Mon Dec 23 2024 03:18:46 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: గోధుమ పిండిని ఉపయోగించి గ్యాస్ సిలిండర్ నుండి వచ్చే మంటలను ఆర్పలేము
LPG సిలిండర్ల వినియోగం గురించి సరిగ్గా తెలియకపోతే.. ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సిలిండర్ పేలుడు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా పోయాయి. సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవ్వకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ లీకేజీకి సంబంధించిన కొన్ని భద్రతా చిట్కాలను ముందుగానే తెలుసుకుంటే,
Claim :
గ్యాస్ సిలిండర్ నుండి ఎగసిపడే మంటలను ఆర్పడానికి గోధుమ పిండిని ఉపయోగించవచ్చుFact :
గ్యాస్ సిలిండర్ నుండి వచ్చే మంటలను ఆపడానికి పిండిని ఉపయోగించకూడదు. గోధుమ పిండి అగ్నిని మరింత వ్యాపింపజేస్తుంది.
LPG సిలిండర్ల వినియోగం గురించి సరిగ్గా తెలియకపోతే.. ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సిలిండర్ పేలుడు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా పోయాయి. సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవ్వకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ లీకేజీకి సంబంధించిన కొన్ని భద్రతా చిట్కాలను ముందుగానే తెలుసుకుంటే, మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా సులభంగా కాపాడుకోవచ్చు. వంటగదిలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడం చూసి చాలా మంది భయాందోళనలకు గురవుతారు. గ్యాస్ వాసన వచ్చినప్పుడు, మొదట గ్యాస్ లీక్ అయ్యే స్థలాన్ని కనుగొనండి. సిలిండర్ లేదా రెగ్యులేటర్ నుండి గ్యాస్ లీక్ అయిన వెంటనే పేలదు. గాలి ఆడని గదిలో పూర్తిగా వ్యాపించేసిన తర్వాత.. అది ఎక్కడికీ పోలేకపోతే ఏదైనా స్పార్క్ కారణంగా గ్యాస్ పేలుడు జరిగే అవకాశం ఉంటుంది.
గ్యాస్ లీక్ అయినప్పుడు మీ కళ్ళు ,ముక్కును కవర్ చేయడం మర్చిపోవద్దు. నోటికి గుడ్డ కట్టుకోవడం ద్వారా శరీరంలోకి గ్యాస్ చేరకుండా ఆపవచ్చు. సిలిండర్‌కు మంటలు అంటుకున్నట్లయితే భయపడకండి. మందపాటి దుప్పటిని నీటిలో నానబెట్టి, వీలైనంత త్వరగా సిలిండర్ మీద చుట్టండి. అయితే గోధుమ పిండితో గ్యాస్ లీక్ ను ఆపవచ్చంటూ కొందరు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ‘*గుప్పెడు గోధుమ పిండి తో మండుతున్న సిలిండర్ ను ఇట్టే అర్పేయొచ్చు, ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి.*’ అంటూ వాట్సాప్ లో వీడియోను వైరల్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 2023లో కూడా ఈ వీడియో వైరల్ అయింది. “గుప్పెడు గోధుమ పిండి తో మంటని ఎలా ఆర్పచ్చో చూడండి.” అంటూ వీడియోను పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. గ్యాస్ సిలిండర్ నుండి వచ్చే మంటలను గోధుమ పిండి ఆపదు.
మేము మంటలను ఆర్పడానికి సురక్షితమైన పద్ధతుల కోసం వెతకగా.. గోధుమ పిండి మంటలను ఆర్పలేదని మేము కనుగొన్నాము. UK కు చెందిన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రచురించిన వీడియోను మీరు గమనించవచ్చు. గోధుమపిండిని మంట మీద పోసినప్పుడు పిండి బాగా మండుతుందని నిరూపించింది.
మంటల మీద పిండిని పోయడం ప్రమాదకరమని నిరూపించే మరొక వీడియోను ఇక్కడ చూడొచ్చు.
firefighternow.com లో వచ్చిన ఓ ఆర్టికల్ ప్రకారం.. పిండి ఎలాంటి మంటలను ఆర్పలేదని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిండిని మంటలపైకి విసిరేయకూడదని సూచించారు. వీటికి మండే గుణం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇది మంటలను అణచివేయకపోగా.. మరింత పెంచే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు.. బయటకు వెళ్లి అగ్నిమాపక విభాగానికి కాల్ చేయడం బెటర్.
పిండికి మండే స్వభావం ఉంటుంది. అధిక వేడికి వేగంగా ప్రతిస్పందిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పిండి వేస్తే పేలుడు మరింత తీవ్రమవుతుంది. అందువల్ల, గ్యాస్ సిలిండర్ నుండి వచ్చే మంటలను పిండి ఆర్పివేయగలదనే వాదనలో ఎలాంటి నిజం లేదు. పిండి మండే పదార్థం కాబట్టి, మంటలను ఆర్పడానికి ఉపయోగించకూడదు.
Claim : గ్యాస్ సిలిండర్ నుండి ఎగసిపడే మంటలను ఆర్పడానికి గోధుమ పిండిని ఉపయోగించవచ్చు
Claimed By : Whatsapp Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Whatsapp
Fact Check : False
Next Story