Mon Dec 23 2024 14:57:24 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పుచ్చకాయలో పగుళ్లు రావడానికి కారణం పురుగుమందుల వల్ల కాదు
పుచ్చకాయ లోపల పగుళ్లు ఉంటే అసలు తినకూడదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి
Claim :
పుచ్చకాయల్లో పగుళ్లు వాటి పెంపకానికి వాడిన పురుగులమందుల ఉనికిని సూచిస్తాయి. ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చుFact :
పుచ్చకాయల్లో పగుళ్లు సరైన పరాగసంపర్కం, ఇతర పర్యావరణ పరిస్థితుల వల్ల సంభవిస్తాయి, పురుగుమందుల వల్ల కాదు.
పుచ్చకాయ లోపల పగుళ్లు ఉంటే అసలు తినకూడదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. అలా ఉన్న పుచ్చకాయకు పురుగుల మందులు ఎక్కువగా ఉపయోగించి ఉంటారంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
“If you open a watermelon you find these cracks in it ... DO NOT EAT IT! Link in First (c.o.m.m.e.n.t ).” అంటూ హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.
కొన్ని Facebook పోస్ట్‌లలో కూడా ఈ విషయాన్ని మనం చూడవచ్చు.
వాదనకు సంబంధించిన పోస్టులను మీరు గమనించవచ్చు.
ఈ పోస్ట్ కామెంట్స్ లోని లింక్ మమ్మల్ని elkoukii.com అనే వెబ్సైట్లో ప్రచురించిన కథనానికి తీసుకువెళుతుంది. అందులో కూడా ఇదే వాదనతో పోస్టులను షేర్ చేశారు. పుచ్చకాయలో ఎక్కువగా నీరు ఉంటుందని.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆ కథనం పేర్కొంది. పుచ్చకాయలు అద్భుతంగా ఉంటాయి కానీ అది అంత ప్రయోజనకరంగా ఉండని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.. కానీ పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే సందర్భాలు ఉన్నాయి. దాని లక్షణాల గురించి తెలుసుకోవడం, దాని తాజాదనాన్ని నిర్ధారించుకోవడం చాలా అవసరం, కాబట్టి ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం పుచ్చకాయలను తినకుండా పక్కన పెట్టడమే మంచిదని అందులో సూచించారు.
పుచ్చకాయ లోపల పగుళ్లు ఉంటే మాత్రం క్యాన్సర్లు, ట్యూమర్లు వస్తాయని చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. పుచ్చకాయలలో పగుళ్లు చాలా సాధారణం.
“cracks in watermelon” అని మేము సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. పరాగసంపర్కం సరిగా జరగకపోవడం వల్ల పుచ్చకాయలో పగుళ్లు ఏర్పడతాయని తెలిపే అనేక కథనాలను మేము కనుగొన్నాము. పుచ్చకాయలో పగుళ్లను హాలో హార్ట్ అని అంటారు.
డెలావేర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం, హోలో హార్ట్ కు కారణం తగినంత పరాగసంపర్కం జరగకపోవడమే. దీనర్థం తేనెటీగలు, కందిరీగలు, మకరందాన్ని కోరుకునే ఇతర కీటకాల ద్వారా తగినంత పుప్పొడి అందించబడదు. మకరందాన్ని కోరుకునేవి మొక్క నుండి మొక్కకు దూకుతాయి. కొన్ని కొన్నిసార్లు పరాగసంపర్కం సరిగా జరగకపోవడానికి కారణం ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు కూడా కారణం కావచ్చు.
హాలో హార్ట్ అనేది వ్యాధి కాదు. పరాగసంపర్క ప్రక్రియలో సమస్యల కారణంగా మాత్రమే తలెత్తింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయలు ఈ సమస్యతో ప్రభావితమైనప్పటికీ అది తినడానికి సురక్షితమైనవే..! వాస్తవానికి, అవి ఇతర పండ్ల కంటే తియ్యగా ఉంటాయి. నేచురల్ షుగర్స్ పగుళ్ల వెంట ఎక్కువగా ఉంటాయి.
నేషనల్ వాటర్ మెలన్ ప్రమోషన్ బోర్డ్, USA వెబ్సైట్ అయిన watermelon.org ప్రకారం, కొన్నిసార్లు పెరుగుతున్న పరిస్థితులు, చలి, వేడి లాంటి పరిస్థితుల కారణంగా అంతర్గత పగుళ్లు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిని హాలో హార్ట్ అని పిలుస్తారు. చింతించకండి - ఈ పుచ్చకాయలు తినడానికి సంపూర్ణంగా సురక్షితంమైనవి. అవి ఇతర వాటితో పోల్చుకుంటే తియ్యగా ఉంటాయి.
Phys.org ప్రకారం, డెలావేర్ విశ్వవిద్యాలయం గోర్డాన్ జాన్సన్ 2014లో ప్రోగ్రెసివ్ పొలినైజర్ స్పేసింగ్ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇది పుప్పొడి మూలాలకు దూరమవ్వడం వల్ల హాలో హార్ట్ ఏర్పడుతుంది. లోపల కాయలో సాంద్రత తగ్గుతుందని తేలింది.
పురుగుమందుల వాడకం వల్ల పుచ్చకాయల్లో పగుళ్లు వస్తాయని శాస్త్రీయంగా ఆధారాలు లేవు. పుచ్చకాయలలో హాలో హార్ట్ అని పిలువబడే పగుళ్లు పరాగసంపర్కం, ఇతర సహజ కారణాల వల్ల సంభవిస్తాయని పరిశోధన రుజువు చేస్తుంది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Cracks in watermelons indicate the presence of pesticides in them and can cause cancer
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story