ఫ్యాక్ట్ చెక్: చిరంజీవి లైన్ లో కాకుండా ప్రత్యేకంగా ఓటు వేయడానికి వెళ్లిన వైరల్ వీడియో పాతది, 2024 లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేదు
తెలంగాణలో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో చిరంజీవి
Claim :
తెలంగాణలో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో చిరంజీవి లైన్ లో కాకుండా ప్రత్యేకంగా వెళ్లాలని ప్రయత్నించగా ప్రజలు అడ్డుకున్నారుFact :
వైరల్ వీడియో పాతది, ఇది 2014 ఎన్నికల సమయంలో చిత్రీకరించినది. 2024 ఎన్నికల సమయంలో, చిరంజీవి ఎటువంటి వివాదాలు లేకుండా ఓటు వేశారు
తెలంగాణలో 2024 లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలను నిర్వహించారు. 66 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది.
చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తదితర ప్రముఖులు ఉదయాన్నే ఓటు వేశారు. హైదరాబాద్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి పోలింగ్ స్టేషన్లో క్యూలో వెళ్లకుండా ప్రత్యేకంగా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు.. ఓ వ్యక్తి ఆయనను అడ్డుకుని క్యూ పాటించమని చెప్పారంటూ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక సామాన్యుడు స్టార్ హీరో చిరంజీవితో విబేధించారంటూ వీడియో వైరల్ అవుతూ ఉంది.
"మీకు ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరమా? మీరు క్యూలో ఉండాలి." అంటూ చిరంజీవిని సామాన్యుడు ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. దీంతో ఇతరులతో పాటు చిరంజీవి లైన్లో నిలబడడంతో వీడియో ముగుస్తుంది. చిరంజీవిని అడ్డుకున్న వ్యక్తిని ANI ఇంటర్వ్యూ చేసింది.
“@KChiruTweets and his son RRR actor @AlwaysRamCharan questioned by the common man in the polling booth for breaking line good to see a common man standing up and voice out these privileges.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ తేజ్ ను ఓ సామాన్యుడు ప్రశ్నించాడంటూ వీడియో పోస్టుల్లో తెలిపారు.
“చిరంజీవి జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్ వద్ద క్యూ పాటించలేదు #APElections2024 #VoteForGlass” అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. సినీ నటుడు చిరంజీవితో ఓ వ్యక్తి అలా మాట్లాడిన వీడియో ఇటీవలిది కాదు.
2024 ఎన్నికల్లో చిరంజీవి ఓటింగ్ గురించి వచ్చిన వార్తా కథనాల కోసం వెతికాం. హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి ఓటు వేసిన కొన్ని వీడియోలు మాకు కనిపించాయి. వైరల్ వీడియోలో కాకుండా భిన్నమైన వేషధారణలో చిరంజీవి ఉన్నారు.
మే 13, 2024న CNBC-TV18 ప్రచురించిన వీడియోలో.. చిరంజీవి ఆయన కుటుంబంతో సహా ఓటు వేయడానికి లైన్లో నిలబడ్డట్లు మనం చూడవచ్చు.
తదుపరి పరిశోధనలో.. వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని అమలు చేశాం. వీడియో 2014 నుండి ఆన్లైన్లో ఉందని మేము కనుగొన్నాము. ఈ సంఘటన మే 2014లో జరిగింది. నటుడు-రాజకీయవేత్త చిరంజీవిని ఓటర్లు పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ లో వెళ్లకుండా ప్రత్యేకంగా ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు.
ఎన్డిటివి మే 1, 2014న అప్లోడ్ చేసిన వీడియోలో ఓటర్ల క్యూలో రాకుండా ప్రత్యేకంగా వెళుతున్న చిరంజీవిని ఆపిన ఎన్ఆర్ఐ అనే శీర్షికతో వీడియోను అప్లోడ్ చేశారు.
అదే వీడియోను తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెల్స్ కూడా షేర్ చేశాయి. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో చిరంజీవి ప్రత్యేకంగా వస్తున్నప్పుడు ‘మీకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలా అని ఓటర్ ప్రశ్నించడంతో చిరంజీవి అవాక్కయ్యారు’ అనే వివరణతో వీడియోను V6 న్యూస్ షేర్ చేసింది.
కార్తీక్ అనే ఓటరు చిరంజీవిని ప్రశ్నించారు. చిరంజీవిని గౌరవిస్తానని, ఆయన ఒంటరిగా వచ్చి ఓటు వేసి ఉంటే తాను ఎలాంటి అభ్యంతరం చెప్పి ఉండేవాన్ని కాదని అన్నారు. కానీ తన కుటుంబంతో కలిసి క్యూలో రాకపోవడాన్ని కార్తీక్ తప్పుబట్టారు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్తీక్ ధైర్యానికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.
క్యూ లైన్ జంప్ చేసినందుకు చిరంజీవిని ఓ వ్యక్తి అడ్డుకున్న వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఇది 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలకు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.