Fri Nov 29 2024 11:40:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మీ సొంత స్థలంలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం, 30 లక్షల నగదు ఇవ్వనున్నారా..?
సొంత స్థలంలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం, 30 లక్షల నగదు ఇవ్వనున్నారు
క్లెయిమ్: సొంత స్థలంలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం, 30 లక్షల నగదు ఇవ్వనున్నారు
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
సాధారణంగా పలు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే కాకుండా.. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా టవర్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక రేడియేషన్, బిల్డింగ్ క్వాలిటీ తగ్గుతుంది లాంటి అపోహలు కూడా మనుషులను వెంటాడుతూ ఉంటాయి.
డిజిటల్ ఇండియా వైఫై నెట్వర్క్ కింద భారత ప్రభుత్వం మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా సైట్లలో ఒక లెటర్ వైరల్ అవుతూ ఉంది.
వైరల్ అగ్రిమెంట్ లెటర్ ప్రకారం.. ఈ టవర్లను ఏర్పాటు చేయడం కోసం ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఈ పథకం కింద మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసుకోవడానికి స్థలం ఇచ్చినందుకు రూ.25,000 అద్దె చెల్లించబడుతుంది. అయితే ఆ ఉద్యోగం పొందడానికి అర్హత ప్రమాణాల ప్రకారం అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
20 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నందుకు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు చెల్లించనున్నట్లు కూడా లేఖలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.730 చెల్లించాలని లేఖలో కోరారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న లెటర్ లోని సమాచారం కోసం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్లను వెతికాం. అందులో మాకు ఈ టవర్లకు సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా లభించలేదు. అలాంటి ప్రోగ్రాంను భారత్ ప్రభుత్వం మొదలు పెట్టలేదని కూడా తెలుసుకున్నాం.ఇక కొందరు టెలికాం సంస్థల్లోని అధికారులకు ఫోన్ చేసి.. దీనిపై అడగగా వారు ఇలాంటి స్కీం ఏదీ లేదని.. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మకూడదని మా ఫ్యాక్ట్ చెక్ బృందానికి వివరణ ఇచ్చారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇదొక ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేసింది. "It is claimed in an approval letter that Govt of India is installing mobile towers under @_DigitalIndia Wi-Fi network. The letter is also asking payment of Rs 730 on the pretext of the registration fee," అంటూ తెలిపింది. కాబట్టి ఇందులో ఎటువంటి నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
డిజిటల్ ఇండియా అంటే ఏమిటి?
డిజిటల్ ఇండియా అనేది మెరుగైన ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం, సాంకేతిక రంగంలో దేశాన్ని డిజిటల్‌గా సాధికారత సాధించేందుకు తీసుకుని వచ్చిన పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సేవలు పౌరులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు 2015లో భారత ప్రభుత్వం ప్రారంభించిచింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించే ప్రణాళికలు చేస్తూ ఉన్నారు.
కాబట్టి మొబైల్ టవర్ల విషయంలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
క్లెయిమ్: మీ సొంత స్థలంలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం, 30 లక్షల నగదు ఇవ్వనున్నారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : A letter on social media sites claiming that the Indian government is set to install mobile towers under Digital India Wi Fi network
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story