Sun Nov 24 2024 00:20:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కొబ్బరికాయలు అమ్ముకుంటున్న తల్లికి ఆర్మీ జవాన్ సర్ప్రైజ్ ఇచ్చాడంటూ వైరల్ అవుతున్న వీడియో స్క్రిప్టెడ్
కొబ్బరికాయలు అమ్ముకుంటున్న తల్లికి ఆర్మీ జవాన్ కొడుకు కస్టమర్ లా
Claim :
కొబ్బరికాయలు అమ్ముకుంటున్న తల్లికి ఆర్మీ జవాన్ కొడుకు కస్టమర్ లా నటిస్తూ సర్ ప్రైజ్ ఇచ్చాడుFact :
వైరల్ వీడియో స్క్రిప్టెడ్. నటీనటులతో సృష్టించిన వీడియో ఇది
ఆర్మీలో ఉద్యోగం అంటే దేశ రక్షణ కోసం పాటుపడడమే. ఎంతో మంది తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆర్మీకి సేవ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సెలవులు దొరికితే ఇంటికి వచ్చి తమ కుటుంబాలతో గడుపుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఉన్నతాధికారులు పిలవగానే సెలవుల్లో ఉన్నా కూడా వెళ్లిపోవాల్సి ఉంటుంది.
సరిహద్దు భద్రతలో ఉన్న పిల్లలను తలచుకుంటూ ఎంతో మంది తల్లిదండ్రులు సొంత ఊళ్లలో బతుకుతూ ఉంటారు. ఊహించని విధంగా తమ పిల్లలు ఎదురైతే ఆ ఆనందం పట్టలేనిది. కొంతమంది సైనికులు అలాంటి సర్ ప్రైజ్ లను తల్లిదండ్రులకు ఇస్తూ ఉంటారు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఓ మహిళ కొబ్బరి బోండాలను అమ్ముతూ ఉంటారు. ఇంతలో మిలటరీ యూనిఫామ్ ధరించిన వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని వస్తారు. కొబ్బరి బోండాల గురించి అడగ్గానే ఆ మహిళ ఒక కొబ్బరి బోండాంను కొట్టడానికి సిద్ధమవుతుంది. ఇంతలో అతడు తన మాస్క్ తీసేయగా.. ఆ మహిళ భావోద్వేగానికి గురవుతుంది. ఆమెను ఆ వ్యక్తి హత్తుకుంటాడు.
"అమ్మకు ఆర్మీ జవాన్ స్వీట్ సర్ప్రైజ్
కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న జవాన్ తల్లి
సెలవుల మీద వచ్చి అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చిన జవాన్
చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లి భావోద్వేగం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో " అంటూ పోస్టులు పెట్టారు.
"అమ్మకు ఆర్మీ జవాన్ స్వీట్ సర్ప్రైజ్ కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న జవాన్ తల్లి
సెలవుల మీద వచ్చి అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చిన జవాన్. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లి భావోద్వేగం" అంటూ @ChotaNewsTelugu పేజీలో వీడియోను అప్లోడ్ చేశారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని.. ఇదొక స్క్రిప్టెడ్ వీడియో అంటూ మేము ధృవీకరించాం. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు ఉన్నాయి.
వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మాకు సంజనా గల్రాని ఫేస్ బుక్ పేజీలో సుదీర్ఘ నిడివి ఉన్న వీడియో మాకు కనిపించింది.
12 నవంబర్ 2024న ఫేస్బుక్లో వీడియోను అప్లోడ్ చేశారు. నటి సంజనా గల్రానీ ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను మేము గమనించాం. 4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో 3:37 సెకెండ్ల నిడివి ఉన్న వీడియోను మనం చూడొచ్చు.
వీడియో టైటిల్ లో ఉంచిన డిస్క్లైమర్ ప్రకారం.. ఈ పేజీలోని స్క్రిప్ట్ డ్రామాలు, పేరడీలు, అవగాహన వీడియోలు ఉన్నాయని గమనించాలని కోరారు. ఈ షార్ట్ ఫిల్మ్లు వినోదం, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించారని, వీడియోలలో చిత్రీకరించిన అన్ని పాత్రలు, సందర్భాలు కల్పితం అని వివరించారు. దీన్ని బట్టి ఇది కల్పితమని స్పష్టంగా తెలుస్తోంది.
15 నవంబర్ 2024న “3RD EYE” YouTube ఛానెల్లో కూడా అదే వీడియోను కనుగొన్నాం. వీడియో వివరణలో వినోదం, విద్య కోసం రూపొందించినట్లు తెలిపారు.
వీటిని బట్టి, వైరల్ వీడియో కల్పితమని స్పష్టంగా తెలుస్తోంది.
ఎక్స్ లో @dintentdata అనే పేజీలో వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ వివరణ ఇచ్చారని కూడా గుర్తించాం.
ఇక పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదని చెబుతూ కథనాన్ని ప్రచురించాయి. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదని, కల్పిత పాత్రలతో సృష్టించిన వీడియో అని మేము గుర్తించాం. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : కొబ్బరికాయలు అమ్ముకుంటున్న తల్లికి ఆర్మీ జవాన్ కొడుకు కస్టమర్ లా నటిస్తూ సర్ ప్రైజ్ ఇచ్చాడు
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story