Sat Nov 23 2024 08:27:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: షారుఖ్ ఖాన్ లతా మంగేష్కర్ భౌతికాకాయం దగ్గర ఉమ్మివేశారా..?
ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన భారత దిగ్గజ గాయని భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తీ ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో
ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన భారత దిగ్గజ గాయని భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తీ ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులతో పాటు మంగేష్కర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. లక్షలాది మంది ముంబైవాసులు, భారతీయులు అంత్యక్రియల వేదిక వద్ద లతా మంగేష్కర్ కు సంతాపం తెలిపారు.
గత కొన్నివారాలుగా ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ముంబయిలోని లతా నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర జరిగింది. భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పలువురు సినీ తారలు, ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలు పూర్తయిన కొద్దిసేపటికే.. అక్కడికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అయ్యింది. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ దువా (ప్రార్థనలు) చేస్తూ చేతులు పైకెత్తడం కనిపించింది, అతని మేనేజర్ పూజా నమస్కరిస్తూ కనిపించారు. షారుఖ్ ఖాన్ దువా చదివిన తర్వాత మంగేష్కర్ పాదాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నెటిజన్లు ఈ ఫోటోను 'సెక్యులర్ ఇండియా' అని పిలుస్తూ వచ్చారు.
లతా మంగేష్కర్ మృతదేహం దగ్గర షారుఖ్ ఖాన్ ఉమ్మివేసినట్లు.. ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తూ ఖండించడం ప్రారంభించారు. లతాదీదీకి శరీరంపై షారుఖ్ ఖాన్ ఉమ్మివేయడాన్ని నమ్మలేకపోతున్నాను. "Can't believe SRK spitted on #LataDidi's body while paying his "last respect" to her… Even if your Mazhab teaches you this, practice this at your home or with your own people…" అని ఒక ట్విట్టర్ వినియోగదారు రాశారు. పలువురు నిజమేనని నమ్మి షేర్లు చేశారు.
నిజ నిర్ధారణ:
షారుఖ్ ఖాన్ ఉమ్మివేయలేదు..! ఆయన దువా చేశారు.
ఇస్లాం సంప్రదాయం ప్రకారం షారుఖ్ గాలి ఊదారు. దువాను చదువుతూ ఆమె భౌతికకాయంపై షారుఖ్ గాలి ఊదారు. ఆమె ఆత్మ సురక్షితంగా ఉండేందుకు, మరో జన్మలో కూడా ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని షారుఖ్ ఇలా చేశారు. అంత్యక్రియల సందర్భంగా హిందువులు చేసే ప్రార్థనల మాదిరే, ముస్లింలు కూడా వారి మతాచారాల ప్రకారం ఇలా చేస్తారు.
"షారుఖ్ ఖాన్ అక్కడ ఉమ్మి వేయలేదు. గాలి మాత్రమే ఊదాడు, ఇది ఇస్లాంలో సాధారణ విషయం. ముస్లింలు పవిత్ర ఖురాన్ నుండి ఆయత్లను చదివిన తర్వాత వారి నోటి నుండి గాలిని ఊదుతారు. ఒక ప్రముఖ వ్యక్తి మరణంలో కూడా కొందరు సమస్యను సృష్టిస్తున్నారు" అని ఒక ట్విట్టర్ వినియోగదారు రాశారు.
షారుఖ్ ఖాన్ లతా మంగేష్కర్ భౌతికాకాయం దగ్గర ఉమ్మివేయలేదు.
Claim : SRK spit near mortal remain of Lata Mangeshkar
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story