కేసీఆర్ ఇలాంటి ఫిట్టింగ్ పెట్టారేంటి?
గత మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యలేకు దూరంగా ఉంటూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారి కోసం కొంత టైం కేటాయిస్తున్నారు. ప్రగతి భవన్ లోకి ఇన్నాళ్లూ మంత్రులకే సీఎం అపాయింట్ మెంట్ దొరకడం కష్టం. అటువంటిది ఎమ్మెల్యేలు వెళ్లాలంటే అసాధ్యమే. కేసీఆర్ ఎన్ని విమర్శలు ఈవిషయంలో వచ్చినా ఎమ్మెల్యేలకు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఎమ్మెల్యేలతో ముఖాముఖికి సిద్ధమయ్యారు. వారి నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు.
ఎమ్మెల్యేలతో సమావేశాలు...
నిన్న మొన్నటి వరకూ ఇంటలిజెన్స్ నివేదికలు, సర్వే రిపోర్ట్ లతో ఎమ్మెల్యేల పనితీరును కేసీఆర్ తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ రెండు సర్వేలు చేయించిన కేసీఆర్ వాటి ఫలితాలను కూడా ఎమ్మెల్యేల ముందుంచారు. కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పనితీరు మార్చుకోకుంటే ఇబ్బంది తప్పదని హెచ్చరికలు కూడా కేసీఆర్ జారీ చేశారు. అయితే సర్వేలు ఒకవైపు చేయిస్తూనే మరో వైపు ఎమ్మెల్యేల మనోగతాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి సమస్యలను వింటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు.
సంక్షేమ పథకాల అమలుపై ఆరా....
కేసీఆర్ దాదాపు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఎమ్మెల్యలతో భేటీ అవుతున్నారు. వ్యక్తిగతంగా సమావేశమై వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాల్లో అమలవుతున్న తీరును తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏఏ అభివృద్ధి పనులు జరిగాయి...సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా? అన్న విషయాలను కేసీఆర్ ఆరా తీస్తున్నారు. పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు.
పనితీరు బేరీజు వేసేందుకేనా?
అలాగే నియోజకవర్గంలో వారి పనితీరును వారినే అడుగుతున్నారు. ఎన్ని గ్రామాల్లో ఇప్పటి వరకూ పర్యటించారు? మూడున్నరేళ్లుగా ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? ఎన్ని సమస్యలను పరిష్కరించగలిగారు..? నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలేంటి? ఉచిత 24 గంటల విద్యుత్తుపై రైతుల అభిప్రాయాలేంటి అన్ని విషయాలను ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటో వారిని అడుగుతున్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయినవి ఏవైనా ఉన్నాయా? అని కూడా అడుగుతున్నారు. ఇప్పటికే నల్లగొండ, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మిగిలిన జిల్లాల ఎమ్మెల్యలతో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై వినతులను పెద్దయెత్తున ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేసేందుకే ఈ ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యేలే అభిప్రాయపడుతున్నారు.
- Tags
- కేసీఆర్