Fri Nov 22 2024 17:05:10 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల అతిథి గృహంలో పార్టీ చేసుకోలేదు
తిరుమల ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఉంది. తిరుమల కొండలపై వెలసిన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది
Claim :
తిరుమల అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ నేతలు డ్యాన్స్ చేస్తున్నారుFact :
విజయవాడలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో నేతలు డ్యాన్స్ చేశారు, తిరుమలతో ఎలాంటి సంబంధం లేదు
తిరుమల ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఉంది. తిరుమల కొండలపై వెలసిన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయ పవిత్రతను కాపాడుకోవడానికి, భక్తులు పాటించవలసిన అనేక నియమాలు ఉన్నాయి. తిరుమలలో మాంసాహారం, మద్యానికి అనుమతి లేదు. భక్తులు పొగ త్రాగరాదు. చెత్తాచెదారం వేయకూడదు. పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రాంతం పవిత్రతను కాపాడుతుంది. ఇటీవల ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్లపై ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలు నడపాలని కోరింది. ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 30, 2024 వరకు ఈ ఆంక్షలను విధించారు.
తిరుమల కొండల్లోని వసతి గృహంలో తెలుగుదేశం పార్టీ నేతలు డ్యాన్స్ చేస్తున్నారనే ప్రచారంతో కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “తిరుమలలో అపచారం, సాలూరు తెలుగుదేశం నాయకుల బరితెగింపు, తిరుమల, తిరుపతి దేవస్థానం పద్మావతి వసతి గృహంలో చిందులు.. అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర మంత్రి గుమ్మిడి నంద్యారాణి ఆధ్వర్యంలో ఆమె భర్త జయ కుమార్, సాలూరు ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేఖర్లు లక్కోజి శ్రీనివాస్, అనవర్తి రాముల చిందులు” అంటూ పోస్టులు పెట్టారు.
తిరుమలలోని పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో ఈ ఘటన జరిగిందని కొందరు వినియోగదారులు షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో తిరుమలలోనిది కాదు, విజయవాడలో జరుపుకున్న ఓ పుట్టినరోజు వేడుకలో నాయకులు చేసిన డ్యాన్స్ కు సంబంధించింది.
మేము వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అది TTD వసతి గృహంలో చోటు చేసుకున్న వీడియో కాదని పేర్కొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం X హ్యాండిల్ ప్రచురించిన పోస్ట్ను మేము కనుగొన్నాము.
ap7am.com అనే వెబ్సైట్ తిరుమలలోని కొండలపై వైరల్ వీడియోను చిత్రీకరించలేదని వివరణ ఇచ్చింది. విజయవాడలో జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలో చిత్రీకరించిన వీడియో అని ఏపీ పోలీసులు స్పష్టం చేశారని పేర్కొంటూ ap7am.com వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. తప్పుడు కథనాలతో ఇలాంటి కించపరిచే వీడియోలను పోస్ట్ చేయడం నేరమని, అలాంటి పనులు చేస్తున్న వినియోగదారులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని పోలీసు శాఖ హెచ్చరించింది.
ఈ వాదనలను ఖండిస్తూ ఏపీ పోలీసులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. “విజయవాడలో జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలో చిత్రీకరించిన ఈ వీడియో తిరుమలలో చిత్రీకరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని ఏపీ పోలీసులు చేసిన ట్వీట్లను మేము కనుగొన్నాము. తిరుమల పవిత్రతను కించపరిచేలా ఫేక్ వీడియోలు పోస్ట్ చేయడం నేరం, అలాంటి పనులు చేసిన వారిపై సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు.
అయితే, విజయవాడ లో ఈ పార్టీ ఎక్కడ జరిగింది, వీడియో ఎవరు తిసారు వంటీ వివరాలు మాకు లభించకపోయినా, ఈ వీడియో తిరుమల కు చెందినది కాదు అని మేము నిర్ధారించగలిగాము. కాబట్టి, వైరల్ వీడియోకు తిరుమలకు ఎలాంటి సంబంధం లేదు. తిరుమలలోని ఏ గెస్ట్ హౌస్లోనూ ఈ వీడియోను రికార్డు చేయలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : తిరుమల అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ నేతలు డ్యాన్స్ చేస్తున్నారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story