ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు. హెచ్.సీ.యు. భూములకు సంబంధించింది కాదు
వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు

Claim :
కంచ గచ్చిబౌలిలో నుండి నెమళ్లు, జింకలు పారిపోతున్న ఫోటో ఇదిFact :
వైరల్ ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద 400 ఎకరాల భూమిపై అన్ని కార్యకలాపాలను ఏప్రిల్ 3, 2025 మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. కంచ గచ్చిబౌలి స్థలంలో పచ్చదనాన్ని తొలగించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిఐఎల్లు) తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, న్యాయమూర్తి రేణుకా యారా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి)కి 400 ఎకరాల భూమిని కేటాయించడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు, ఇది అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972లోని సెక్షన్ 35 ప్రకారం ప్రభుత్వం ఆ స్థలాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు.
జీవవైవిధ్యం ఉన్న కంచ గచ్చిబౌలి ప్రాంతంలో పచ్చదనాన్ని నాశనం చేశారనే ఆరోపణలకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వం నుండి అధికారిక నివేదికను కోరింది. అవసరమైన విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ బృందం ప్రభుత్వ చర్యలను ఖండించారు. 10,000 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని ఆదాయ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరుతో అమ్ముతున్నారని, దాని కీలకమైన పర్యావరణ ప్రాముఖ్యతను పట్టించుకోలేదని విమర్శించింది.
“కంచ గచ్చిబౌలి ఒక కీలకమైన పర్యావరణ ప్రాంతాం, వలస పక్షులు, ఇండియన్ స్టార్ తాబేలు, మచ్చల జింక, ఇండియన్ రాక్ పైథాన్, మానిటర్ లిజార్డ్స్ వంటి అడవి జంతువులతో సహా 237 పక్షి జాతులకు నిలయం. ఇది హైదరాబాద్లో మిగిలి ఉన్న పట్టణ అడవులలో ఒకటి, ఈ జాతులకు ఆవాసాన్ని అందిస్తుంది. నగరానికి ఊపిరితిత్తుల లాగా పనిచేస్తుంది ”అని ఆ బృందం తెలిపింది.
ఇంతలో జేసీబీలతో పనులు జరుపుతూ ఉండగా.. జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లుగా అనిపించే ఓ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. నిజమైన ఫోటో అని భావించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు.
వైరల్ ఫోటోను నిశితంగా గమనించాం. అందులో మనుషుల జాడ అసలు కనిపించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఫోటోలోని వాహనాలను జూమ్ చేసి చూసినా కూడా మనుషులు కనిపించలేదు. దీన్ని బట్టి ఈ ఫోటో అసలైనది కాదని మాకు అనిపించింది.
ఇక మేము పలు ఏఐ డిటెక్షన్ టూల్స్ ను ఉపయోగించి వైరల్ ఫోటో అసలైనదా? కాదా? అని తెలుసుకోడానికి ప్రయత్నించాం. సైట్ ఇంజిన్, హైవ్ మోడరేషన్ లాంటి ఏఐ టూల్స్ వైరల్ ఫోటోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినట్లుగా ఫలితాలు చూపించాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను మీరు చూడొచ్చు.
కాబట్టి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోను నిజమైనదిగా పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇవి ఏఐ సృష్టి అని మేము ధృవీకరించాం.
మంగళవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయడం వల్ల భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇది తెలంగాణ, హైదరాబాద్ నగరం అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని అన్నారు. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురాగలదని, ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించగలదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఎన్నో జంతువులకు బతకడానికి ఎలాంటి ప్రాంతం కూడా ఉండదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.
కంచ గచ్చిబౌలి వద్ద హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆనుకుని ఉన్న 400 ఎకరాల్లో తవ్వకాలు, చెట్లను నరికివేయడం లాంటి పనులను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాల విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో అని అందరూ వేచి చూస్తున్నారు.
వైరల్ అవుతున్న ఫోటో ఏఐ సృష్టి అని మేము నిర్ధారించాం.