Sun Dec 22 2024 20:26:37 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
అధిక ఆటుపోట్ల సమయంలో ఈ మాక్ డ్రిల్ తనిఖీ ప్రక్రియలో భాగమని కమిషనర్ చెప్పారు
Claim :
వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌కు సమీపంలోని ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగిన రెండో రోజే తెగిపోయిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.Fact :
"టి" జంక్షన్‌ను ఫ్లోటింగ్ బ్రిడ్జి నుండి వేరు చేయడం సాధారణ మాక్ డ్రిల్‌లో భాగమే. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తెలిపారు.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇటీవలే వైసీపీ నేతలు ప్రారంభించారు.
ప్రారంభోత్సవం జరిగిన రెండో రోజున అదే బ్రిడ్జిలో కొంత భాగం విడిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇండియా టుడే స్టోరీలో ఒక లింక్‌ను కూడా పంచుకున్నారు. జగన్ రెడ్డి ప్రాజెక్టుల మాదిరిగానే.. ఇది కూడా అవినీతి కారణంగా.. ప్రారంభించిన కొద్దిసేపటికే కొట్టుకుపోయిందని అన్నారు చంద్రబాబు. వైసీపీని విమర్శిస్తూ పోస్టు కూడా పెట్టారు.
కొన్ని మీడియా సంస్థలు, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందనే వాదనతో పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వాదనలు ఉన్నాయి.
"ఫ్లోటింగ్ బ్రిడ్జ్" అని Googleలోనూ, Xలోనూ కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. FactCheck ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లో వివరణను కనుగొన్నాము. వైరల్ క్లెయిమ్ లో చెప్పినట్లుగా వంతెన పాడైపోలేదన్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి నుండి "టి" జంక్షన్ వ్యూపాయింట్‌ను వేరు చేయడం సాధారణ మాక్ డ్రిల్‌లో భాగమేనని, నిర్మాణ వైఫల్యం కాదని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ స్పష్టం చేశారు.
అధిక ఆటుపోట్ల సమయంలో ఈ మాక్ డ్రిల్ తనిఖీ ప్రక్రియలో భాగమని కమిషనర్ చెప్పారు. ఈ ప్రక్రియను వంతెన దెబ్బతిన్నదనే వాదనతో తప్పుగా ప్రచారం చేశారు. పుకార్లను నమ్మవద్దనిVMRDA ప్రజలను కోరింది. ఓ మీడియా సంస్థ చేసిన ఆరోపణలపై స్పందించిన ట్వీట్‌ను తెలుగులో పోస్ట్ చేసి అసలు జరిగిన ఘటనను వివరించింది.
విశాఖపట్నంలో నిన్న (25.02.2024) ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వాస్తవంగా 26.02.2024 నుండి సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ, వాతావరణ మార్పుల రీత్యా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండటం వల్ల నేడు సందర్శకులను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అనుమతించ లేదు. సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు “T” పాయింట్ (వ్యూ పాయింట్) ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించేందుకు, ఏంకర్ (anchor) లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచారు. ఆ విధంగా బ్రిడ్జ్, వ్యూ పాయింట్ ల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫొటో తీసి “ఫ్లోటింగ్ బ్రిడ్జ్” తెగిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్తవం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండి దాని “T” జంక్షన్ వ్యూ పాయింట్ ను సాధారణ మాక్ డ్రిల్ లో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేశారు. సముద్ర ప్రవాహాలు తీవ్రంగా (హై టైడ్) ఉన్నప్పుడు ఇది సాధారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని, భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో ఇలాంటి మాక్ డ్రిల్స్ చేపట్టడం జరుగుతుందని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ చెప్పారు.
ది హిందూ వంటి ప్రముఖ మీడియా సంస్థలు.. విశాఖపట్నంలోని ఫ్లోటింగ్ సీ బ్రిడ్జి మెయింటెనెన్స్ కోసం వేరు చేశారని.. తప్పుడు వాదనలను ప్రచారం చేశారని నివేదించింది. అధికారులే ఈ డీలింకింగ్ చేశారని.. అలల కారణంగా కొట్టుకుపోయిందనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఇక టి జంక్షన్ వద్ద వేరు చేస్తున్న సీసీటీవీ విజువల్స్ ను కూడా మనం చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. విశాఖపట్నంలోని తేలియాడే వంతెన విరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి.
Claim : A video is circulating on social media claiming that a section of the Floating Bridge near RK Beach in Vizag separated on the second day of its inauguration
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : X User
Fact Check : Misleading
Next Story