ఫ్యాక్ట్ చెక్: నటి జాన్వీ కపూర్ తో క్రికెటర్ హార్దిక్ పాండ్యా కలిసి ఉన్న ఫోటోలు ఏఐ ద్వారా సృష్టించారు
వైరల్ ఫోటోలు ఏఐ ద్వారా సృష్టించారు
Claim :
నటి జాన్వీ కపూర్ తో క్రికెటర్ హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఇవిFact :
వైరల్ ఫోటోలు ఏఐ ద్వారా సృష్టించారు
టీ20 ప్రపంచకప్ 2024లో భారతజట్టు గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా పగ్గాలు చేపడతాడని అంతా భావించారు. రోహిత్ శర్మ T20Iల నుండి రిటైర్ అయిన తర్వాత, హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తారని అనుకోగా.. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా నిలిచాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. ఇక హార్దిక్ పాండ్యా జనవరి 22 నుండి ఇంగ్లండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో ఎంతో కీలకంగా మారనున్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వైట్-బాల్ సీజన్ కోసం సమాయత్తమవుతూ ఉన్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీయ T20 టోర్నమెంట్లో బరోడాకు ప్రాతినిధ్యం వహించాడు హార్దిక్. మూడు 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు కూడా ఆడాడు.
హార్దిక్ పాండ్యా ఇటీవలే తాను విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత పలు వదంతులు హార్దిక్ పాండ్యా మీద వైరల్ అయ్యాయి.
ఇక హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ డేటింగ్ లో ఉన్నారని, ఇద్దరూ మాల్దీవుల్లో కనిపించారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందులో తెలిపారు. ఇద్దరూ మాల్దీవుల్లోని బీచ్లో దిగిన ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించి చూడగా.. ఇద్దరూ కలిసి తిరుగుతున్నట్లుగా ఎలాంటి కథనాలు మాకు కనిపించలేదు. వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా గమనించాం, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు మాకు కనిపించలేదు.
వైరల్ ఫోటోలను నిశితంగా గమనించగా ఇద్దరి ముఖకవళికలలో ఏదో తేడాలు ఉన్నాయని గుర్తించాం.
ఇక వైరల్ ఫోటోలకు సంబంధించి కింది భాగంలో GROK AI అని ఉండడం కూడా మేము గమనించాం. ఈ ఏఐ టూల్ ద్వారా మనం ఏదైనా పదాలను ఇచ్చి సృష్టించవచ్చు. అలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ కలిసి ఉన్నట్లుగా పోస్టులను సృష్టించారని మేము ధృవీకరించాం.
https://sightengine.com/ లో మరో ఫోటోను సెర్చ్ చేయగా 99 శాతం ఏఐ ద్వారా సృష్టించినదే అంటూ రిజల్ట్స్ వచ్చాయి.
ఇదే ఫోటోపై పలు మీడియా సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ డేటింగ్ లో లేరని, ఇద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లలేదని స్పష్టంగా తెలుస్తోంది. AIతో సహా ఆధునిక సాంకేతికతలు నేటి యుగంలో ఎంతగానో విస్తరించాయి. ఈ టెక్నాలజీలు కొందరు మంచి కోసం వినియోగిస్తుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఎంతో మంది జీవితాలు ఇలాంటి ఫేక్ ఫోటోల కారణంగా తారుమారయ్యాయి. ఏఐ ద్వారా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉండగా, వాటి వైపు కాకుండా కొందరు ఇలాంటి వాటి కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ తో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ డేటింగ్ లో ఉన్నారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.