Sun Dec 22 2024 20:07:18 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైఎస్ జగన్ కు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసిందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
లోటస్ పాండ్ విషయంలో హైడ్రా నోటీసులు
Claim :
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోటస్ పాండ్ విషయంలో హైడ్రా నోటీసులు జారీ చేసిందిFact :
ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పారు
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ పలు ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టారు. చెరువుల ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. పటాన్ చెరు ప్రాంతంలో చెరువులో 18 అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు. చెరువు తూములను మూసివేసి ఇన్కార్ సంస్థ అపార్ట్మెంట్ నిర్మాణం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అమీన్పూర్లో సుడిగాలి పర్యటన చేసి శంభుని కుంట, సాంబికుంట, బంధం కొమ్ము, చక్రపురి కాలనీ, అమీన్పూర్ పెద్ద చెరువులను సందర్శించారు. చెరువులన్నీ ఆక్రమణలకు గురయ్యాయని, కాల్వలను మూసివేసి అక్రమ నిర్మాణాలు చేశారని స్థానికులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
పలువురు ప్రముఖులకు సంబంధించిన ప్రాపర్టీల విషయంలో అధికారులు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ హాల్ కూల్చి వేత గురించి దేశ వ్యాప్తంగా చర్చించారు. పలువురు ప్రముఖులకు సంబంధించిన ఆస్తుల గురించి కూడా చర్చలు జరిగాయి. మాదాపూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లు కట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి కూడా హైడ్రామా అధికారులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
ఇక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు హైడ్రా నోటీసులు వచ్చినట్లు కూడా ప్రచారం సాగుతూ ఉంది.
"మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెందిన లోటస్ పాండ్ మీద హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత… జగన్ మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేసారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్, లోటస్ పాండ్ చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై సమాధానం ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు." అంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. లోటస్ పాండ్ విషయంలో ఎలాంటి నోటీసులు పంపలేదని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. హైడ్రా కమిషనర్ లోటస్ పాండ్ విషయంలో వస్తున్న కథనాలన్నీ వదంతులే అంటూ కొట్టిపారేసిన పలు మీడియా కథనాలను, మీడియా సంస్థల సోషల్ మీడియా కథనాలను గమనించాం.
TeluguScribe ట్విట్టర్ ఖాతాలో 'జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ పై వివరణ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్' అంటూ పోస్టును కూడా మేము గమనించాం.
వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చినట్లు వస్తోన్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారని V6 మీడియా సంస్థ కూడా కథనాన్ని ప్రచురించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. జగన్ హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని, నమ్మొద్దని సూచించారు.
https://www.v6velugu.com/hydra-notices-to-ys-jagan-commissioner-ranganath-gave-clarity
పలు మీడియా సంస్థలు లోటస్ పాండ్ కూల్చివేయడానికి హైడ్రా సిద్ధమైనట్లు వచ్చిన వదంతులను కొట్టిపారేస్తూ కథనాలను ప్రచురించాయి. సూర్య దినపత్రికకు సంబంధించిన వెబ్ సైట్ లో ఆగస్ట్ 31, 2024న వైరల్ పోస్టులను ఖండిస్తూ కథనాన్ని ప్రచురించారు.
https://telugu.suryaa.com/telangana-news-489464-.html
హైడ్రా అధికారులకు సంబంధించిన ప్రకటనల గురించి కూడా నిశితంగా పరిశీలించాం. ఎక్కడా కూడా లోటస్ పాండ్ ను కూల్చివేస్తున్నట్లుగా నోటీసులు పంపినట్లు ప్రకటనలు ఇవ్వలేదు.
కాబట్టి, లోటస్ పాండ్ కూల్చివేయడానికి హైడ్రా సిద్ధమైనట్లు వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జరుగుతున్న ప్రచారం ఇది.
Claim : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోటస్ పాండ్ విషయంలో హైడ్రా నోటీసులు జారీ చేసింది
Claimed By : Media Channels, Social Media Users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media, media
Fact Check : False
Next Story