Mon Dec 23 2024 11:27:02 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ క్యాంపింగ్ ప్రియుల కోసం 'గ్లాంపింగ్' రాబోతోంది..!
పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క స్పెసిఫికేషన్ల ప్రకారం గ్లాంపింగ్ సైట్ ప్రమాణాలు త్రీ-స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి
సోమవారం నుండి శుక్రవారం వరకూ కంప్యూటర్స్, ల్యాప్ టాప్ ల ముందు అతుక్కుని ఉండే వారు.. వీకెండ్స్ లో పార్టీలు మాత్రమే చేసుకోకుండా అప్పుడప్పుడు క్యాంపింగ్ లకు కూడా వెళుతూ ఉంటారు. అలా ప్రకృతిలో మమేకమైపోయి.. ఆ తర్వాత కాంక్రీట్ జంగిల్ లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇక క్యాంపింగ్ అంటే పిచ్చి ఉన్నోళ్లు కూడా చాలా మందే.. ఛాన్స్ దొరికిందంటే చాలు నచ్చిన చోటుకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు.
ఇక తెలంగాణలో కూడా క్యాంపింగ్ ఇష్టం ఉన్న వాళ్ల కోసం కొత్త.. కొత్తగా ఏదో ఒకటి అందించాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డి.ఏ.) కూడా సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. క్యాంపింగ్ పిచ్చి ఉన్నోళ్లకు గ్లాంపింగ్ ను అందించాలని అనుకుంటూ ఉంది. ఇంతకూ గ్లాంపింగ్ అంటే ఏమిటనే కదా మీ డౌట్.. సాధారణంగా క్యాంపింగ్ కు వెళ్లే వారికి అద్భుతమైన సౌకర్యాలు లభించవు. కేవలం తినడానికి తిండి.. ఉండడానికి కొన్ని టెంట్స్ లభిస్తాయి. అయితే ఈ విషయంలో మాత్రం అద్భుతమైన హంగులను క్యాంపింగ్ కు వచ్చే వాళ్లకు అందించాలని హెచ్.ఎం.డి.ఏ. సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. లగ్జరీ స్టే, ఫుడ్, సర్వీస్ వంటివి అందించేలా కొత్త ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది.
అవుట్డోర్ క్యాంపింగ్ డిక్షనరీలో లగ్జరీ అనేది ఎక్కడా లేదు. ఆ విషయంలోనే హెచ్.ఎం.డి.ఏ. సరికొత్తగా ఆలోచించింది. సంగారెడ్డిలోని బొంతపల్లి అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో 'గ్లాంపింగ్ సైట్'ను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ క్యాంపింగ్ కాన్సెప్ట్కు 'గ్లామర్', విలాసాన్ని జోడించడంతో నగరంలోని క్యాంపింగ్ ఔత్సాహికులకు మంచి డెస్టినేషన్ లా మారనుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 15 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టును 'లైసెన్స్ టు ఆపరేట్' ప్రాతిపదికన ప్రతిపాదించారు. అడ్వెంచర్ మరియు లగ్జరీని ఇష్టపడే వారికి ఉద్దేశించిన ఈ సదుపాయం ఔటర్ రింగ్ రోడ్ నుండి 10 కి.మీ, హైదరాబాద్ నగరం పశ్చిమ ప్రాంతాల నుండి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ 25 విలాసవంతమైన టెంట్ లను కలిగి ఉంటుంది, ఒక్కొక్కటి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
"పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క స్పెసిఫికేషన్ల ప్రకారం గ్లాంపింగ్ సైట్ ప్రమాణాలు త్రీ-స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి సమానంగా ఉంటాయి" అని HMDA అధికారి ఒకరు తెలిపారు. ఔత్సాహికులు ట్రెక్కింగ్, సఫారీ మార్గాలను ఆస్వాదించవచ్చు. పక్షులను చూసేందుకు ప్రత్యేకంగా డెక్ లు.. సైట్లో టవర్లు, ఇతర సాహస కార్యకలాపాలను చేయడం వంటివి అదనంగా ఉంటాయి. "పర్యావరణ వ్యవస్థకు ఎటువంటి భంగం కలగకుండా చూసుకోవడం ద్వారా పలు కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ప్రకృతికి హాని కలిగించవు. ఒక్క చెట్టు కూడా తొలగించబడదు. 53 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం అనుమతించబడదు" అని హెచ్ఎండిఎ అధికారి తెలిపారు. ఇతర మౌలిక సదుపాయాలలో పాటూ అంతర్గత నడక మార్గాలు, నీరు, విద్యుత్ సరఫరా, అగ్నిమాపక పరికరాలు, CCTV నిఘా, నీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ.. ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయి. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రమాణాలు, నిబంధనలు అనుసరించబడతాయని అధికారులు తెలిపారు.
Next Story