Mon Mar 31 2025 06:51:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఫోటోను మార్ఫింగ్ చేశారు
ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Claim :
ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిFact :
వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేశారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ ఓ వైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని, ఆ దిశగా అడుగులు వేయడంలో విఫలమైందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా 100 రోజుల్లో ఆరు హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లించలేకపోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జెన్కో, ట్రాన్స్కోలకు బకాయిలు చెల్లించడంలో విఫలమవడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తిలో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు.
2023 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు ఓ ఫ్రేమ్ లో ఉండగా, ఆ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాళులర్పించారని పేర్కొంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఆ చిత్రంలో రేవంత్ రెడ్డి ఆరు హామీల చిత్రం ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. "ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన రేవంత్ రెడ్డి" అని ఆ ఫోటోలో ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు.
2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను విస్తృతంగా ప్రచారం చేసింది. తెలంగాణలోని మహిళలు, రైతులు, యువతకు, పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తామని వాగ్ధానాలను చేసింది. ఈ విషయంపై రాజకీయంగా చర్చ జరుగుతూనే ఉంది.
ఇక వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. Telangana CMO అధికారిక ఖాతాలో ఫిబ్రవరి 19, 2025న 'మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రతినిధులు శివాజీ మహారాజ్ గారికి నివాళులు అర్పించారు.
#chatrapatishivajimaharaj' అంటూ పోస్టు పెట్టారు.
దీన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి నమస్కారం చేస్తోంది ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి అని స్పష్టంగా తెలుస్తోంది.
ఒరిజినల్ ఫోటోకు ఎడిట్ చేసిన ఫోటోకు మధ్య తేడాలను మీరు గమనించవచ్చు.
రెండు చిత్రాల పోలికను పరిశీలిస్తే వైరల్ పోస్టును డిజిటల్గా ఎడిట్ చేశారని తేలింది. శివాజీ మహారాజ్ ఫోటో స్థానంలో ఆరు హామీల చిత్రం ఉంచారు. రెండు దీపాలు, ధూపం స్టాండ్ వైరల్ ఫోటోలో ఉన్నాయి. అవి అసలు చిత్రంలో లేవని తెలుస్తోంది.
మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా పరిశీలించాం.
"ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలోమంత్రి శ్రీ శ్రీధర్ బాబు,
ఎమ్మెల్యేలు శ్రీ వాకాటి శ్రీహరి, శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#ShivajiMaharajJayanti #ShivajiMaharaj
#Shivaji" అంటూ ఫిబ్రవరి 19, 2025న @revanth_anumula ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆరు హామీలకు నివాళులు అర్పించారనే వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ ఫోటోను డిజిటల్గా ఎడిట్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు.
Claim : ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story