Fri Dec 27 2024 03:41:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ట్రక్కులో కుక్కలను చూపించే వైరల్ వీడియో ఇండోనేషియాకు చెందినది. హైదరాబాద్ కాదు.
హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలలో ఆహార కల్తీ, అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు ఇస్తున్నారనే వాదనతో కొన్ని వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో అధికారులు వరుస దాడులు చేసి..
Claim :
హైదరాబాద్లోని స్టార్ హోటళ్లకు ట్రక్కుల కొద్దీ కుక్కలను సరఫరా చేస్తున్న వీడియో. ఈ కుక్కలను స్టార్ హోటళ్లలో వంటల్లో వాడేందుకు తీసుకెళ్తున్నారుFact :
ఈ వీడియో పాతది. ఈ వీడియో 2021 సంవత్సరానికి చెందినది
హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలలో ఆహార కల్తీ, అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు ఇస్తున్నారనే వాదనతో కొన్ని వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో అధికారులు వరుస దాడులు చేసి.. హోటళ్ల యజమానులకు భారీ ఫైన్లను విధించారు.
హైదరాబాద్ నగరంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ఫోర్స్ బృందం, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి వరుసగా సోదాలను నిర్వహించింది. వివిధ రెస్టారెంట్లలో అనేక అక్రమ నిల్వ పద్ధతులను అధికారులు గుర్తించారు. చాలా హోటళ్లలో పరిశుభ్రత కూడా పాటించడం లేదని స్పష్టంగా తెలిసింది.
మాంసానికి ప్రత్యామ్నాయంగా స్టార్ హోటళ్లలో కుక్కల మాంసాన్ని ఉపయోగిస్తున్నారనే వాదనతో వీడియో వైరల్ అవుతూ ఉంది. కుక్కలతో నిండిన ట్రక్కును చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. స్టార్ హోటళ్లలో మాంసాహారం తినకూడదని వీడియోను షేర్ చేస్తున్న వారు హెచ్చరిస్తూ ఉన్నారు.
“హైదరాబాదులో స్టార్ హోటల్స్ మాంసాహారంగా సప్లై చేస్తున్న కుక్కలు దయచేసి ఎవరూ హోటల్లో బిర్యాని తినవద్దు”. అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో పాతది. ఇండోనేషియాకు చెందినది.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అప్పుడు డిసెంబర్ 22, 2021న డాగ్ మీట్-ఫ్రీ ఇండోనేషియా పేరుతో Instagram హ్యాండిల్లో ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము.
“Update on our amazing dog meat trade survivors from Sokoharjo. Rescued by @dogmeatfreeindonesia” అంటూ క్యాప్షన్ ను పోస్టు చేశారు. ఈ కుక్కలను రక్షించినట్లుగా అందులో తెలిపారు. వీటిని DMFI షెల్టర్లో ఉంచుతున్నామని తెలిపారు. ఈ కుక్కలు ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నాయని.. ఆనందంగా ఉండగలవంటూ ఇంస్టాగ్రామ్ పోస్టులో తెలిపారు.
ఒక X (ట్విట్టర్) హ్యాండిల్ 53 కుక్కలను రక్షించినట్లుగా కొన్ని చిత్రాలను షేర్ చేసింది. చిత్రాల్లో ఒకటి వైరల్ వీడియోలోని స్క్రీన్షాట్లతో సరిపోతుంది. “53 #dogs rescued last minute before slaughter in #Indonesia by local #police. The animals were tied up in sacks, muzzles bound tight with ropes or cables, eyes wide open with fear. We will keep you posted on what will happen next. Photo copyright: Dog Meat Free Indonesia” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. ఈ కుక్కలను చివరి నిమిషంలో కబేళాలకు తరలించకుండా కాపాడగలిగామని వివరించారు. ఈ కుక్కలను చాలా హింసించారని.. ఎంతో భయంతో ఉన్నాయని అందులో తెలిపారు. చివర్లో ఇండోనేషియా అంటూ హ్యాష్ ట్యాగ్ ను ఉంచారు.
ఈ ట్వీట్ ను క్యూగా తీసుకుని , మేము కీ వర్డ్ సెర్చ్ ను చేశాం. '53 కుక్కలను రక్షించడానికి పోలీసులు అక్రమ కబేళాను ఛేదించారు' అనే శీర్షికతో, humanesociety.orgలో ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము. ‘Police bust illegal slaughterhouse to save 53 terrified dogs’ అనే టైటిల్ తో ఆర్టికల్ ను పోస్టు చేశారు.
ట్రక్లో కుక్కలను ఉంచేశారని.. ఒక్కొక్క కుక్కని మెడ వరకు ఒక సంచిలో కట్టేసి ఉంచారు. కొన్నింటి నోళ్లు కూడా కట్టేశారని కథనం పేర్కొంది. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ 'డాగ్ మీట్ ఫ్రీ ఇండోనేషియా' లోని ఇతర సభ్యులతో కలిసి కుక్కలను రక్షించారు. వీరంతా కుక్క, పిల్లి మాంసం వ్యాపారాలను నిషేధించాలని పోరాడుతూ ఉన్నారు. కాపాడిన తర్వాత కుక్కలను పరిశీలించి.. షెల్టర్ హోమ్ కు తరలించారు.
కుక్కలతో నిండిన ట్రక్కును హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లకు రవాణా చేస్తున్నట్లు చూపుతున్న వైరల్ వీడియో హైదరాబాద్ కు సంబంధించిన వీడియో కాదు. ఇది ఇండోనేషియాలో కుక్కలను రక్షించిన పాత వీడియో. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : హైదరాబాద్లోని స్టార్ హోటళ్లకు ట్రక్కుల కొద్దీ కుక్కలను సరఫరా చేస్తున్న వీడియో. ఈ కుక్కలను స్టార్ హోటళ్లలో వంటల్లో వాడేందుకు తీసుకెళ్తున్నారు
Claimed By : Youtube Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Youtube
Fact Check : False
Next Story