Thu Dec 19 2024 05:55:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కర్ణాటక కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ సోనియా గాంధీకి ఎలాంటి లెటర్ రాయలేదు.
కర్నాటక లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 26, మే 7, 2024లో రెండు-మూడు దశలలో నిర్వహించారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి, మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.
Claim :
హిందువులను కులాలు, ఉపకులాల వారీగా విభజించాలని కర్ణాటక కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ సోనియా గాంధీకి లేఖ రాశారుFact :
వైరల్ అవుతున్న లేఖ నకిలీది. కర్ణాటక కాంగ్రెస్ నేత రాసిన లేఖ కాదు
కర్నాటక లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 26, మే 7, 2024లో రెండు-మూడు దశలలో నిర్వహించారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి, మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.
బీజాపూర్ లింగాయత్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ (BLDEA) అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు M B పాటిల్ కాంగ్రెస్‌కు ముఖ్య నాయకుడు. సాంప్రదాయకంగా బీజేపీతో జతకట్టినప్పటికీ, లింగాయత్ సామాజికవర్గం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతునిచ్చింది.
కర్ణాటక ఎన్నికల్లో గెలవడానికి 'హిందువులను విభజించండి. ముస్లింలను ఏకం చేయండి' అనే విధానాన్ని అనుసరించాలని BLDEA అధ్యక్షులు M B పాటిల్ సోనియా గాంధీకి ఒక లేఖ రాశారంటూ ఓ చిత్రం వైరల్ అవుతూ ఉంది. BLDE అసోసియేషన్ లెటర్‌హెడ్‌పై సోనియా గాంధీని ఉద్దేశించి రాసిన లేఖపై 10/7/2017 తేదీ ఉంది.
కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల కోసం అమలు చేయాల్సిన వ్యూహంపై గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్, వరల్డ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతోనూ ఇతర మంత్రులతో సమగ్రంగా చర్చించినట్లుగా ఎంబీ పాటిల్ లేఖలో తెలిపారు.
ఈ లేఖను మే 2024లో పోస్టు చేసిన కొందరు.. “కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారిపోతుందో జాగ్రత్తగా చూడండి. బీజేపీని ఓడించాలంటే హిందువులను విభజించి ఇలా చేయండని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఎంబీ పాటిల్ సోనియా గాంధీకి రాసిన లేఖలో స్పష్టంగా తెలిపారు. గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్ & వరల్డ్ ఇస్లామిక్ ఆర్గ్ నుండి సహాయం తీసుకున్నారు." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చలామణిలో ఉన్న లేఖ నకిలీది.
మేము సోనియా గాంధీకి BLDE అసోసియేషన్ MB పాటిల్ లేఖ రాశారని తెలుసుకోడానికి... కీవర్డ్లను ఉపయోగించి సెర్చ్ చేశాం. అప్పుడు ఇది నకిలీ లేఖ అని పేర్కొంటూ కొన్ని వార్తా నివేదికలు కనిపించాయి.
ఏప్రిల్ 2019లో టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. హిందువులను కుల ప్రాతిపదికన విభజించడమే కాంగ్రెస్ ఎన్నికల వ్యూహం అంటూ ఆరోపించిన లేఖపై రాష్ట్ర హోం మంత్రి MB పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017-2018లో ప్రత్యేక లింగాయత్ గుర్తింపు కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తనకు ఆపాదించిన లేఖ నకిలీదని, దీని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని పాటిల్ డిమాండ్ చేశారు.
కర్ణాటక మంత్రి M B పాటిల్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ లేఖకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 2019 లో ఈ లేఖ నకిలీదని పేర్కొంటూ అసత్య ప్రచారాన్ని ఖండించారు. ‘దీన్ని తయారు చేసి ప్రచురించిన వారిపైన ఫోర్జరీ చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇలాంటి చర్యల కారణంగా బీజేపీ నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల మద్దతు కోల్పోవడంతో.. వారు ఇప్పుడు పూర్తిగా నకిలీ లేఖలపై ఆధారపడుతున్నారు.' అంటూ విమర్శలు గుప్పించారు.
ఆయన పోస్ట్‌లలో, BLDEAకు సంబంధించిన నిజమైన లెటర్‌హెడ్‌ను షేర్ చేశారు. ఇది వైరల్ లేఖకు భిన్నంగా ఉందని గమనించాం.
కాబట్టి, వైరల్ అవుతున్న లేఖ నకిలీదని తెలుస్తోంది. హిందువులపై 'విభజన రాజకీయాలు' చేయాలని.. క్రైస్తవులు, ముస్లింల సహాయం తీసుకోవాలని కర్ణాటక మంత్రి M B పాటిల్ సోనియా గాంధీకి ఎలాంటి లేఖ రాయలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : హిందువులను కులాలు, ఉపకులాల వారీగా విభజించాలని కర్ణాటక కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ సోనియా గాంధీకి లేఖ రాశారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story