Mon Dec 23 2024 06:41:37 GMT+0000 (Coordinated Universal Time)
మోనాలిసా పెయింటింగ్ పై సూప్ విసిరేశారు.. ఆ తర్వాత ఏమైందంటే?
పారిస్లో లియోనార్డో డా విన్సీ వేసిన పెయింటింగ్ మోనాలిసా పై ఇద్దరు నిరసనకారులు
పారిస్లో లియోనార్డో డా విన్సీ వేసిన పెయింటింగ్ "మోనాలిసా" పై ఇద్దరు నిరసనకారులు సూప్ విసిరారు. అయితే ఆ పెయింటింగ్ ముందు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండడంతో పెయింటింగ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని పెయింటింగ్ ను కాపాడుతున్న సంస్థ తెలిపింది. మోనాలిసా చిత్రపటంపై సూప్ పోసిన తర్వాత.. మీకు ఇలాంటి కళాఖండాలు ముఖ్యమా? ఆరోగ్యకరమైన, సుస్థిరమైన ఆహార వ్యవస్థ ముఖ్యమా? అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులు రిపోస్టే అలిమెంటైర్ అనే ఫ్రెంచ్ సంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఆరోగ్యకరమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఫ్రెంచ్ రాజధాని లౌవ్రే మ్యూజియంలో ఇద్దరు మహిళలు ఎరుపు, నారింజ సూప్ విసిరారని AFP వీడియో జర్నలిస్ట్ నివేదించారు.
16వ శతాబ్దానికి చెందిన మోనాలిసా చిత్రపటం ఇప్పటివరకు అనేక దాడులకు గురైంది. 1911లో ఈ వర్ణచిత్రం ఓ మ్యూజియం ఉద్యోగి చేతిలో చోరీకి గురైంది. 1950లో దీనిపై యాసిడ్ దాడి కూడా జరిగింది. అప్పటినుంచి దీన్ని బుల్లెట్ ప్రూఫ్ తో చేసి గ్లాస్ షోకేస్ లో ఉంచి ప్రదర్శిస్తున్నారు. మీ వ్యవసాయ వ్యవస్థ దారుణంగా ఉంది.. రైతులు చనిపోతున్నారంటూ.. మెరుగైన జీతం, పన్నుల తగ్గింపు వంటివి డిమాండ్ చేస్తూ ఫ్రెంచ్ రైతులు రోజుల తరబడి నిరసనలు చేస్తుండడంతో కొందరు నిరసనకారులు ఈ పని చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు రోడ్ల మీదకు వచ్చారు. 36 ఏళ్ల వ్యక్తి మే 2022లో కూడా మోనాలిసా పెయింట్ పై కస్టర్డ్ పై విసిరాడు.
Next Story