నిజ నిర్ధారణ: దిగ్గజ నటుడు ఎన్టీ రామారావు మాజీ ప్రధాని నెహ్రూతో ఉన్న అరుదైన ఫోటో నిజమైనది కాదు, అది మార్ఫ్ చేసినది
మాజీ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తెలుగు మహా నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు పక్క పక్కనే కూర్చున్న ఫోటో చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.
మాజీ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తెలుగు మహా నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు పక్క పక్కనే కూర్చున్న ఫోటో చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ అని ముద్దుగా పిలువబడే రామా రావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేయడమే కాకుండా స్థానిక రాజకీయ పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడ అయి చరిత్ర సృష్టించారు.
జవహర్లాల్ నెహ్రూ ఎన్‌టి రామారావుతో సమావేశమైన అరుదైన చిత్రం ఇది అంటూ ఈ చిత్రం షేర్ చేయబడుతోంది. మాజీ ప్రధానమంత్రి తీవ్రంగా ఆలోచిస్తూ ఏదో వింటుంటే, రామారావు గారు మాత్రం నవ్వుతూ కనబడడం వింతగా కనిపిస్తుంది ఈ చిత్రంలో.
నిజ నిర్ధారణ:
వైరల్ చిత్రం మార్ఫ్ చేయబడింది. ఎన్‌టి రామారావుతో జవహర్లాల్ నెహ్రూను చూపించే అరుదైన చిత్రం ఇది అనే వాదన అబద్దం.
గూగుల్‌ని ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మహాత్మా గాంధీ పక్కన కూర్చుని ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అసలు చిత్రం లభించింది. వారిద్దరూ చర్చలో మునిగిపోయి ఉండడాన్ని గమనించవచ్చు.
గెట్టి ఇమేజెస్ వెబ్సైట్లో, అసలు చిత్రం "బొంబాయి కాంగ్రెస్ సమావేశంలో ఆలిండియా కాంగ్రెస్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీతో మాట్లాడుతున్నారు" అనే వివరణతో ప్రచురించబడింది.
ఈ చిత్రాన్ని అనేక ప్రచురణకర్తలు వివిధ సంవత్సరాల్లో వారి కథనాలలో క్రమం తప్పకుండా ఉపయోగించారు. ఈ చిత్రాన్ని అలమీ స్టాక్ ఫోటోలలో కూడా చూడవచ్చు.
జాగ్రత్తగా గమనిస్తే, వైరల్ ఇమేజ్‌లో జవహర్లాల్ నెహ్రూ కూర్చున్న తీరు, స్టాక్ చిత్రంలో ఆయన కూర్చున్న తీరు ఒకేలా ఉంది. చేతిలో కళ్లజోడు పట్టుకున్న తీరు కూడా ఒకేలా ఉంది. అసలు చిత్రంతో పోలిస్తే వైరల్ చిత్రం పిక్సలేట్ అయ్యి కనిపిస్తుంది. అసలు చిత్రం, వైరల్ చిత్రం పోలిక ఇక్కడ చూడొచ్చు.
అందువల్ల, మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలుగు మహా నటుడు ఎన్‌టి రామారావుతో కలిసి కూర్చుని ఉన్న అరుదైన చిత్రంగా షేర్ చేయబడుతున్న ఇమేజ్ మార్ఫింగ్ చేయబడింది, దావా అబద్దం.