జవాన్లకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తున్నట్లుగా ఫిబ్రవరి 14వ తేదీని మనం జరుపుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. భజరంగ్ దళ్ ప్రధాన విలువలు ‘సేవా- సురక్ష- సంస్కార్’ అని వివరించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో మరణించిన సైనికులకు నివాళులు అర్పించాలని అఖిల్ కోరారు.
ఆర్.ఎస్.ఎస్. కు చెందిన కార్యకర్తలు క్రిస్టియన్స్ ను చంపేయాలంటూ ప్రతిజ్ఞ చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
"ప్రియమైన మిత్రమా, ఈ హిందూ పరిషత్, RSS వ్యక్తులు మార్చి 1వ తేదీ నుండి భారతదేశంలోని ఛత్తీస్గఢ్లో క్రైస్తవులను చంపుతామని ప్రమాణం చేస్తున్నారు. ముందుగా ఊహించిన ఈ దురాగతాలను ఆపమని ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ నాయకులకు ప్రార్థించండి.
-సీపీ, సోషల్ మీడియా" అంటూ పోస్టులు పెట్టారు.
హిందూ తీవ్రవాద గ్రూపు ఆర్ఎస్ఎస్ ఛత్తీస్ఘడ్ లో క్రిస్టియన్స్ ను మార్చి నెల మొదటి రోజు నుండి చంపేయాలని నిర్ణయం తీసుకుందని.. ఈ దారుణాన్ని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆపాలంటూ మరో ట్విట్టర్ పేజీలో పోస్టు పెట్టారు.
ఈ వీడియోను ఛత్తీస్ ఘర్ లో రికార్డు చేశారని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా అక్కడ కార్యక్రమంలో వేసుకున్న కాషాయ వస్త్రాలపై తెలుగులో భజరంగ్ దళ్ అని ఉంది. ఇక వారు మాట్లాడుతున్న భాష కూడా తెలుగు మాత్రమే. హిందూ మతాన్ని కాపాడుకోడానికి ప్రతిజ్ఞ చేస్తున్నారు. దీన్ని బట్టి ఇది తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఘటన అని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ వీడియోలో హిందూ సంస్కృతిని, హిందూ సమాజ అభివృద్ధికై పాటు పడతానని అక్కడ ఉన్నవారు చెప్పడం వినవచ్చు. హిందూ ధర్మ స్థాపనకై పోరాడతానని ప్రతిజ్ఞ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడా కూడా క్రిస్టియన్స్ కానీ, ఇతర మతాల ప్రస్తావన తీసుకుని రాలేదు.
ఇక వైరల్ అవుతున్న వీడియోను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Arun Pannalal అనే పేజీలో డిసెంబర్ 27, 2024న వీడియోను పోస్టు చేశారు. కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదని కూడా ధృవీకరించాం.
Stop Hindu Hate Advocacy Network (SHHAN) అనే వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతాలో వైరల్ వీడియోను హిందువుల మీద ద్వేషాన్ని పెంచడానికి ఉపయోగిస్తూ ఉన్నారంటూ ట్వీట్ చేశారు.
"నకిలీ వార్తల గురించి హెచ్చరిక
ఈ వీడియో తెలుగులో ఉంది. ఛత్తీస్గఢ్కి చెందినది కాదు. క్రైస్తవులను చంపుతామని వారు ప్రమాణం చేయడం లేదు. వారు భౌతిక, ఆర్థిక మార్గాల ద్వారా హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రమాణం చేస్తున్నారు. వీరంతా బజరంగ్ దళ్ లో చేరినవారు. వీడియోలో క్రైస్తవుల ప్రస్తావన లేదు." అంటూ స్పష్టంగా చెప్పారు.
వైరల్ వీడియోను రికార్డు చేసిన ప్రాంతం గురించి తెలుగు పోస్ట్ అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ, ఈ వీడియో ఛత్తీస్ ఘడ్ లో మాత్రం చోటు చేసుకోలేదని ధృవీకరించాం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం లభించగానే ఈ కథనాన్ని నవీణీకరిస్తాం.
అలాగే వైరల్ వీడియోలో క్రైస్తవులను చంపేయాలంటూ ఎవరూ పిలుపును ఇవ్వలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఇతర మతాలకు చెందిన వారిని చంపేయాలంటూ హిందూ గ్రూపు సభ్యులు నినాదాలు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story