Mon Dec 23 2024 03:22:34 GMT+0000 (Coordinated Universal Time)
ముక్కులో ఏకంగా ఈగల 150 లార్వాలు.. మెదడు దాకా..!
రోగి ముక్కులో ఏకంగా ఈగల 150 లార్వాలు
కోవిడ్, మ్యూకోర్మైకోసిస్ రోగాల నుండి ప్రాణాలతో బయటపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆమె ముక్కులో ఉన్న వాటిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. దాదాపు 150 లార్వాలను (మాగ్గోట్స్, హౌస్ ఫ్లైస్) ఆమె ముక్కు నుండి తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల గృహిణిని ఆసుపత్రికి తరలించారు. ఆమె సెమీ కోమా స్థితిలో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే మహిళకు ఆరు నెలల క్రితం కోవిడ్ సోకింది. తరువాత మ్యూకోర్మైకోసిస్ అభివృద్ధి చెందింది. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ ఆమె మెదడుకు వ్యాపించడంతో, ఆమె కుడి కన్ను తొలగించాల్సి వచ్చింది. కోవిడ్ ఇన్ఫెక్షన్ మూత్రపిండాల పనితీరును కూడా బలహీనపరిచింది. మధుమేహానికి కూడా దారి తీసింది.
అయితే ఆమెకు కొన్ని పరీక్షలు చేయగా ఊహించని విషయం బయటకు వచ్చింది. ఆమె మెదడుకు అతి దగ్గరలో ఈగ లార్వాలను గుర్తించారు. రోగిని పరిశీలించినప్పుడు మెదడుకు దిగువన ఈగల లార్వాల సమూహం కనిపించింది. బలహీనమైన మూత్రపిండాల పనితీరు, అధిక బీపీని తగ్గించి ఆమెకు ఆపరేషన్ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. వైద్యులు, నెఫ్రాలజిస్ట్ల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రయత్నిస్తుండగా, లార్వాలను బయటకు తీసే ప్రక్రియ కూడా ఏకకాలంలో ప్రారంభించబడింది.
ఈ అరుదైన పరిస్థితి ఎలా సంభవించిందో వివరిస్తూ, ఆ లార్వాలను తొలగించే ప్రక్రియకు నాయకత్వం వహించారు సెంచరీ హాస్పిటల్లోని స్కల్ సర్జన్, సీనియర్ ENT కన్సల్టెంట్ డాక్టర్ నారాయణన్ జానకిరామ్. ఆయన మాట్లాడుతూ, "మన చర్మంపై దోమ లేదా ఈగలు దిగినప్పుడు, మనం వాటిని గుర్తించి తరిమికొట్టే ప్రయత్నం చేస్తాం. కానీ మ్యూకోర్మైకోసిస్ రోగులలో వారు ప్రభావిత ప్రాంతంలో స్పర్శను కోల్పోతారు.. కాబట్టి వారు ఏమీ అనుభూతి చెందలేరు." అని అన్నారు. "ఈ సందర్భంలో, రోగి ఏమీ అనుభూతి చెందలేకపోవడంతో, ఈగలు ముక్కులోకి ప్రవేశించి గుడ్లు పెట్టాయి. గుడ్లు పొదిగి లార్వాలా బయటకు వచ్చాయి. ఇవి మెదడులోకి ప్రవేశించి మెనింజైటిస్కు కారణం కావచ్చు." అని వివరించారు. "ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఆమె ఎడమ కన్నుతో చూడగలుగుతుంది. ఆమె నడుస్తోంది. తన సాధారణ ఇంటి పనులు చేసుకుంటోందని" అని డాక్టర్ తెలిపారు.
Next Story