Sun Dec 22 2024 16:54:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ కు చేతులు జోడించి క్షమాపణలు చెప్పలేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పమంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ
Claim :
కమెడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతూ వీడియోను విడుదల చేశారుFact :
పవన్ కళ్యాణ్ కు ఆలీ క్షమాపణలు చెప్పలేదు. ఆ వైరల్ వీడియో రామోజీరావుకు సంబంధించింది
తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పమంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ అని చెబుతారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో అలీకి తప్పకుండా ఓ మంచి పాత్ర ఉండాల్సిందే. కేవలం కొన్ని పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే అలీ కనిపించరు. పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా అలీ లేకుండా సినిమా తీయలేనేమో అని చెప్పారు.
అయితే రాజకీయాల పరంగా మాత్రం ఇద్దరూ చెరో దారి చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆలీ వైసీపీ పార్టీలో ఉన్నారు.
ఇటీవల కమెడియన్ ఆలీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పారంటూ కొందరు పోస్టులు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో కొన్ని వీడియోలను తప్పుదోవ పట్టించే థంబ్నెయిల్స్ తో పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. వీడియోలో ఆలీ చెప్పినది ఓ విషయం కాగా.. థంబ్నెయిల్స్ ను పవన్ కళ్యాణ్ కు ముడిపెడుతూ వీడియోలను అప్లోడ్ చేశారు.
'పవన్ కళ్యాణ్ కు ఆలీ క్షమాపణలు' అనే కీవర్డ్స్ ను ఉపయోగించి మేము గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమెడియన్ ఆలీ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.
ఆలీ పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా.. దాని గురించి తెలుగు మీడియా తప్పకుండా ప్రముఖంగా ప్రచురించి ఉండేది.
కమెడియన్ ఆలీ లేటెస్ట్ గా అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ ట్రైలర్ లాంఛ్ లో మాట్లాడారు. అక్కడ కూడా ఏపీ పాలిటిక్స్ కు సంబంధించిన వ్యాఖ్యలు చేయలేదు.
NTV ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోను మేము గమనించాం. సినిమాకు సంబంధించిన విషయాలు, థాయ్ ల్యాండ్ గురించి ఆలీ మాట్లాడారు.
ఇక వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ గ్రాబ్ ను తీసుకుని మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ వీడియోలో ఆలీ వేసుకున్న షర్ట్ తో ఆయన ఇంస్టాగ్రామ్ వీడియోలో అప్లోడ్ చేసిన ఓ వీడియో మాకు కనిపించింది.
ఆ వీడియో ప్రముఖ పాత్రికేయులు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం గురించి ఆలీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించింది. రామోజీరావు తన కెరీర్ లో ఎలాంటి గొప్ప గొప్ప పనులు చేశారు.. తనకు, ఆయనకు ఉన్న అనుబంధం గురించి ఆలీ మాట్లాడారు.
దీన్ని క్యూగా తీసుకుని మేము రామోజీరావు మరణంపై ఆలీ స్పందనకు సంబంధించిన వార్తల గురించి సెర్చ్ చేశాం. పలు తెలుగు మీడియా సంస్థలు రామోజీరావు మరణంపై ఆలీ సంతాపాన్ని వ్యక్తం చేశారంటూ యూట్యూబ్ లో అదే వీడియోను అప్లోడ్ చేశాయి.
వీటన్నింటినీ పరిశీలించాక.. కమెడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతూ వీడియోను విడుదల చేయలేదని మేము గుర్తించాం. రామోజీరావు మరణానికి సంతాపం తెలిపిన వీడియోను తప్పుదోవ పట్టించే వాదనతో వైరల్ చేస్తున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Next Story