Sun Dec 22 2024 16:44:06 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రుల్లో నిద్రలేకపోతే బీపీ పెరుగుతుందా?..పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
ప్రస్తుతం చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవన విధానం కారణంగా వివిధ రకాల వ్యాధులు..
ప్రస్తుతం చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవన విధానం కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే చాలా మందిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. ఈ నిద్రలేమి సమస్య వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎంతో మంది రాత్రులలో సరైన నిద్రపోరు. టెన్షన్, ఒత్తిడి, ముఖ్యంగా రాత్రుల్లో మొబైల్ ఫోన్లు ఆపరేటింగ్ చేయడం, కంప్యూటర్ల ముందు గడపడం, అలాగే కొందరు ఉద్యోగులు నైట్ డ్యూటీ చేయడం కారణంగా సరైన నిద్ర ఉండదు. దీని వల్ల వివిధ రకాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రాత్రుల్లో సరైన నిద్ర లేని కారణంగా దాని ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది. ప్రతి రోజూ రాత్రుళ్లు 7-8 గంటలు సరైన నిద్ర లేక పోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హై బీపీ.. అధిక రక్తపోటు ముఖ్యంగా గుండెకు ప్రమాదకరం. గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇప్పుడు ప్రముఖ హెల్త్ పబ్లికేషన్ ‘హైపర్టెన్షన్’లో ప్రచురించబడిన అధ్యయన నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. రాత్రిపూట మంచి నిద్ర సక్రమంగా లేకపోతే మహిళల్లో బీపీ పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. 25 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న 65,000 మంది మహిళలపై పరిశోధకులు పరిశోధన నిర్వహించారు. ఇది పదహారేళ్ల సుదీర్ఘ అధ్యయనం. వారిలో చాలామందికి చదువుకునే సమయంలో బీపీ సమస్యలు లేవు. అయితే ఆ తర్వాత చాలా మందికి బీపీ పట్టుకుంది. వీరందరికీ నిద్ర సమస్యలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. నిద్రలేమి, నిద్రలో లేవడం, గాఢనిద్ర రాకపోవడం వంటి సమస్యలన్నీ హైబీపీకి దారితీస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే 70 మిలియన్లకు పైగా అమెరికన్లు నిద్ర లేమితో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. చాలా మంది అమెరికన్లకు అధిక రక్తపోటు బాధపడుతున్నారని గతంలో డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 30 -79 సంవత్సరాల మధ్య వయస్సు గల 1.28 బిలియన్ ప్రజలు అధిక రక్తపోటుతో జీవిస్తున్నారని, వారిలో 700 మిలియన్ల కంటే ఎక్కువ మంది దీనికి చికిత్స పొందడం లేదని తెలిపింది.
Next Story