ఫ్యాక్ట్ చెక్: దివ్వెల మాధురి గురించి వైఎస్ జగన్ స్పందించారంటూ వైరల్ అవుతున్న లెటర్ లో ఎలాంటి నిజం లేదు.
దివ్వెల మాధురి గురించి వైఎస్ జగన్ స్పందించారంటూ
Claim :
దివ్వెల మాధురి విషయంలో అల్లరి చేయడం బాధాకరం అంటూ వైఎస్ జగన్ ప్రకటనను విడుదల చేశారుFact :
వైరల్ అవుతున్న లెటర్ ఫేక్. వైఎస్ జగన్ దివ్వెల మాధురి విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు
తనపై వస్తున్న ఆరోపణలపై దివ్వెల మాధురి స్పందించారు. సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏవైనా విబేధాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. వాణి మాటలు పట్టుకుని అనవసరంగా తనను ఇందులోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. స్వార్థంతో వాణి తనపై నిందలు వేశారని, తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని మాధురి ఆరోపించారు. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని అన్నారు. ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌లా తనతో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం కలిసే ఉంటున్నామని స్పష్టం చేశారు. అయితే తమది సహజీవనం కాదని.. అడల్ట్రీ రిలేషన్ అని స్పష్టంగా చెప్పేసారు. శ్రీనివాస్‌ను వాణి ఇంట్లోకి రానివ్వకపోతే తన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. శ్రీనివాస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని.. అతని వద్ద ఆస్తులేమీ లేవని ఆమె స్పష్టం చేశారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు మాధురి. పలాస హైవేపై లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర మాధురి నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న కారును వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో మాధురికి గాయాలయ్యాయి. ఇది రోడ్డు ప్రమాదం కాదని, వాణి ఆరోపణలతో డిప్రెషన్ కు గురై తానే ఆ కారును ఢీ కొట్టానని మాధురి చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో విసుగుచెంది చనిపోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేశానన్నారు. ప్రస్తుతం పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, నిర్లక్ష్యంగా కారును నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారని మాధురిపై పలాస పోలీసులు కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంతలో మాధురికి మద్దతు ఇస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ లెటర్ ను విడుదల చేశారంటూ.. ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పథకం ప్రకారం వైసిపి కార్యకర్తలను హత్యలు చేశారు, నాయకులపై దాడులు చేశారు. నేడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై దాడులు చేస్తున్నారు. ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిపై పోలీసులను అడ్డం పెట్టుకొని గేట్లు బద్దలు కొట్టి ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఉత్తరాంధ్రలో వైసిపి బలోపేత కార్యక్రమాల గురించి శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారి నివాసంలో చర్చిస్తున్న శ్రీమతి దివ్వెల మాధురి గారికి అక్రమ సంబంధం అంటగట్టి అల్లరి చేయటం చాలా బాధాకరం. మంత్రి అచ్చంనాయుడు తొత్తులుగా మారి పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాధురి గారిపై చేసిన దాడిని ఖండిస్తూన్నా. కూటమి అధికారం శాశ్వతం కాదని అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా. ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా హత్యలు, దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటాన్ని నిరసిస్తూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద మంగళవారం జరిగే "రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన" అనే నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలను పాల్గొనాలని కోరుతున్నాను" అంటూ ఉన్న ఓ లెటర్ హెడ్ వైరల్ అవుతూ ఉంది. పైన వైసీపీ సింబల్.. కింద వైఎస్ జగన్ సంతకం ఉండడాన్ని చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న లెటర్ ఫేక్.
వైరల్ లెటర్ ను నిశితంగా పరిశీలిస్తే దువ్వాడ శ్రీనివాస్ అంశం గురించి ప్రస్తావించినప్పుడు.. పదాల్లో తప్పులను మనం గమనించవచ్చు. ఇది ఎవరో ఎడిట్ చేసినట్లుగా అనిపిస్తుంది.
లెటర్ లో ఆగస్టు 10వ తేదీ అని ఉంది. ఆరోజున, ఆ తర్వాత రోజున ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ప్రకటనల గురించి మీడియా ఛానల్స్ లో వెతికాం.. ఎక్కడా కూడా ఎలాంటి మీడియా కథనాలు మాకు కనిపించలేదు.
వైసీపీ అధికార వెబ్ సైట్ లో https://www.ysrcongress.com/news-all ఆగస్టు 10, 11 తేదీల్లో వచ్చిన కథనాల్లో కూడా ఎక్కడా కూడా వైఎస్ జగన్ దువ్వాడ శ్రీనివాస్-మాధురి అంశం ప్రస్తావించలేదని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక సంబంధిత కీవర్డ్స్ సాయంతో వెతకగా.. ఇటీవలి కాలంలో మాధురి గురించి వైఎస్ జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వైఎస్ జగన్ ఈ అంశంపై స్పందించి ఉండి ఉంటే తప్పనిసరిగా అందుకు సంబంధించిన కథనాలు హైలైట్ అయి ఉండేవి.
వైఎస్ జగన్, వైసీపీ అధికార సోషల్ మీడియా ఖాతాలను కూడా మేము ఆగస్టు 9 నుండి 12 తేదీ వరకూ పరిశీలించాం. ఇందులో కూడా ఎక్కడా ఈ వైరల్ లెటర్ కనిపించలేదు.
ఈ వైరల్ లెటర్ పై వివరణ కోరుతూ తెలుగు పోస్ట్ టీమ్ వైసీపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్ రెడ్డిని సంప్రదించింది. అయితే ఈ లెటర్ కు.. వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన కొట్టిపారేశారు. నకిలీ పోస్టులను నమ్మకండని ప్రజలకు సూచించారు.
దివ్వెల మాధురి గురించి వైఎస్ జగన్ స్పందించారంటూ వైరల్ అవుతున్న లెటర్ లో ఎలాంటి నిజం లేదు.