ఫ్యాక్ట్‌చెక్: మెట్లదారిలో తిరుమల చేరే భక్తుల రక్షణకోసం ఇవ్వదలచిన కర్రలకు అద్దె వసూలుచేస్తున్నారనే ప్రచారం అబద్దం.
తిరుమలకు మెట్లదారిలో నడచి వచ్చే భక్తులతో టీటీడీ లేదా వైఎస్సార్సిపి నాయకులు కర్రల వ్యాపారం మొదలుపెట్టారు, పదిరూపాయల అద్దె వసూలు చేయబోతున్నారంటూ కొందరు సోషల్ మీడియా, సోషల్ నెట్‌వర్క్‌లలో ప్రచారం చేస్తున్నారు.
Claim :
తిరుమల కొండపైకి మెట్లదారిలో వెళ్ళే భక్తులకు క్రూరమృగాల నుంచి రక్షణకు టీటీడీ ఇవ్వదలచిన కర్రలకు పది రూపాయాల అద్దె వసూలు చేస్తారు, అందుకు కాంట్రాక్టు రెడ్డిగారికి ఇచ్చారు.Fact :
భక్తులకోసం ఎప్పటి నుంచి కర్రలను ఇవ్వాలనేదానిపై టీటీడీ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. వైరల్ ఫోటోలో ఉన్న కర్రలకు, టీటీడీ తమ సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చిన కర్రలకు చాలా వ్యత్యాసం ఉంది.
తిరుమలకు మెట్లదారిలో నడచి వచ్చే భక్తులతో టీటీడీ లేదా వైఎస్సార్సిపి నాయకులు కర్రల వ్యాపారం మొదలుపెట్టారు, పదిరూపాయల అద్దె వసూలు చేయబోతున్నారంటూ కొందరు సోషల్ మీడియా, సోషల్ నెట్‌వర్క్‌లలో ప్రచారం చేస్తున్నారు.
"తిరుమలకు నడక ప్రయాణం చేసే భక్తులతో కర్రల వ్యాపారం. కర్రకి పదిరూపాయల రుసుము కట్టి తీసుకోవాలి. కర్ర తీసుకోకపోయినా పర్ హెడ్ కి పది రూపాయలు కట్టాల్సిందే. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే పులి మళ్ళీ వస్తాది. పది రూపాయలు కట్టాం కదా అని కర్ర తీసుకుని పోకూడదు. నడక పూర్తయ్యాక కర్ర వాపస్ చేయాలి. లేని యెడల కర్రకి 150 రూపాయలు వసూలు చేస్తారు. కర్రల కాంట్రాక్ట్ రెడ్డిగారిదే. కర్రలు ఊరికే రావు."
అనే వ్యాఖ్యానంతో కొన్ని కర్రలు ఉన్న ఫోటోని కొందరు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్‌చెకింగ్:
గత కొంతకాలంగా తిరుమలకు వెళ్ళే భక్తులపై చిరుతపులులు దాడి చేస్తున్నాయి. ఆ పులులను పట్టుకునేందుకు అటవీసాఖ అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు చేస్తూన్నారు.
మరోవైపు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆగస్టు 14, 2023 ఉదయం టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు రోజు, తర్వాత రోజు పులులు మెట్లదారి వద్ద కనిపించటంతో.. టీటీడీ బోర్డ్ కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
అందులో ఒకటి.. మెట్లదారిలో వెళ్ళే భక్తుల చేతికి కర్ర ఇవ్వటం. సెక్యూరిటీ గార్డులు ముందు వెనుక నడుస్తున్నప్పటికీ భక్తుల వద్దకూడా కర్ర ఉండటం వల్ల ఎంతోకొంత ఉపయోగం ఉంటుందని ఆ నిర్ణయం తీసుకున్నామని కరుణాకర రెడ్డి చెప్పారు.
ఆగస్టు 14 నాటి ప్రెస్ మీట్ వీడియో:
చేతి కర్రలు ఎప్పటి నుంచి భక్తులకు అందజేస్తారో ప్రకటించనప్పటికీ.. ఆగస్టు 17న టీటీడీ భద్రతా విభాగం.. 70 మంది సెక్యూరిటీ గార్డులను ప్రతి 250 మెట్లకు ఒకరిని నియమిస్తూ.. వారికి కర్రలను అందించింది.
IANS న్యూస్ రిపోర్ట్: https://ianslive.in/ttd-
వారు అప్పటినుంచి భక్తులతో నడుస్తున్నారు. వారిచేతిలో ఉన్నకర్రలకు, వైరల్ అవుతున్న ఫోటోలోని కర్రలకు చాలా వ్యత్యాసం ఉంది.
వైరల్ ఫోటోలోని కర్రలను పరిశిలిస్తే.. వాటిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటో కూడా కనిపిస్తుంది. ఈ ఫోటోను, రోటేట్ చేసి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే..
అది ఫ్లిప్‌కార్ట్ వెబ్సైటులోని వ్యాపారులు పెట్టిన లిస్టింగ్లలోని ఫోటోగా తేలింది.
మరోవైపు, ఆ కర్రలకు 'మా నమ్మకం నువ్వే జగన్ స్టికరింగ్ క్యాంపెయిన్ లో వాడిన స్టికర్ డిజైన్ ను ఎడిటింగ్ ద్వారా జత చేసినట్లుగా తెలుస్తోంది.
(ఇమేజ్ కర్టెసీ: సాక్షి. కామ్)
కాబట్టి, తిరుమలకు కాలినడకన మెట్లదారిలో వెళ్ళే భక్తులకు జగన్ బొమ్మ అతికించిన కర్రలను ఇవ్వటం, వాటికి పది రూపాయల అద్దె వసూలు చేయటం అబద్దం.