Mon Dec 23 2024 13:13:12 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఓలా బైక్ తగలబడిన ఘటన అనంతపురంలో చోటు చేసుకోలేదు. కేరళకు సంబంధించిన విజువల్స్ ను వైరల్ చేస్తున్నారు.
వైరల్ విజువల్స్ ఓలా బైక్ తగలబడిన ఘటన
Claim :
అనంతపురంలోని రామ్ నగర్ లో ఓలా బైక్ తగలబడిందిFact :
వైరల్ విజువల్స్ కేరళకు సంబంధించినవి
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దసరా పండుగ సందర్భంగా "BOSS 72-గంటల రష్" సేల్ ను అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 12 వరకు నిర్వహించింది. Ola S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను అందించింది.ఓలా S1 X 2kWh మోడల్ మీద గణనీయమైన తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ ధర 49,999 మాత్రమే అంటూ ఓలా సంస్థ ప్రకటనలను విడుదల చేసింది. S1 సిరీస్ లోని ఇతర వెర్షన్లకు సంబంధించి కస్టమర్లు 25,000 రూపాయల వరకు తగ్గింపును దక్కించుకున్నారు. ఫ్లాగ్షిప్ స్కూటర్ అయిన S1 ప్రోని ₹5,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సొంతం చేసుకోవచ్చని ఓలా ప్రత్యేకమైన ఆఫర్ ను విడుదల చేసింది. 2024 చివరి నాటికి దేశవ్యాప్తంగా 1,000 కేంద్రాలకు తన సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించాలనే లక్ష్యంతో ఓలా తన హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. 2025 నాటికి లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు తమ వాహనాలపై పని చేసేలా శిక్షణ ఇవ్వాలని కూడా ఓలా లక్ష్యంగా పెట్టుకుంది.ఓలా బైక్ కు సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. రోజుల తరబడి సర్వీస్ సెంటర్లలో తమ బైక్ లు పడి ఉంటున్నాయని విమర్శలు వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యత, అమ్మకాల తర్వాత సేవకు సంబంధించి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించకుండా ఉండడంతో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ (CCPA) ఓలాకు నోటీసులను జారీ చేసింది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)కి గత ఏడాది కాలంగా Ola ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులను పరిష్కరించడంలో ఓలా సంస్థ పెద్దగా ఆసక్తి చూపలేదని అంటున్నారు.అయితే అనంతపురం జిల్లాలోని రామ్ నగర్ లో ఓలా స్కూటర్ తగలబడిందనే వాదనతో విజువల్స్ ను వాట్సప్ లో వైరల్ చేస్తున్నారు. "అనంతపురం టౌన్ లో తగలబడిన ఓలా స్కూటర్. రాంనగర్ లో ఇద్దరు యువకులు వెళుతూ ఉండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో వారు కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది." అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.వైరల్ అవుతున్న ఫోటోను నిశితంగా గమనించగా.. అందులో మలయాళంలో కొన్ని అక్షరాలు ఉన్నాయని గుర్తించాం. కాబట్టి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జరిగిన ఘటన అయితే కాదని స్పష్టంగా తెలుస్తోంది.ఇక మేము వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.."Kerala: OLA Electric Scooter Catches Fire in Thiruvananthapuram; Students Escape Unharmed (Watch Video)" అనే టైటిల్ తో lokmattimes వెబ్ సైట్ లో కథనాన్ని అక్టోబర్ 9, 2024న ప్రచురించారని గుర్తించాం.కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగిందని కథనంలో నివేదించారు. స్థానిక యువకులు కాలేజీకి వెళ్తుండగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే కిందకు దిగారు. కొద్దిసేపటికే స్కూటర్ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.Harinarayanan p c అనే ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు మాకు లభించాయి. అక్టోబర్ 8, 2024న ఈ వీడియోలను పోస్టు చేశారు. తిరువనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆ పోస్టులో తెలిపారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా పలు మలయాళ న్యూస్ అవుట్ లెట్లు కూడా ఈ ఘటన తిరువనంతపురంలో చోటు చేసుకుందంటూ నివేదించాయి.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.పలు మీడియా సంస్థలు ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుందని ధృవీకరించాయి. ఓలా బైక్ తగలబడిపోవడానికి కారణం ఏమిటన్న విషయంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత మేము ఈ కథనాన్ని నవీణీకరిస్తాము. ఓలా బైక్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో అగ్నికి ఆహుతయిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
Claim : అనంతపురంలోని రామ్ నగర్ లో ఓలా బైక్ తగలబడింది
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story