Mon Mar 31 2025 17:16:32 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సీనియర్ నటుడు పృధ్వీ చనిపోయాడంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'లైలా' సినిమా త్వరలో విడుదల

Claim :
తెలుగు సినీ నటుడు 30 ఇయర్స్ పృధ్వీ ఫిబ్రవరి 11న చనిపోయారుFact :
ఆసుపత్రిలో తెలుగు సీనియర్ నటుడు పృధ్వీ చికిత్స పొందుతున్నారు
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'లైలా' సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదే ఈవెంట్ కు హాజరైన సీనియర్ తెలుగు నటుడు పృధ్వీ రాజకీయంగా కొన్ని కామెంట్లు ఇన్ డైరెక్ట్ గా చేశారు. లైలాలో ఓ సన్నివేశం గురించి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పృధ్వీ మాట్లాడారు. మేకల సత్తిగా తాను చేశానని చెప్పారు. మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే.. 150 ఉన్నాయని చెప్పారని అన్నారు. యాధృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివర్లో లెక్కేస్తే కరెక్టుగా 11 గొర్రెలే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారని పృధ్వీ అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. బాయ్ కాట్ లైలా అంటూ కొన్ని వేల ట్వీట్లు వచ్చాయి. ఆ తర్వాత విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ తమ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు పృధ్వీ రాజ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. పృధ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలకు మేము వారితో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని విశ్వక్ అన్నారు.
పృధ్వీ క్షమాపణలు చెప్పాలని, లేదంటే సినిమా నుంచి ఆయన సీన్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పృధ్వీ ఫోన్ నెంబర్ కూడా వైరల్ అయింది. దీంతో ఆయన స్విచ్ ఆఫ్ చేశారని సమాచారం. ఫిబ్రవరి 14న లైలా సినిమా విడుదల కాబోతోంది.
ఇంతలో నటుడు పృధ్వీ రాజ్ మరణించాడంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
వైరల్ పోస్టును ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆసుపత్రి పాలైన వీడియోను తప్పుడు వాదనతో ప్రచారం చేస్తున్నారు.
సీనియర్ నటుడు పృధ్వీకి సంబంధించిన వార్తల కోసం వెతికాం.. అయితే ఆయన మరణించినట్లుగా మాకు ఎలాంటి నివేదికలు లభించలేదు.
ఇక "Prudhvi Raj: ‘లైలా’ చిచ్చు లేపి ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వి రాజ్" అనే టైటిల్ తో ఎన్టీవీలో మేము కథనాన్ని చూశాం.
" వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారని.. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదని హీరోతో పాటు నిర్మాత కూడా మీడియా ముందుకు వచ్చారు. సైలెంట్ గా ఉన్న పృథ్వీరాజ్ హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తోందని, ఆయనకు హై బీపీ రావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయనని ఆసుపత్రికి తరలించారు" అని ఆ కథనంలో ఉంది. ఇక పృథ్వీ ఆసుపత్రి బెడ్ పై ఉన్న వీడియోను కూడా ఎన్టీవీ పోస్టు చేసింది.
"Prudhvi: ఆస్పత్రిలో చేరిన కమెడియన్ పృధ్వీ, వివాదమే కారణం?" అంటూ ఏషియా నెట్ న్యూస్ తెలుగులో కూడా మేము ఓ కథనాన్ని చూశాం. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
"పృధ్వీరాజ్ ప్రస్తుతం హాస్పటిల్ పాలయ్యారు. హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హై బీపీతో బాధపడుతున్నట్లు పృధ్వీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే హఠాత్తుగా ఇలాంటి పరిస్దితి రావటానికి గల కారణం గత రెండు రోజులుగా జరుగుతున్న లైలా సినిమా వివాదమే అని తెలుస్తోంది." అంటూ ఆ కథనంలో ఉంది.
పలు మీడియా సంస్థలు కూడా పృధ్వీరాజ్ ఆసుపత్రి పాలయ్యారంటూ కథనాలను ప్రచురించాయి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. ఏ కథనంలో కూడా పృథ్వీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పలేదు. వైద్యుల అధికారిక ప్రకటన రాగానే కథనాన్ని నవీనీకరిస్తాం.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ను కూడా సంప్రదించాం. హై బీపీ కారణంగా సీనియర్ నటుడు పృధ్వీ ఆసుపత్రిలో చేరారని మాకు సమాచారం అందింది.
కాబట్టి, సీనియర్ నటుడు పృధ్వీ చనిపోయారనే వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Next Story