Mon Dec 23 2024 04:07:10 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: LUPPO అనే "కేక్" తింటే పిల్లలకు పక్షవాతం వస్తుందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఈ రోజుల్లో ఏ వేడుక అయినా కేక్ కటింగ్ తో మొదలవుతుంది. పుట్టినరోజు అయినా, వీడ్కోలు పార్టీ అయినా సరే,
Claim :
మార్కెట్లో కొత్తగా లుప్పో కేక్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి, అవి పిల్లల్లో పక్షవాతానికి కారణమవుతున్నాయిFact :
లుప్పో కేక్‌లను భారతదేశంలో కాకుండా ఇరాక్‌లో అమ్ముతారు. ఈ కేకులు మార్కెట్‌కి కొత్త కాదు
ఈ రోజుల్లో ఏ వేడుక అయినా కేక్ కటింగ్ తో మొదలవుతుంది. పుట్టినరోజు అయినా, వీడ్కోలు పార్టీ అయినా సరే, కేక్ కట్ చేయడం అన్ని చోట్లా తప్పనిసరి అయిపోయింది. మార్కెట్లలో వివిధ రకాల కేకులు కూడా అందుబాటులో ఉన్నాయి. రెడీమేడ్ పేస్ట్రీలను తల్లిదండ్రులు పిల్లల స్నాక్ మెనూలలో కూడా చేర్చుతున్నారు. ఇటీవల, కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ బేకరీ కేక్ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలను కనుగొన్నారు. ప్రమాదకరమైన రసాయనాలు, కృత్రిమ రంగులను ఉపయోగించవద్దని అన్ని బేకరీలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వార్త ఆన్లైన్లో వ్యాపించిన వెంటనే ఒక వ్యక్తి ప్యాక్ చేసిన కేక్‌ను తెరిచి చూడగా అందులో రెండు తెల్లని మాత్రలు ఉన్న వీడియో వైరల్‌గా మారింది. లుప్పో అనే కేక్ మార్కెట్లో కొత్తగా వచ్చిందని. పిల్లల్లో నెమ్మదిగా పక్షవాతం కలిగించే మాత్రలు ఆ కేక్‌లలో ఉంటాయని అంటూ షేర్ చేస్తున్నారు. “LUPPO అని పిలువబడే ఒక రకమైన "కేక్" మార్కెట్లో విడుదల చేయబడింది. ఇందులో రెండు చిన్న మాత్రలు ఉంటాయి. ఇదొకరకమైన డ్రగ్.. అలవాటై,ఇది పిల్లలను నెమ్మదిగా పక్షవాతనికి గురిచేసే టాబ్లెట్ అని అంటున్నారు. దయచేసి ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. అలాగే పాఠశాల ఆవరణలో మాత్రమే విక్రయిస్తున్నట్లు సమాచారం. మీ పిల్లలు ఇలాంటి సందేహాస్పద వస్తువులను కొని తినకుండా చూసుకోండి.” అంటూ తెలుగులో మెసేజీని వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వాదన 2019, 2020, 2022 సంవత్సరాల్లో కూడా వైరల్ అయింది. తయారు చేసిన కంపెనీ చైనాకు చెందిందని పలు పోస్ట్‌లు పేర్కొన్నాయి. కేక్ ల కారణంగా పక్షవాతానికి కారణమవుతాయని చూపిన వాదనలో ఎలాంటి నిజం లేదు.
మొదటగా ఈ కేకులు భారతదేశంలో అమ్మరు. వీడియోలో లుప్పో కొబ్బరి క్రీమ్ కేక్ ని చూడొచ్చు. టర్కిష్ కంపెనీ సోలెన్ తయారు చేసినట్లు కనుగొన్నాం. ఈ కేక్‌లు మార్కెట్లో కొత్త కాదు, అయితే వాటిని భారతదేశంలో అమ్మరు. జాగ్రత్తగా గమనించినప్పుడు, వైరల్ వీడియో స్క్రీన్‌గ్రాబ్ కేక్ పైభాగంలో ఉన్న చిన్న వృత్తాకార రంధ్రం చూపిస్తుంది, ఇది ఎడిట్ చేసి ఉండవచ్చనే అనుమానాలను పెంచుతుంది.
సోలెన్ కు సంబంధించిన అబౌట్ పేజీలో, లుప్పో బార్లు భారతదేశంలో విక్రయించలేదని మనం చూడవచ్చు. USA, బెల్జియం, జపాన్, మాల్దీవుల లాంటి 120 దేశాలకు Şölen 200కి పైగా ఉత్పత్తుల రకాలను ఎగుమతి చేస్తుందని తెలుసుకున్నాం. అంతేకాకుండా Şölen సంస్థకు దుబాయ్, అల్జీరియా, అజర్బైజాన్, USA, సౌదీ అరేబియా, జర్మనీ, ఇంగ్లాండ్‌లలో ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అలాగే లెవాంట్ రీజియన్, కెనడా, చైనా, లాటిన్ అమెరికాలో ప్రాంతీయ డైరెక్టరేట్లు ఉన్నాయి.
తయారీదారు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడమని తెలిపింది. ఆహార భద్రతా విధానం, తయారీ ప్రక్రియ సెడెక్స్, BSCI, ISO 9001 మొదలైన ఆడిట్ ప్రక్రియలను ఆమోదం పొందింది.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి మేము వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేసినప్పుడు 2020 సంవత్సరంలో స్నోప్స్, బూమ్‌లైవ్ వంటి అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థల ద్వారా వైరల్ వాదనను ఫ్యాక్ట్ చెక్ చేశారని మేము కనుగొన్నాము. టర్కిష్ ఫాక్ట్-చెకింగ్ వెబ్సైట్ 'Teyit' కూడా వాదనను తిరస్కరించింది. Teyit ప్రయోగశాల నివేదికలను యాక్సెస్ చేసింది. కేక్ బార్లు సంబంధిత పరీక్షలను క్లియర్ చేశాయని స్పష్టంగా చూపించింది. Teyit తయారీ విధానాన్ని కూడా వివరించింది. ఇది ఆటోమేటెడ్ ప్రక్రియ. తయారీ సమయంలో జోడించిన ఏవైనా మాత్రలు లేదా ఇతర పదార్థాలు బేకింగ్ ప్రక్రియలో కరిగిస్తారు. ఉత్పత్తి తయారీ పూర్తీ చేసిన తర్వాత మాత్రలు అందులో కలిపి ఉండవచ్చు.
Şölen అందించిన సమాచారం ఆధారంగా, ఈ కేకుల ఉత్పత్తిలో ఉపయోగించే ఫిల్టర్ల వ్యవస్థ 700 మైక్రాన్ల (0.7 మిల్లీమీటర్లు) కంటే పెద్ద కణాన్ని అడ్డుకుంటుందని స్నోప్స్ నివేదించాయి. అందువల్ల టాబ్లెట్లను ప్యాక్ చేయడానికి ముందు కేక్‌లో ఉంచడం సాధ్యమవ్వదు. లుప్పో కొబ్బరి క్రీమ్ బార్‌తో సహా సోలెన్ ఉత్పత్తులు స్నోప్స్కు తయారు చేసిన ప్లాంట్ల భద్రతా ధృవీకరణలను చూపించే బహుళ పత్రాలను కూడా సోలెన్ పరిశీలించింది. ఆ తనిఖీలను స్విస్ కంపెనీ SGS నిర్వహించింది.
తెలుగుపోస్ట్ 2022లో ఈ వాదనను ఖండించింది. కాబట్టి, మార్కెట్లో కొత్తగా వచ్చిన లుప్పో కేక్‌లలో పిల్లలపై పక్షవాతం ప్రభావం చూపే మాత్రలు ఉంటాయన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : మార్కెట్లో కొత్తగా లుప్పో కేక్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి, అవి పిల్లల్లో పక్షవాతానికి కారణమవుతున్నాయి
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story