Wed Dec 25 2024 13:45:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బాలికకు గాయాలయ్యాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో
Claim :
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బాలికకు గాయాలయ్యాయిFact :
పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్ళినప్పుడు గాయాలవ్వలేదని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిసెంబర్ 23న కృష్ణా జిల్లాలో పర్యటించారు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు, రొయ్యూరులో పర్యటించారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయితీరాజ్ గ్రామీణావృద్ధి శాఖ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆ తర్వాత గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు. పల్లె పండుగలో ఇచ్చిన మాట ప్రకారం కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు పవన్ .
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి జరిగిందంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తొక్కిసలాట జరగడంలో ఓ బాలిక స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలించారని తెలిపారు. "గొడవర్రులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన రహదారి పనుల నాణ్యత ప్రమాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. అయితే ఆ సమయంలో అభిమానులు అధికంగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు." అంటూ పోస్టులు పెట్టారు.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
కొన్ని మీడియా సంస్థలు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి జరిగిందని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి
https://telugu.timesnownews.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా కృష్ణా జిల్లా పోలీసులు వైరల్ పోస్టులను ఖండిస్తూ ప్రకటనను విడుదల చేశారు.
పవన్ పర్యటనలో తొక్కిసలాట జరగలేదని పోలీసులు తెలిపారు. AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గొడవర్రు పర్యటనలో తొక్కిసలాట జరిగిందనే వార్తలను కృష్ణా జిల్లా పోలీసులు ఖండించారు. ఇందులో ఓ అమ్మాయి గాయపడిందనే కథనాలన్నీ ఫేక్ అంటూ తేల్చారు. 2 రోజులుగా జ్వరం ఉండటంతో బాలిక కళ్లు తిరిగి పడిపోయిందని, ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగానే ఉందని ఓ వీడియోను రిలీజ్ చేశారు.
"ఈరోజు అనగా ది 23-12-2024 తేదీన ఉదయం 11.30 నిముషాలు సమయం లో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు గొడవర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్బంగా తొక్కిసలాట జరిగి ఒక పాప ఆకస్మరక స్థితి లోనికి వెళ్లినట్లు, ఒక మీడియా లో అసత్య వార్త ప్రచారం చేయటం జరిగింది. వాస్తవంగా ఈ పాప అనారోగ్య కారణంగా కళ్ళు తిరిగినవి. నీరస పడగా సదరు పాపని తన తండ్రి గారు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళినారు. వైద్య చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. సదర విషయం ఆ పాప మరియు తన తండ్రి చెప్పటం జరిగింది మీడియా లో వస్తున్న సదరు వార్త నిజం కాదు.
ఇట్లు
ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్
కంకిపాడు సర్కిల్." అంటూ కంకిపాడు పోలీసుల ప్రకటన చూడొచ్చు.
పలు సోషల్ మీడియా ఖాతాలలో కూడా కృష్ణా జిల్లా పోలీసులు వైరల్ కథనాలను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గొడవర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్బంగా తొక్కిసలాట జరిగి ఒక పాప ఆకస్మరక స్థితి లోనికి వెళ్లినట్లు మీడియా లో అసత్య ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాస్తవంగా ఆ పాప అనారోగ్యం కారణంగా కళ్ళు తిరిగాయని తెలిపారు.
ఎండవల్ల తన కళ్లు తిరిగాయని, ఆ ప్రాంతంలో ఎలాంటి తొక్కిసలాట జరగలేదని బాలిక వివరణ ఇచ్చింది.
జనసేన పార్టీ నేతలు కూడా బాలికను ఆమె ఇంట్లో కలిశారు. జ్వరం కారణంగా కళ్ళు తిరిగిపడిపోయిన బాలిక గురించి పవన్ కళ్యాణ్ పర్యటనలో త్రోపులాట జరగడం వల్ల పడిపోయిందనేది అవాస్తవం. సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని జనసేన నాయకులు కూడా సోషల్ మీడియాలో కోరారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బాలికకు గాయాలయ్యాయి
Claimed By : Social Media Users, Media Channels
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media, Media Channels
Fact Check : False
Next Story