Sun Dec 22 2024 21:11:30 GMT+0000 (Coordinated Universal Time)
వినాయక చవితి రోజు చంద్రున్ని చూడొద్దని ఎందుకంటారు?
వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు...ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే…ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందే.
వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు...ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే…ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందే. సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సైతం తన సృష్టి రచనకి ముందు గణపతిని పూజించినట్టుగా 'ఋగ్వేదం' చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చవితి ఎందుకు జరుపుకొంటారు అందరికి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు చంద్రున్ని చూడవద్దని చెబుతుంటారు. మరి పురాణాలు, వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం..
కైలాసంలోని పార్వతీ...శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసి ప్రాణం పోసి వాకిట్లో కాపలా వుంచి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు..ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంచే ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుందని పురాణాలు చెబుతున్నాయి.
దాంతో శివుడు.. గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడి దేహభాగానికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. ఆ బాలకుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి గణాధిపతిని చేశాడు. అలాంటి గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి శివుడి శిరస్సున గల చంద్రుడు నవ్వాడు. దాంతో ఆ రోజున (భాద్రపద శుద్ధ చవితి) ఎవరైతే చంద్రుడిని చూస్తారో .. వారు నీలాపనిందలను ఎదుర్కుంటారని గణపతి శపించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతా కలిసి వినాయకుడికి నచ్చజెప్పడంతో, ఆ రోజున తన కథ చెప్పుకుని అక్షింతలు తలపై ధరించిన వారికి ఈ శాపం వర్తించదని చెప్పాడు.
ఇక పాల పాత్రలో ఆ రోజున చంద్రుడిని చూసినందుకు గాను శ్రీ కృష్ణుడంతటి వాడుకూడా నీలాపనిందలను మోయవలసి వచ్చిందని, ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు.. మానవులు ఈ రోజున వినాయకుడిని పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించసాగారు. ఆ రోజు నుంచి గణ నాయకుడిగా.. విద్యా విజ్ఞాలను ప్రసాదించే అధినాయకుడిగా వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. తన భక్తులు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా అనుగ్రహిస్తున్నాడు.
News Summary - Ganesh Chaturthi 2023: What Happen If We See Moon On The Day Of Vinayaka Chavithi
Next Story