Sun Dec 22 2024 11:31:11 GMT+0000 (Coordinated Universal Time)
వినాయక పూజ ఎలా చేయాలి?
వినాయక చవితి సందర్భంగా అందరి ఇళ్లలో సందడి నెలకొంటుంది. పిల్లలు పెద్దలతో సంతోషంగా పండగ జరుపుకొంటారు..
ఏకదంతాయ విద్మ హే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతి: ప్రచోదయాత్ |
తత్కరాటాయ విద్మ హే హస్తిముఖాయ ధీమహి
తన్నో దంతి : ప్రచోదయాత్ |
లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి
తన్నో దంతి: ప్రచోదయాత్ | అంటూ విఘ్నేశ్వరుని నమస్కరించుకుని వినాయక చతుర్థి నాడు పూజ ఎలా చేయాలో చూద్దాం..!
వినాయక చవితి సందర్భంగా అందరి ఇళ్లలో సందడి నెలకొంటుంది. పిల్లలు పెద్దలతో సంతోషంగా పండగ జరుపుకొంటారు. అయితే కొందరు వినాయకుని పూజ చేసే సమయంలో హడావుడిగానే చేసేస్తుంటారు. అయితే మరి ఇంట్లో వినాయకున్ని ఎలా పూజించాలి. ఎలాంటి నియమాలు పాటించాలో పండితులు తెలిపిన వివరాల ప్రకారం అందిస్తున్నాము.గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు ధరించి.. పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి.ఆకుపచ్చ రంగు వస్త్రమును కప్పిన కలశమును, వినాయకుడి ఫోటో లేదా శ్వేతార్క గణపతి ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. పసుపురంగు అక్షింతలు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి మాలలతో గణపతిని అలంకరించుకోవాలి.
నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయ వంటివి తయారు చేసుకోవాలి. దీపారాధనకు రెండు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను ఉంచి, కొబ్బరినూనెతో దీపమెలిగించి పూజా ప్రారంభించాలి. విగ్రహాన్ని పూజకు ఉపయోగించిన పక్షంలో... మండపంపై విగ్రహం ఉంచి పవిత్ర జలంపై పాదాల్ని కడగాలి. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో పంచామృత స్నానం చేయించాలి. ప్రతి అమృతానికి నడుమ నీటితో శుభ్రం చేస్తుండాలి. తర్వాత వినాయక ప్రతిమకు గంధం, అద్ది, ఎరుపులేదా, పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే చతుర్థినాడు మట్టితో తయారు చేసిన బొమ్మను పూజలో ఉంచడం శ్రేష్ఠం.
కర్పూర హారతులను సమర్పించేందుకు ముందు గణపతి అష్టోత్తరము, ఋణవిమోచక గణపతి స్తోత్రమ్, గణపతి సహస్రనామం, శ్రీ గణేశారాధనలతో స్తుతించడం లేదా "ఓం గం గణపతయే నమః" అనే మంత్రమును 108 సార్లు జపించాలి. తర్వాత నేతితో పంచహారతులివ్వడమో, లేదా కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
ఇకపోతే.. ఇంట్లో పూజకోసం ఉంచిన మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి, హారతి ఇస్తుండాలి. పూజ పూర్తయ్యాక అక్షింతలు చల్లి, విగ్రహాన్ని కదిలించాలి. తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి. వినాయక చతుర్థి నాడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని, అయినవల్లి విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడం శ్రేయస్కరం. అలా కుదరని పక్షంలో సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.
అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యానశ్లోకం, గరికెతో గణపతి గకార అష్టోత్తరం, గణేశ నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశాభివృద్ధి, సకలసంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు గణపతి స్తోత్రమాల, గరికెతో గణపతి పూజ, శ్రీ గణేశారాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు
Next Story