Sat Dec 21 2024 05:03:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఉమ్మివేస్తే తప్ప ఆహారం హలాల్ కాదని ముస్లింలు కోర్టుకు చెప్పలేదు
మతపరమైన కారణాల వల్ల ముస్లింలు ఈ ఆచారాన్ని అనుసరిస్తారని చెప్పుకొచ్చారు
Claim :
ఆహారంపై ఉమ్మివేయడం హలాల్ ప్రక్రియలో భాగమని ముస్లిం సమాజం కోర్టులో అంగీకరించిందిFact :
ఉమ్మివేయడం హలాల్ ప్రక్రియలో భాగమని ముస్లిం సమాజం అంగీకరించిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు
తమిళనాడులో కోర్టు విచారణ సందర్భంగా, ‘హలాల్’ ప్రక్రియ ఉమ్మివేస్తేనే పూర్తవుతుందని ముస్లిం గ్రూపులు అంగీకరించినట్లు టెక్స్ట్ సందేశం వాట్సాప్లో షేర్ చేస్తున్నారు.
మతపరమైన కారణాల వల్ల ముస్లింలు ఈ ఆచారాన్ని అనుసరిస్తారని చెప్పుకొచ్చారు. 'ఏదైనా ముస్లిం యాజమాన్యంలోని హోటల్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడాన్ని' వ్యతిరేకిస్తున్నామని అందులో తెలిపారు.
"ముంబైలోని ప్రముఖ ఢిల్లీ దర్బార్లో కొన్నాళ్లుగా స్పైసీ నాన్వెజ్ ఫుడ్ను ఆస్వాదిస్తున్న వారు ఇప్పుడు
ప్రత్యామ్నాయం వెతకాలి..!!!
ముస్లిం హోటళ్లలో ఆహారాన్ని హలాల్ చేయడానికి ఉమ్మి వేస్తారని కోర్టు అంగీకరించింది."
"తమిళనాడులోని ఒక కోర్టు కేసులో, వంటవాడు ఉమ్మి వేస్తే తప్ప ఆహారం హలాల్ కాదని ముస్లింలు వాదించారు. అందువల్ల ముస్లింలు తయారుచేసే ఆహారంలో ఉమ్మి వేయకుండా పూర్తి కాదు. ఒక కోర్టు కేసులో, అతను ఉమ్మివేయడం ద్వారా ఆహారం హలాల్ అవుతుందని అంగీకరించాడు. ఇది TNNతో సహా దేశం మొత్తంలో జరుగుతోంది" అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ మెసేజీలో చెబుతున్న కేసు 2021లో జరిగింది. ఈ కేసు తమిళనాడు కోర్టులో కాకుండా కేరళ హైకోర్టులో విచారణకు వచ్చింది..
శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు (టిడిబి) శబరిమల వద్ద నైవేద్యం, ప్రసాదం సిద్ధం చేయడానికి ఏ మాత్రం మంచిగా లేని బెల్లంను ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ శబరిమల యాక్షన్ కమిటీ జనరల్ కన్వీనర్ ఎస్జెఆర్ కుమార్ ఒక పిటిషన్ దాఖలు చేశారు.
ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ 1950 నాటి హిందూ మత సంస్థల చట్టం XV ప్రకారం ఏర్పడిన స్వయంప్రతిపత్త సంస్థ. ఈ బోర్డు కేరళలోని 1,248 దేవాలయాల బాగోగులను చూసుకుంటూ ఉంది. ఇందులో శబరిమల ఆలయం కూడా ఉంది.
పిటిషనర్.. మరొక కమ్యూనిటీ మత విశ్వాసాల ప్రకారం ప్రత్యేకంగా తయారు చేయబడిన హలాల్-ధృవీకరించబడిన ఆహార పదార్థాల ఉపయోగం కరెక్ట్ కాదని.. అయ్యప్ప భగవానుడికి సమర్పించాల్సిన స్వచ్ఛమైన పదార్థం కాదని తెలిపారు.
ది న్యూస్ మినిట్లోని ఒక కథనం ప్రకారం, హైకోర్టు బెంచ్ పిటిషనర్తో మాట్లాడుతూ “హలాల్ భావన కొన్ని విషయాలలో నిషేధించారని మాత్రమే చెబుతుంది. మిగతా విషయాలన్నీ ‘హలాల్’ కిందకు రావు. నిషేధించిన పదార్థాలు నిర్దిష్ట ఉత్పత్తిలో చేర్చబడవని మాత్రమే ఈ ధృవీకరణ చెబుతుంది." అని తెలిపారు.
అరబిక్ లో హలాల్ అంటే అనుమతించదగినది. హలాల్ ఆహారం ఇస్లామిక్ చట్టానికి కట్టుబడి ఉంటుంది. ఆహారానికి సంబంధించి, ఇది ఖురాన్లో సూచించిన ఆహార ప్రమాణం. హలాల్ ఆహారం అనేది ఖురాన్లో నిర్వచించినట్లుగా ఇస్లామిక్ చట్టం ప్రకారం అనుమతించే ఆహారం.
కేసు విచారణ సమయంలో, 'హలాల్' ప్రక్రియ పూర్తవ్వాలంటే ఉమ్మివేయాలని ముస్లింలు చెప్పారనే వాదనలో ఎటువంటి నిజం లేదు. ఏ ముస్లిం సంస్థ లేదా ముస్లిం వ్యక్తిని ప్రస్తావించలేదు.
కాబట్టి, ఆహారంపై ఉమ్మివేయడం హలాల్లో భాగమని ముస్లిం సమాజం కోర్టులో అంగీకరించలేదని స్పష్టమైంది.
Claim : Muslim community admits in the court that spitting on food is part of halal process
Claimed By : Social Media
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story