Tue Apr 08 2025 20:01:37 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కోహ్లీ హోటల్ రూమ్ విజువల్స్ ఇటీవల బయటకు రాలేదు. 2022 లో జరిగిన ఘటనకు సంబంధించింది.
ఈ ఘటన 2022లో చోటు చేసుకుంది. ఇటీవలిది కాదు.

Claim :
విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ విజువల్స్ ను కొందరు రికార్డు చేసి బయట పెట్టారుFact :
ఈ ఘటన 2022లో చోటు చేసుకుంది. ఇటీవలిది కాదు
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలను అందుకున్నారు. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ ను గెలవలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ కప్ అందుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సమతూకంతో ఉంది.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ విరాట్ కోహ్లీ గాయం గురించి మాట్లాడారు. మ్యాచ్ 2వ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ గాయపడ్డాడు. మైదానంలో కోహ్లీ నొప్పితో బాధపడడం స్పష్టంగా కనిపించింది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సాయి సుదర్శన్ కృనాల్ పాండ్యాను ఎదుర్కొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సుదర్శన్ బంతిని బలంగా స్వీప్ చేయగా బంతి డీప్ మిడ్-వికెట్ వైపు దూసుకెళ్లింది. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని వేళ్లను తాకినట్లు అనిపించింది.
ఇంతలో విరాట్ కోహ్లీ ఉండే హోటల్ రూమ్ కు సంబంధించిన కొన్ని విజవల్స్ వైరల్ అయ్యాయంటూ కొన్ని తెలుగు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
"విరాట్ కోహ్లీ ఉన్న హోటల్ గదికి ( Hotel room) సంబంధించిన ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో... విరాట్ కోహ్లీ పర్సనల్ గా వాడే వస్తువులతో పాటు క్రికెట్ బ్యాట్లు, జెర్సీలు (Jerssy) , ఇతర వస్తువులు కనిపించాయి." అంటూ కథనాలను ప్రచారం చేశాయి.
వైరల్ కథనాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టిస్తూ ఉంది. 2022లో చోటు చేసుకున్న ఘటనను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా 2022 అక్టోబర్ నెలలో పలు కథనాలు కనిపించాయి. ఆస్ట్రేలియా పర్యటనకు విరాట్ కోహ్లీ వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కోహ్లీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో హోటల్ సిబ్బంది కోహ్లీ గదిని, అతడి వస్తువులను రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ ఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రమే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఈ వీడియో తన అసలైన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేసి, ఇది చాలా తప్పు అంటూ చెప్పుకొచ్చారు.
పెర్త్‌లోని ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సూపర్-12 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ ఆడుతున్నప్పుడు ఒక అభిమాని గోప్యతను ఉల్లంఘించి అతని గదిని వీడియో తీశాడని ఆరోపించారు.
వీడియో మీద 'కింగ్ కోహ్లీ హోటల్ రూమ్' అనే క్యాప్షన్‌తో ఉంది. దీనిని కోహ్లీ తన అకౌంట్ లో అక్టోబర్ 31, 2022న పోస్టు చేసి, అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసి చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారని, వారిని కలవడానికి ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారని నేను అర్థం చేసుకున్నాను. దానిని ఎల్లప్పుడూ అభినందిస్తున్నాను. కానీ ఇక్కడ ఈ వీడియో భయంకరమైనది. ఇది నా ప్రైవసీకి సంబంధించింది. అంతేకాకుండా నాకు ఎన్నో అనుమానాలను కలిగించింది. నా స్వంత గదిలో నాకే ప్రైవసీ లేకపోతే, నేను మనశాంతిని ఎక్కడ ఆశించగలను?? ఈ రకమైన దాడిని నేను అంగీకరించను. దయచేసి ఇతరుల గోప్యతను గౌరవించండి. వారిని వినోదం కోసం ఒక వస్తువుగా పరిగణించవద్దు" అని కోహ్లీ తెలిపారు.
ఇదే వాదనతో పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక ఈ ఘటనకు సంబంధించి 'హోటల్ క్రౌన్' సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. కోహ్లీ వీడియో రికార్డు చేసిన వ్యక్తులను తొలగించామని, క్షమించాలంటూ క్రౌన్ పెర్త్ హోటల్ కోరింది. దర్యాప్తు ప్రారంభించడం, ఇందులో భాగమైన వ్యక్తులను గుర్తించడం, వారిని క్రౌన్ హోటల్ నుండి తొలగించడం వంటి వాటిపై క్రౌన్ తక్షణ చర్యలు తీసుకుంది. అసలు వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుండి కూడా తొలగించామని హోటల్ క్రౌన్ తెలిపింది. భారత క్రికెట్ జట్టు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు క్షమాపణలు చెబుతున్నామని హోటల్ క్రౌన్ ప్రకటనలో తెలిపింది.
వైరల్ అవుతున్న పోస్టు లోని విజువల్స్, గతంలో కోహ్లీ తన అధికారిక అకౌంట్ లో పోస్టు చేసిన విజువల్స్ ఒకటేనని మేము ధృవీకరించాం.
కాబట్టి, 2022లో చోటు చేసుకున్న ఘటనను ఇటీవల చోటు చేసుకుందిగా ప్రచారం చేస్తున్నారు.
Claim : ఈ ఘటన 2022లో చోటు చేసుకుంది. ఇటీవలిది కాదు.
Claimed By : Media Outlets
Claim Reviewed By : TeluguPost
Claim Source : News Websites
Fact Check : Misleading
Next Story