Thu Nov 21 2024 15:17:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: లారెన్స్ బిష్ణోయ్ కు క్షమాపణలు చెప్పమని సల్మాన్ ఖాన్ కు యోగి ఆదిత్యనాథ్ సూచించలేదు.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బహిరంగంగా బెదిరించినప్పటి నుండి
Claim :
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాలని నటుడు సల్మాన్ ఖాన్‌కు యూపీ ముఖ్యమంత్రి సలహా ఇచ్చారుFact :
వైరల్ వీడియోను ఎడిట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బహిరంగంగా బెదిరించినప్పటి నుండి వార్తల్లో నిలిచాడు. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను చంపాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. రాజస్థాన్‌లోని బిష్ణోయ్ కమ్యూనిటీకి కృష్ణజింక ఎంతో పవిత్రమైన జంతువు. అందుకే సల్మాన్ ఖాన్ ను చంపేయాలని అనుకుంటూ ఉన్నానని లారెన్స్ బిష్ణోయ్ పలుమార్లు తెలిపాడు. ఇక మహారాష్ట్ర నేత బాబా సిద్ధిఖీ, పంజాబీ గాయకుడు-రాజకీయవేత్త సిద్ధూ మూసేవాలా హత్యల వెనుక లారెన్స్ ప్రధాన సూత్రధారి అని బోగట్టా. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుండి చాలాసార్లు బెదిరింపులు వచ్చాయి అని ప్రచారం లో ఉంది. ఏప్రిల్ 2024లో ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగిన తర్వాత సల్మాన్ భద్రతను Y- ప్లస్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేశారు.
ఈ పరిస్థితిలో, సల్మాన్ ఖాన్ క్షమాపణ చెబితే లారెన్స్ బిష్ణోయ్ సమాజం క్షమిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్న వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతోంది. “सलमान माफी मांग ले बात खत्म #लॉरेंस बिश्नोई समाज माफ़ कर देगा योगी आदित्यनाथ” అంటూ వీడియోలను వైరల్ చేస్తున్నారు. "సల్మాన్ క్షమాపణ చెప్పాలి, లారెన్స్ బిష్ణోయ్ సమాజం క్షమిస్తుంది" అని అర్థం వస్తుంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. తప్పుడు ప్రకటన వచ్చేలా వీడియోను ఎడిట్ చేశారు.
వీడియోను సరిగ్గా పరిశీలించగా, వీడియోలో, యోగి “సల్మాన్ గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అతను ఇల్లు పొందుతున్నాడు. అతనికి ఆహారం అందుతోంది. వైద్య చికిత్స కూడా పొందుతున్నాడు, అయితే అతను భారతదేశ చట్టాన్ని కూడా అనుసరించాలి. రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుంది. షరియత్ మన వ్యక్తిగత విషయం కావచ్చు, కానీ షరియత్ రాజ్యాంగం కంటే పెద్దది కాదు. అతను దీనిని అనుసరించాలి. ” అని చెప్పారు. అంతేగానీ ఎక్కడా సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలి అని లేదు. ఇది అంతా కల్పితమని అర్ధమవుతోంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీసింది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి శోధించాము. ABP న్యూస్ ప్రచురించిన, నిడివి ఎక్కువ ఉన్న వీడియో మాకు లభించింది. “CM Yogi Exclusive: BJP ने यूपी में क्या-क्या किया, CM Yogi ने दी पूरी जानकारी | Election 2024” అనే శీర్షికతో వీడియోను మార్చి 23, 2024న ప్రచురించారు.
ఈ విడియో 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో చేసిన ఇంటర్వ్యూ. శాంతిభద్రతలు, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా గత ఏడేళ్లలో తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆయన చర్చిస్తున్నారు. మతపరమైన ధ్రువీకరణ, ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం ఆరోపణలతో సహా తన ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాల విమర్శలను కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో బీజేపీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆదిత్యనాథ్, లోక్‌సభలో ఆ పార్టీ 400 సీట్లకు పైగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇతర పార్టీలతో బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్-ఎస్పీ పొత్తు ప్రభావం గురించి కూడా ఆయన చర్చించారు.
యోగి ఆదిత్యనాథ్ ముస్లింల గురించి మాట్లాడుతున్న వీడియోను మనం చూడవచ్చు. ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అసలు వీడియోలో 38.5 నిమిషాల తర్వాత వైరల్ భాగాన్ని చూడవచ్చు. వైరల్ వీడియోలో సల్మాన్ అనే పదం స్థానంలో ముస్లిం అనే పదాన్ని మనం వినవచ్చు. అంతేకానీ, సల్మాన్ ఖాన్ గురించి కానీ లారెన్స్ బిష్నొయి గురించి కానీ ప్రస్తావించలేదు.
తదుపరి పరిశోధన తర్వాత, ఫ్యాక్ట్ చెక్ సంస్థ విశ్వాస్ న్యూస్, BJP సోషల్ మీడియా బృందాన్ని సంప్రదించింది. ముఖ్యమంత్రి అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని ధృవీకరించింది.
కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఇది ఒరిజినల్ వీడియో ఎడిట్ వెర్షన్. సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాలని యూపీ సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాలని నటుడు సల్మాన్ ఖాన్‌కు యూపీ ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు
Claimed By : Youtube Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Youtube
Fact Check : False
Next Story