ఫ్యాక్ట్ చెక్: షిర్డీ సాయి బాబా డబ్బులను ముస్లింలు తీసుకుని వెళుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
హిందువులు షిర్డీ సాయి బాబాకు ఇచ్చే కానుకలు ముస్లింలు
Claim :
హిందువులు షిర్డీ సాయి బాబాకు ఇచ్చే కానుకలు ముస్లింలు తీసుకుని వెళుతున్నారుFact :
బంగ్లాదేశ్ లోని మసీదుకు చెందిన వీడియో వైరల్ అవుతూ ఉంది
షిర్డీ సాయి బాబాను దేశ విదేశాలకు చెందిన భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు షిర్డీని సందర్శిస్తూ ఉంటారు. 2024కి వీడ్కోలు పలికి 2025కి స్వాగతం పలికేందుకు మహారాష్ట్రలోని షిర్డీకి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. సాయిబాబా ఆలయం డిసెంబర్ 31 రాత్రి అంతా తెరిచి ఉంటుందని, ఈ సంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలాసాహెబ్ కొలేకర్ ప్రకటించారు.
షిర్డీ సాయిబాబా సంస్థాన్ డిసెంబరు 29, 2024 నుండి జనవరి 1, 2025 వరకు వివిధ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలతో నాలుగు రోజుల షిర్డీ మహోత్సవ్‌ను నిర్వహిస్తోందని కోలేకర్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల, భకత్నివస్థాన్లో 34,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటపం ఏర్పాటు చేశారు. క్రిస్మస్ సెలవుల కారణంగా షిర్డీలో భక్తుల రద్దీ పెరిగింది.
మహారాష్ట్రలోని హింగోలికి చెందిన 85 ఏళ్ల నర్సింగరావు సఖ్యా బుండి షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు రూ.3 లక్షలు విరాళంగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించిన నర్సింగరావు తన వ్యవసాయ భూమిని అమ్మిన తర్వాత సాయిబాబాకు ఆ డబ్బును విరాళంగా ఇచ్చాడు.హైదరాబాద్‌కు చెందిన నర్సింగరావు గత 53 ఏళ్లుగా షిర్డీని సందర్శిస్తున్నారు. తన వ్యవసాయ భూమిని అమ్మిన తరువాత, దానిలో కొంత భాగాన్ని బాబాకు కృతజ్ఞతా చిహ్నంగా ఇవ్వాలనుకున్నానని తెలిపారు. హింగోలి జిల్లాలో భూమిని కొనుగోలు చేశాడు. అతని వయస్సు కారణంగా ఇకపై తన భూమిని సాగు చేయకపోవడంతో దానిని విక్రయించి, వచ్చిన మొత్తాన్ని విరాళాలుగా ఇచ్చాడు.
షిర్డీకి ఇచ్చే విరాళాలు ముస్లింలు తీసుకుని వెళుతున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"షిర్డీ సాయి జేబులో పెట్టిన హిందువుల సొమ్ము ఎక్కడికి పోతుందో మీరే చూడండి! కళ్లున్నప్పటికీ అంధుడిగా మారిన దేశంలోని ప్రతి హిందువుకు చేరేలా దీన్ని వైరల్ చేయాలా?" అంటూ పోస్టులు షేర్ చేశారు.
ఇదే వాదనతో, ఇదే వీడియో ఏడాది క్రితం కూడా వైరల్ అయింది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బంగ్లాదేశ్ లోని మసీదుకు చెందిన వీడియోను షిర్డీకి చెందినదిగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ వీడియోలో, ఇస్లామిక్ టోపీలు ధరించిన వ్యక్తులు విరాళాల పెట్టె నుండి నగదును సేకరించి వాటిని గోనె సంచులలో ఉంచడం చూడవచ్చు. బస్తాల ద్వారా డబ్బులు తరలిస్తూ ఉన్నారు.
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు কিশোরগঞ্জ ভিউস అనే ఫేస్ బుక్ పేజీలో మే 6, 2023న అదే వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం. నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము గుర్తించాం. వైరల్ వీడియో లోని వ్యక్తులే ఈ వీడియోలో కూడా కనిపించారు.
ఆ వీడియోలోని వివరణలో কিশোরগঞ্জের ঐতিহাসিক পাগলা মসজিদের আটটি দানবাক্স এবার চার মাস পর খোলা হয়েছে। এবার দানবাক্সগুলোতে পাওয়া গেছে রেকর্ড ৫ কোটি ৫৯ লাখ ৭ হাজার ৬৮৯ টাকা। এছাড়াও বৈদেশিক মুদ্রা ও স্বর্ণালঙ্কার পাওয়া গেছে। এবার একটি ডায়মন্ডের নাকফুল পাওয়া গেছে। প্রায় ১৩ ঘণ্টায় ২০০জনে এ টাকা গণনার কাজ করেন। শনিবার (৬ মে) সকাল ৮ টায় দানবাক্সগুলো খোলা হয় అని ఉంది.
ఇది బంగ్లాదేశ్ లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించిందంటూ గుర్తించాం. కిషోర్‌గంజ్‌లోని చారిత్రాత్మక పాగ్లా మసీదులోని ఎనిమిది విరాళాల పెట్టెలు నాలుగు నెలల తర్వాత తెరిచారని, ఈసారి రికార్డు స్థాయిలో 5 కోట్ల 59 లక్షల 7 వేల 689 టాకా విరాళాలు పెట్టెల్లో వచ్చాయని తెలిపారు. విదేశీ నాణేలు, బంగారు ఆభరణాలు కూడా అందులో ఉన్నాయన్నారు. దాదాపు 13 గంటల్లో 200 మంది ఈ డబ్బును లెక్కించేందుకు పనిచేశారని పోస్టులో వివరించారు.
ఇదే విషయాన్ని తెలుసుకోడానికి మేము కీవర్డ్ సెర్చ్ చేయగా పాగ్లా మసీదుకు భారీ విరాళాలు వస్తూ ఉంటాయని పలు మీడియా కథనాల ద్వారా కనుగొన్నాం.
బంగ్లా మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇదే వీడియోను మేము కనుగొన్నాం.
వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు గతంలోనే నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోకు షిర్డీ సాయి బాబా ఆలయానికి ఎలాంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించిన వీడియో ఇది.