Mon Dec 23 2024 15:25:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులకు తిరుమలలో ఇచ్చే లడ్డూలపై ఎలాంటి ఆంక్షలు లేవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 2024లో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కార్యనిర్వహణాధికారిగా సీనియర్ IAS అధికారి జె.శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు.
Claim :
భక్తులకు తిరుమలలో లడ్డూల పంపిణీపై ఆంక్షలు విధించారుFact :
దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులకు అదనపు లడ్డూలను ఇస్తున్నారు. దర్శనం టిక్కెట్లు లేని భక్తులు 2 లడ్డూలను మాత్రమే పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 2024లో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కార్యనిర్వహణాధికారిగా సీనియర్ IAS అధికారి జె.శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని కొత్త EO హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి రూపొందించనున్న కొత్త నిబంధనలపై పలు వార్తలు కూడా వచ్చాయి. తిరుమలలో లడ్డూ వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్యం. దాని పవిత్రత, ప్రత్యేకమైన రుచి, ఆకృతి కారణంగా భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. తిరుమలకు వెళ్లిన వాళ్లు లడ్డూలు పంచడం తరతరాలుగా సాగుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వరుని దర్శనం లేకుండా కేవలం లడ్డూలను తీసుకునే ఉద్దేశ్యం ఉన్న వారిని పరిమితం చేయడం కోసం.. బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా చేయాలనే ఉద్దేశ్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది టీటీడీ.
వైరల్ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని, భక్తులు మునుపటిలాగా ఒక ఉచిత లడ్డూను స్వీకరించడమే కాకుండా అదనపు లడ్డూలను కొనుగోలు చేయవచ్చని టీటీడీ స్పష్టం చేసింది. కొందరు దళారులు లడ్డూలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని, లడ్డూ ప్రసాదాలు పొందాలనుకునే టోకెన్లేని భక్తులకు ఆధార్ ధ్రువీకరణ చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించి పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.
న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం, మధ్యవర్తుల బెడదను అంతం చేసే లక్ష్యంతో, తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) టోకెన్లెస్ భక్తులకు శ్రీవారి లడ్డూల విక్రయానికి ఆధార్ ధ్రువీకరణను ప్రవేశపెట్టింది. లడ్డూ విక్రయాలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.
గుల్టేలో వచ్చిన కథనం ప్రకారం తిరుమల ఆలయంలో లడ్డూ పంపిణీపై టీటీడీ ఆంక్షలు తీసుకువస్తోందంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కథనం ప్రచురించింది. యాత్రికులు కోరుకున్నన్ని లడ్డూలను పొందడం సాధ్యం కాదని, నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే అనుమతీస్తున్నారన్నది అందులో సమాచారం.
అయితే, తిరుమల ఈఓ, వెంకయ్య చౌదరి ఈ కథనాన్ని తోసిపుచ్చారు. ఈ పుకార్లు తప్పుదారి పట్టిస్తున్నాయని ధృవీకరించారు. లడ్డూ పంపిణీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. బ్లాక్ మార్కెటింగ్, మధ్యవర్తుల వ్యవస్థను అరికట్టడానికి మేము ఒక చిన్న సంస్కరణను తీసుకున్నాము. దర్శన్ టిక్కెట్ హోల్డర్కు 1 ఉచిత లడ్డూ లభిస్తుంది. అతను/ఆమె క్రౌడ్ మేనేజ్మెంట్ ఆధారంగా 4 లేదా 6 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. దర్శనం టిక్కెట్టు, టోకెన్ లేని వారు 2 లడ్డూలు కొనుగోలు చేయవచ్చని ఈఓ తెలిపారు.
భక్తులు భయాందోళన చెందవద్దని ఈఓ కోరారు. తిరుమలలో దళారుల వ్యవస్థను అరికట్టేందుకు మాత్రమే ఈ చర్య తీసుకున్నట్లు టీటీడీ వివరణ ఇచ్చింది. అందుకే భక్తులకు ఇక నుంచి 2 లడ్డూ ప్రసాదాలు మాత్రమే లభిస్తాయన్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : భక్తులకు తిరుమలలో లడ్డూల పంపిణీపై ఆంక్షలు విధించారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story