Fri Nov 22 2024 10:58:42 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేటీఆర్ తన జీవితాన్ని నాశనం చేశారని నటి రకుల్ ప్రీత్ సింగ్ అధికారిక ప్రకటన చేయలేదు
టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేత కేటీ రామారావు, నటి రకుల్
Claim :
బీఆర్ఎస్ నేత కేటీ రామారావు తన జీవితాన్ని నాశనం చేశారని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపించారుFact :
రకుల్ ప్రీత్ సింగ్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు, షేర్ చేసిన చిత్రం వార్తాపత్రిక కథనం కాదు
టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేత కేటీ రామారావు, నటి రకుల్ ప్రీత్ సింగ్లను టార్గెట్ చేస్తూ పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కేటీఆర్ కూడా చాలాసార్లు డ్రగ్స్ తీసుకున్నారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రముఖ హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేశారని, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి జీవితాలను నాశనం చేశారని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణల్లో రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు హైలెట్ అయ్యాయి.
కేటీఆర్ తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ అధికారిక ప్రకటన ఇచ్చారని పేర్కొంటూ తెలుగు వార్తాపత్రిక కథనంలా ఒక మెసేజీ వైరల్ అవుతూ ఉంది. “నా జీవితం అతని వల్లే నాశనం అయింది. నా జీవితంలోకి వచ్చి నా కెరియర్ స్పాయిల్ చేసాడు. నాకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా అతనే. ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించి దుబాయ్ తీసుకెళ్లేవాడు. పెళ్లి చేసుకోకుండా ఉంటే జన్వాడ ఫాంహౌస్ నాకు రాసిస్తానన్నాడు, లగ్జరీ ఉండొచ్చు అన్నాడు. జాకీ భగ్నానితో రిలేషన్ లో ఉన్నందుకు, నాకు ఆఫర్స్ రాకుండా చేసాడు. అతనికి భయపడి నిర్మాతలు 5 సినిమాల నుండి నన్ను రిజెక్ట్ చేసారు. కేసీఆర్, హరీష్, సంతోష్ రావులకు చెప్పినా | వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఫిల్మ్ మ్యాక్జిన్ ఇంటర్యూలో కేటీఆర్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన ఆరోపణలు” అని అందులో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి ప్రకటన చేయలేదు. ఏ పత్రిక కూడా రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు అంటూ కథనాన్ని ప్రచురించలేదు.
మేము వైరల్ చిత్రాన్ని గమనించగా వార్తాపత్రిక పేరును కనుగొనలేకపోయాము. లేదా కథనంలో తేదీని కూడా గుర్తించలేకపోయాం. సంబంధిత కీవర్డ్లను ఉపయోగించి సెర్చ్ చేశాం. కానీ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లోని ఏ తెలుగు వార్తాపత్రికలలో కూడా రకుల్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలను కనుగొనలేదు. ఆమె సోషల్ మీడియా లో కూడా ఈ విషయానికి సంబంధించిన పోస్ట్ మాకు ఎక్కడా కనపడలేదు.
వైరల్ ఇమేజ్లో వాడిన రకుల్ ప్రీత్ సింగ్ ఇమేజ్ కోసం మేము సెర్చ్ చేయగా, జనవరి 2016లో “రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ ఫోటోలు” పేరుతో పలు చిత్రాలలో ఒకటి అని మేము గుర్తించాం. దీనితో వైరల్ చిత్రం పాతదని తెలుస్తోంది. ఒక ఫిల్మ్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేసిందని మేము గుర్తించాం.
ఆమె తాజా ఇంటర్వ్యూల గురించి వెతకగా, సెప్టెంబర్ 12, 2024న India today లో ప్రచురించిన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము.
Youtuber రణవీర్ స్లహబాడియాతో ఆమె మాట్లాడుతూ స్టార్ హీరో ప్రభాస్ తో రెండు తెలుగు సినిమాలలో తన స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకున్నారని ఆమె తెలిపింది. తనతో కొన్ని సినిమాల్లో అయితే షూట్ చేయించిన తర్వాత తనను తప్పించారని రకుల్ తెలిపింది. ఆమె తనకు ఫేమ్ తెచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు ముందు ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చిందని, ఎందుకు తీసేశారో తెలిసేది కాదని ఆమె చెప్పుకొచ్చింది. సెప్టెంబరు 11, 2024న రణవీర్ అలహబాడియా ఛానెల్లో అప్లోడ్ చేసిన YouTube ఇంటర్వ్యూలో KTR గురించి లేదా అలాంటి అంశాల గురించి మాట్లాడలేదు. మొత్తం ఇంటర్వ్యూని ఇక్కడ చూడవచ్చు.
కేటీఆర్ తన జీవితాన్ని నాశనం చేశారని రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆమె అలాంటి ప్రకటనేమీ చేయలేదు. ఏ తెలుగు పత్రిక కూడా కథనాన్ని ప్రచురించలేదు.
Claim : బీఆర్ఎస్ నేత కేటీ రామారావు తన జీవితాన్ని నాశనం చేశారని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపించారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story